Share News

Assembly Speaker: దొంగల్లా వచ్చి వెళ్తున్నారు!

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:36 AM

కొంత మంది సభ్యులు ఎవరికీ కనిపించకుండా అసెంబ్లీకి వచ్చి హాజరుపట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.

Assembly Speaker: దొంగల్లా వచ్చి వెళ్తున్నారు!

  • వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఆగ్రహం

  • హాజరుపట్టికలో దొంగతనంగా సంతకాలు పెట్టాల్సిన కర్మ ఏంటి?

  • సభకు ముఖం చాటేస్తారా?

  • ప్రశ్నలు వేస్తున్నారు.. అసెంబ్లీకి రావడం లేదు

  • ఎన్నుకున్న ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలవాలి

  • ఓట్లేసినవారికి తలవంపులు తేవొద్దు

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కొంత మంది సభ్యులు ఎవరికీ కనిపించకుండా అసెంబ్లీకి వచ్చి హాజరుపట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ‘దొంగల్లా వచ్చి వెళ్తున్నారు. మిమ్మల్ని ప్రజలెన్నుకున్నారు.. మీరంతా ఎమ్మెల్యేలు. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన కర్మ ఏమొచ్చింది? గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలా చేయడం కరెక్టు కాదు. హాజరుపట్టికలో సంతకం చేసి సభకు ముఖం చాటేయడం వారి గౌరవాన్ని తగ్గించింది తప్ప పెంచలేదు’ అని అన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు బాలనాగిరెడ్డి, బి.విరూపాక్షి కర్నూలులో గ్రీన్‌కో ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పినట్లుగా (డీమ్డ్‌ టూ బీ ఆన్సర్‌) స్పీకర్‌ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నుంచీ వైసీపీ సభ్యుల నుంచి వస్తున్న ప్రశ్నలకు ఆయన అలాగే ప్రకటిస్తున్నారు. గురువారం మాత్రం సీరియస్‌ అయ్యారు. ప్రశ్నోత్తరాల మధ్యలో కీలకమైన విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నట్లు సభలో ప్రకటించారు. ‘ఈ సభలో మీ దృష్టికి ఒక విషయం తీసుకురావలసిన అవసరముంది. ఈ సమావేశాల్లో దురదృష్టవశాత్తు దాదాపు 25 ప్రశ్నలకు సభలో సమాధానాలు లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు. కానీ సభకు రావడం లేదు. వారు ప్రశ్నలు వేయడం వల్ల సభలో ఉన్న మరో ఇద్దరు సభ్యులకు మాట్లాడే అవకాశం పోతోంది. సభకు ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. అసెంబ్లీకి వెళ్లి మా సమస్యలపై మాట్లాడమని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు’ అని చెప్పారు.


ఇదే సమయంలో ఎవరికీ కనిపించకుండా కొంత మంది సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరుపట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. వీరిలో ముఖ్యంగా వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), తాటిపర్తి చంద్రశేఖర్‌ (యర్రగొండపాలెం), వేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు), విశ్వేశ్వరరాజు(పాడేరు), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), దాసరి సుధ (బద్వేలు) ఉన్నారని.. గత నెల 24న గవర్నర్‌ ప్రసంగం ముగిశాక.. వేర్వేరు తేదీల్లో హాజరుపట్టికలో వారు సంతకాలు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ‘అంత దొంగచాటుగా వచ్చి దొంగల మాదిరిగా సంతకాలు చేయాల్సిన అవసరం లేదు. సంతకాలు చేసిన వారెవరూ సభలో నాకు కనిపించలేదు. ఇది ఎంత వరకూ సమంజసమో వారే నిర్ణయించుకోవాలి. ఎన్నుకున్న ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలవాలే తప్ప.. ఓట్లేసినవారికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించకూడదు’ అని హితవు పలికారు. అధికార పక్షం సభకు రానివ్వదని వైసీపీ ఎమ్మెల్యేలు భయపడ్డారా అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనసేన సభ్యుడు కొణతాల రామకృష్ణ స్పందిస్తూ.. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ సభకు రాకుండా సంతకాలు పెట్టడంపై ఎథిక్స్‌ కమిటీకి నివేదించాలని కోరారు. దీనిపై ఆలోచించి రూల్స్‌ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ చెప్పారు.

  • సంతకాలు చేసినవారిలో

వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), తాటిపర్తి చంద్రశేఖర్‌ (యర్రగొండపాలెం), వేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు), విశ్వేశ్వరరాజు(పాడేరు), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), దాసరి సుధ (బద్వేలు)

Updated Date - Mar 21 , 2025 | 04:41 AM