ఉగాదికి ముందే తలుపుతట్టిన అదృష్టం
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:17 AM
ఉగాదికి ముందే ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు అదృష్టం తలుపుతట్టింది. ఎన్నో విలువైన కానుకలు గెలుచుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన పాఠకుల ఇంట సందడి కనిపించింది.

ఉత్సాహంగా కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా
ప్రథమ బహుమతి విజేత బల్లా రామకృష్ణ
100 మందికి కన్సొలేషన్ బహుమతులు
ఇలాంటి కార్యక్రమాలతో ‘ఆంధ్రజ్యోతి’కి ఆదరణ: అడిషనల్ ఎస్పీ వెంకటరమణ
పాఠకులకు మరింత ప్రోత్సహిస్తుంది: డీఎస్పీ వివేకానంద
ఎచ్చెర్ల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఉగాదికి ముందే ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు అదృష్టం తలుపుతట్టింది. ఎన్నో విలువైన కానుకలు గెలుచుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన పాఠకుల ఇంట సందడి కనిపించింది. ‘ఆంధ్రజ్యోతి’ 22వ వార్షికోత్సవం సందర్భంగా ఎచ్చెర్లలోని యూనిట్ కార్యాలయంలో మంగళవారం కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ కె.వెంకటరమణ, శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్.వివేకానంద, ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌లు లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతి విజేతైన బల్లా రామకృష్ణకు డీఎస్పీ స్వయంగా ఫోన్ చేసి మోటారు బైక్ గెలుచుకున్నట్టు చెప్పడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బఅయ్యారు. ద్వితీయ బహుమతి గెలుచుకున్న లంక కుమారితో అడిషనల్ ఎస్పీ ఫోన్‌లో మాట్లాడారు. రిఫ్రిజిరేటర్ గెలుచుకున్నట్టు చెప్పడంతో ఆమె సంతోషానికి అవధుల్లేవు. తృతీయ బహుమతి పొందిన పేడాడ లలితకుమారితో ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ ఫోన్‌లో మాట్లాడి మీకు కలర్ టీవీ వచ్చిందని చెప్పడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తంచేసింది. వీరితో పాటు మరో 100 మందికి కన్సొలేషన్ బహుమతులను ప్రకటించారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచ్ మేనేజర్ ఆర్.సోమశంకరరావు, ఎడిషన్ ఇన్‌చార్జి పి.బయపరెడ్డి, స్టాఫ్ రిపోర్టర్ టి.సురేష్‌బాబు, డీసీఎం పి.అనంతకుమార్, ఏబీఎన్ స్టాఫర్ బి.రమేష్, సర్క్యులేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు
ప్రథమ బహుమతి: బల్లా రామకృష్ణ, డోర్ నెంబరు 9-15-13, బోయి వీధి, వైఎస్‌ఆర్ స్ట్రీట్, విజయనగరం
ద్వితీయ బహుమతి: లంక కుమారి, డోర్ నెంబరు 43-63/ఎ, జూబ్లీరోడ్, బొబ్బిలి, విజయనగరం జిల్లా
తృతీయ బహుమతి: పేడాడ లలితకుమారి, డోర్ నెంబరు 10-102, పెదవీధి, చీమలవలస, ఆమదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా
పాఠకులను ప్రోత్సహించే కార్యక్రమం
పాఠకులను ప్రోత్సహించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఇలాంటి డ్రాలు నిర్వహించడం అభినందనీయం. ఈ పత్రిక సామాజిక బాధ్యతను నిర్వహిస్తూనే, పాఠకులను ఉత్సాహపరిచేలా కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రాలను నిర్వహించడం హర్షణీయం. పాఠకులకు గుర్తింపుగా బహుమతులు అందజేయడం శ్లాఘనీయం. ఇలాంటి కార్యక్రమాలతో పత్రికకు మరింత ఆదరణ పెరుగుతుంది. అదృష్టం కొద్దిమందినే వరించినా, వేలాది మంది పాఠకులు డ్రాలో పాల్గొనడం విశేషం. మూడు జిల్లాల నుంచి వేలాది మంది కూపన్లను పంపించారంటే చాలా మంది పాఠకులు ఈ కాన్సెప్ట్ పట్ల ఆసక్తి చూపుతున్నట్టు అర్థమవుతుంది. ఎంత ఎక్కువ మంది పాఠకులు ఈ డ్రాలో పాల్గొంటే అంత స్థాయిలో పత్రికపై ఉన్న అభిమానానికి తార్కాణం.
- కె.వెంకటరమణ, అడిషనల్ ఎస్పీ, శ్రీకాకుళం
ఇదో మంచి కార్యక్రమం
ఇదో మంచి కార్యక్రమం. నిత్యం సమస్యలపై స్పందిస్తూ, వినూత్న కథనాలు ఇస్తూ నిత్య నూతనంగా ఉంటున్న ‘ఆంధ్రజ్యోతి’ తన పాఠకులను ఆదరించేలా కారు అండ్ బైక్ రేస్ లక్కీ డ్రా నిర్వహించడం విశేషం. పాఠకులకు బహుమతులు అందజేయడంతో వారిని మరింత ప్రోత్సహిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలతో పాఠకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
- సీహెచ్.వివేకానంద, శ్రీకాకుళం డీఎస్పీ
చాలా ఆనందంగా ఉంది
చాలా ఆనందంగా వుంది. ఐదేళ్లుగా ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నాను. ఏడాది సబ్‌స్ర్కిప్షన్ తీసుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి కథనాలు ఆకట్టుకుంటాయి. ఇటీవల కాలంలో పరిశోధనాత్మక కథనాలతో పాటు అన్యాయాలు, అక్రమాలపై బాగా స్టోరీలు వస్తున్నాయి. ఆదివారం ప్రత్యేక సంచిక చాలా బావుంటుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కథనాలు రావాలి. ఆంధ్రజ్యోతి దినపత్రిక అభిమానిగా తాను గతంలో కూడా కార్‌రేస్, బైక్‌రేస్ లక్కీ డ్రాలో పాల్గొన్నాను. ఈ ఏడాది తొలి బహమతి లభించింది.
- బి.రామకృష్ణ, ప్రథమ బహుమతి విజేత, విజయనగరం
రెండు దశాబ్దాలుగా ‘ఆంధ్రజ్యోతి’ చదువుతున్నాం
నేను రెండు దశాబ్దాల నుంచి ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక చందాదారుని. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పేపరు చదువుతా. మహిళల విజయాలకు సంబంధించిన వార్తలు నాలో స్ఫూర్తిని రగిలిస్తుంటాయి. గతంలో కూడా నాకు రెండుసార్లు కుక్కర్లు, సిల్వర్ కాయిన్లు బహుమతులుగా వచ్చాయి. ఇప్పుడు రెండో బహుమతి కింద ఫ్రిజ్ గెలుచుకున్నామని శ్రీకాకుళం ఆంధ్రజ్యోతి కార్యాలయం నుంచి ఫోన్ రాగానే ఎంతో సంతోషించా. నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. నా భర్త శ్రీనివాసరావు గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక అంటే చాలా ఇష్టం.
-లంక కుమారి, ద్వితీయ బహుమతి విజేత, బొబ్బిలి
చాలా సంతోషంగా ఉంది
నాకు తృతీయ బహుమతిగా కలర్ టీవీ రావడం చాలా సంతోషంగా ఉంది. పాఠకులను ప్రోత్సహించేలా లక్కీ డ్రా నిర్వహించడం, బహుమతులు అందజేయడం నిజంగా ఆనందమే. ‘ఆంధ్రజ్యోతి’ పాఠకురాలిగా ఎంతో గర్వపడుతున్నా. భవిష్యత్‌లో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది, మాలాంటి పాఠకులకు మరింత ప్రోత్సహించేలా కార్యక్రమాలను రూపొందించాలి.
- పేడాడ లలితకుమారి, తృతీయ బహుమతి విజేత, చీమలవలస, ఆమదాలవలస