Funds: ఎప్పుడు చెల్లిస్తారో?
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:31 PM
Palle Panduga Bills మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహమీ పథకం ద్వారా ప్రభుత్వం పల్లెపండుగ పేరుతో గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, గోకులాల షెడ్లను నిర్మించింది. పనులు చేసిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని అఽధికారులు చెప్పడంతో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు లక్షల రూపాయిలు పెట్టుబడులు పెట్టి శరవేగంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే, పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించలేదు.

‘పల్లె పండుగ’ బిల్లుల కోసం ఎదురుచూపు
పనులు పూర్తయినా డబ్బులు చెల్లించని ప్రభుత్వం
ఆందోళనలో కాంట్రాక్టర్లు, పాడిరైతులు
నరసన్నపేట, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహమీ పథకం ద్వారా ప్రభుత్వం పల్లెపండుగ పేరుతో గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, గోకులాల షెడ్లను నిర్మించింది. పనులు చేసిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని అఽధికారులు చెప్పడంతో టీడీపీ నేతలు, కాంట్రాక్టర్లు లక్షల రూపాయిలు పెట్టుబడులు పెట్టి శరవేగంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే, పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించలేదు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. అధికారులు దగ్గరుండి నాణ్యతతో పనులు చేయించారని, ఇప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.84కోట్లతో 148 పనులు
నరసన్నపేట నియోజకవర్గంలోని నరసన్నపేట, సారవకోట, జలుమూరు, పోలాకి మండలాల్లో 145 గ్రామాల్లో ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో పల్లెపండుగ కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలకు సంబంధించి 148 పనులకు గాను ఉపాధి నిధులు రూ.84.69 కోట్లు మంజూరు చేసింది. నవంబరులో వివిధ గ్రామాల్లో వేసిన రోడ్లకు కూడా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. ఇప్పటి వరకు రూ.17కోట్లు విలువ చేసే పనులు పూర్తికాగా, కేవలం రూ.3కోట్లు మాత్రమే చెల్లించారు. మరో రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే, పాడిరైతులకు 47 గోకులాల షెడ్లు మంజూరు కాగా, కొందరు రైతులు పెట్టుబడులు పెట్టి పనులు పూర్తి చేశారు. వారికి కూడా ఇంత వరకు బిల్లులు అందలేదు. దీంతో పనులు చేసిన వారు తీవ్ర నైరాశ్యంలో కూరుపోయారు. తాము పనులు చేసిన వెంటనే క్వాలిటీ అఽధికారుల బృందం కూడా వచ్చి తనిఖీలు చేసిందని, అయినా బిల్లులు రాలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రతి శుక్రవారం బిల్లులు జమ అవుతాయని చెప్పారని, కానీ నెలలు గడుస్తున్నా చెల్లించకపోవడం దారుణం అంటున్నారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు, పాడి రైతులు కోరుతున్నారు.