Share News

Dwama: ఇక సీట్లు కదులుతాయ్‌!

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:17 AM

Mismanagement జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో ప్రతిఏటా రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. కేంద్రం, రాష్ట్రం మంజూరు చేసే నిధులను ఈ విభాగం ఖర్చు చేస్తుంటుంది. అయితే ఇందులో రెగ్యులర్‌ ఉద్యోగులు కొద్దిమందే. మిగిలిన వారందరూ.. ఎఫ్‌టీఈ (ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయ్‌) కింద పనిచేస్తున్న వారు.

Dwama: ఇక సీట్లు కదులుతాయ్‌!
డ్వామా కార్యాలయం

  • ఉపాధిహామీ పథకంలో ప్రక్షాళనకు వేళాయె

  • ఏళ్లతరబడి పాతుకుపోయిన వారెందోరో..

  • ఐదు నుంచి ఎనిమిదేళ్లుగా ఒకేచోట విధులు

  • కొంతమందిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు

  • సిఫార్సుల కోసం ఎమ్మెల్యేల వద్దకు పరుగులు

  • జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)లో అక్రమాలు అన్నీఇన్నీ కావు. కొందరు ఏళ్లతరబడి పాతుకుపోవడంతో అవినీతి వేళ్లూనుకు పోయింది. ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేస్తున్నారంటే ‘ఫెవికాల్‌’ వీరుల పైరవీలు ఏమేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక వైసీపీ హయాంలో పరిస్థితి చెప్పనలవి కాదు. అప్పటి ఎమ్మెల్యేలతో కొందరు అధికారులు అంటకాగి జేబులు నింపుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డ్వామాలో ప్రక్షాళనకు నడుం బిగించింది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ నుంచి ఏపీడీ వరకు బదిలీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు కూడా కొందరు ఉద్యోగులు చక్రం తిప్పాలని చూస్తున్నారు. సిఫార్సు లేఖల కోసం కూటమి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ ఏమేరకు పారదర్శకంగా సాగుతుందో వేచిచూడాల్సిందే.

  • శ్రీకాకుళం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో ప్రతిఏటా రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. కేంద్రం, రాష్ట్రం మంజూరు చేసే నిధులను ఈ విభాగం ఖర్చు చేస్తుంటుంది. అయితే ఇందులో రెగ్యులర్‌ ఉద్యోగులు కొద్దిమందే. మిగిలిన వారందరూ.. ఎఫ్‌టీఈ (ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయ్‌) కింద పనిచేస్తున్న వారు. ఎఫ్‌టీఈలో ఏపీవో, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉంటారు. వీరు ప్రతి మండలంలోనూ ఉంటారు. చాలామంది ఎఫ్‌టీఈలు ఏళ్లతరబడిగా ఒకేచోట పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వారి స్థానాలను మాత్రం పదిలం చేసుకుంటున్నారు. గతంలో బదిలీలు అక్కడడక్కడ జరిగినా.. వీరు తమ సీట్లను పదిలం చేసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన చేపట్టింది. నిబంధనలకు అనుగుణంగా పనిచేసేవారు నింపాదిగా ఉంటున్నా.. ఏళ్లతరబడి ఒకే ప్రాంతానికి పరిమితమైపోయిన వారిలో మాత్రం వణుకు మొదలైంది. ఈసారి కూడా ఎలాగైనా తప్పించుకుందామని.. లేదా కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకుందామని ఎమ్మెల్యేలను కలుస్తున్నారు.

  • ఉపాధి హామీ పనుల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తే తొలుత బలవుతుంది క్షేత్ర సహాయకులే. ఆతర్వాత అక్కడక్కడ టెక్నికల్‌ అసిస్టెంట్లు చిక్కుతున్నారు. తెరవెనుక ఉండి.. తతంగం నడిపించి.. సోషల్‌ ఆడిట్‌కూ చిక్కని ఇతర ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలోనే ఇప్పుడు ఆందోళన మొదలైంది. వైసీపీ హయాంలో తాము కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ తెచ్చుకుని.. అడ్డుగోలుగా వ్యవహరించి వారికి ఇప్పుడు స్థానచలనం తప్పేలా లేదు. జిల్లాలోని 30 మండలాల్లో 30 మంది ఏపీవోలు, 30 మంది ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు, 100 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు (మండలానికి ముగ్గురు.. కొన్ని మండలాలకు నలుగురు), 180 మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్లందరూ బదిలీలకు అర్హులే. క్షేత్రసహాయకులకు మాత్రం బదిలీలు ఉండవు.

  • కూటమి ప్రభుత్వం కొలువు తీరాక కీలకమైన డ్వామా సిబ్బందిని బదిలీ చేయాలని టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేవంటూ జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించలేదు. కొంతమందిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నా కొనసాగుతున్నారు. తాజాగా డ్వామా ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లా పరిధిలో ఈ నెల 20లోగా బదిలీల దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలంటూ మార్గదర్శకాలను ఇచ్చింది. గురువారంతో దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో ఇక ప్రక్షాళన చేపట్టనుంది. అన్ని స్థాయిల్లోని మూడేళ్లు ఒకేచోట పనిచేస్తే వారిని బదిలీ చేయవచ్చు. ఐదు సంవత్సరాలు ఒకేచోట పనిచేస్తుంటే తప్పనిసరిగా స్థానచలనం కల్పించాల్సిందే. ఇదిలా ఉండగా ఏపీవోలను జిల్లా యూనిట్‌గా బదిలీలు చేయనున్నారు. ఇతర ఉద్యోగులను క్లస్టర్‌ స్థాయిలో, జిల్లా కార్యాలయంలో పనిచేసే వారిని ఐదేళ్లు దాటితే క్లస్టర్‌కు, మూడేళ్లు దాటితే అదే కార్యాలయంలో స్థానాల మార్పునకు అవకాశం ఇచ్చారు. బదిలీల ప్రక్రియను సాఫీగా నిర్వహించేందుకుగాను ప్రభుత్వం త్రీమెన్‌ కమిటీ నియమించింది. కలెక్టర్‌, డ్వామా పీడీ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సభ్యులుగా ఉంటారు.

Updated Date - Mar 21 , 2025 | 12:17 AM