Share News

Jagjeevanram: బాబూ జగ్జీవన్‌రామ్‌.. మహనీయుడు

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:44 AM

Babu Jagjivan Ram.. social reformer ‘బాబూ జగ్జీవన్‌రామ్‌.. అసమానతలు లేని సమాజస్థాపనకు కృషి చేసిన మహనీయుడు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు.

Jagjeevanram: బాబూ జగ్జీవన్‌రామ్‌.. మహనీయుడు
జగ్జీవన్‌రామ్‌ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కేంద్ర,రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

  • శ్రీకాకుళంలో కాంస్య విగ్రహావిష్కరణ

  • ఘనంగా జయంతి

  • అరసవల్లి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘బాబూ జగ్జీవన్‌రామ్‌.. అసమానతలు లేని సమాజస్థాపనకు కృషి చేసిన మహనీయుడు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామ’ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలోని అరసవల్లి మిల్లు జంక్షన్‌ వద్ద కాంస్యవిగ్రహాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘కులవివక్ష సమాజంలో.. చదువు ఒక్కటే మన జీవితాలను మార్చగలిగే ఏకైక శక్తి అని జగ్జీవన్‌రామ్‌ నమ్మారు. ఉన్నత చదువులను అభ్యసించి, ఉప ప్రధాని పదవిని చేపట్టిన తొలి దళిత నాయకుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రక్షణమంత్రిగా పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని సృష్టించి, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆదుకున్న మహానాయకుడ’ని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు. శ్రీకాకుళం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

  • మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘జగ్జీవన్‌రామ్‌ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అమరావతిలోని 11 ఎకరాల్లో ఆయన స్మృతివనం ఏర్పాటు నిర్మిస్తాం. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన పదవులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నా’మని తెలిపారు.

  • ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. ‘బాబూ జగ్జీవన్‌రామ్‌ అత్యధిక సార్లు పార్లమెంటేరియన్‌గా, చిన్న వయసులోనే కేంద్రమంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావువు. ఆయన ఆశయాలను కొనసాగించాల’ని పిలుపునిచ్చారు.

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. రక్షణ, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేసిన దార్శనికుడు, విజ్ఞానవేత్త, సమసమాజ నిర్మాత బాబూ జగజ్జీవన్‌రామ్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, దళిత నాయకులు బోసు మన్మథరావు, రాంగోపాల్‌ మాస్టారు, రమణ మాదిగ, కంఠ వేణు, గోర సురేష్‌, చౌదరి బాబ్జీ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతి, అరవల రవీంద్ర, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, మెండ దాసునాయుడు, కొర్ను ప్రతాప్‌, పీఎంజే బాబు, సీర రమణయ్య, కవ్వాడి సుశీల, చిట్టి మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:44 AM