Share News

Water problems: తీరనున్న నీటి కష్టాలు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:31 AM

water supply ఎట్టకేలకు పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు నీటి కష్టాలు ఉద్దానం రక్షిత మంచినీటి పథకం ద్వారా తీరనున్నాయి. హిరమండలం నుంచి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు సమగ్ర నీటి పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నా, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి అందడం లేదు. సొంత నీటి పథకాలు లేక జంట పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Water problems: తీరనున్న నీటి కష్టాలు
అక్కుపల్లి రోడ్డులో పైపులైన్ల అనుసంధానానికి మట్టిని తవ్వుతున్న మునిసిపల్‌ సిబ్బంది

  • ఉద్దానం రక్షిత నీటి పథకం అమలుకు శ్రీకారం

  • వారం రోజుల్లో పైపులైన్ల పనులు ప్రారంభం

  • ఫలించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి

  • పలాస, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు నీటి కష్టాలు ఉద్దానం రక్షిత మంచినీటి పథకం ద్వారా తీరనున్నాయి. హిరమండలం నుంచి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు సమగ్ర నీటి పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నా, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి అందడం లేదు. సొంత నీటి పథకాలు లేక జంట పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించి.. ఉద్దానం రక్షిత నీటి పథకం ద్వారా నీరు ఇస్తే ప్రజల కష్టాలు తీరుతాయని అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ పలాసలో ఇటీవల జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరు కాగా.. ఆయన దృష్టికి కూడా తాగునీటి సమస్య తీసుకెళ్లారు. దీంతో ఉద్దానం రక్షితనీటి పథకంపై అధికారులను వివరాలు అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 18న ఉద్దానం రక్షితనీటి పథకం వినియోగించుకోవచ్చని, ఐదు ఎంఎల్‌టీల నీరు ఇచ్చేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు అందజేశారు. దీంతో జంట పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్న దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కృషి మేరకు ఉద్దానం రక్షితనీటి పథకం మంజూరైంది. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఉన్న అన్నీ మండలాలకు నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తం 276 గ్రామాలకు పూర్తిస్థాయి తాగునీరందించే ఈ పథకం మంజూరవగానే మూలన పడింది. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి నీరందించడానికి అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ పథకం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు మున్సిపాలిటిలో 3 ఎంఎల్‌టీ నీరు ఇస్తుండగా కేవలం పబ్లిక్‌ కుళాయిలు, 1400 గృహాలకు రెండు, మూడు రోజులకోసారి నీరు అందిస్తున్నారు. 5 ఎంఎల్‌టీ నీరందిస్తే రెండుపూటలా తాగునీరు సరఫరాకు అవకాశం ఉంది.

  • రూ.63.50 లక్షలతో పైపులైన్లు

    ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఉద్దానం రక్షితనీటి ట్యాంకులకు పైపులైన్లు అనుసంధానించడానికి మునిసిపాలిటీ రూ.63.50 లక్షల నిధులు వెచ్చిస్తుంది. దీనికి సంబంధించి షార్ట్‌ టెండర్లను వేశారు. వారం రోజుల వ్యవధిలో ఈ పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కుపల్లి రోడ్డులో కాశీబుగ్గ పెట్రోలు బంకు వద్ద ఉన్న ఉద్దానం రక్షితనీటి పథకం ప్రధాన పైపులైన్‌ను కలిపేందుకు యత్నిస్తున్నారు. ఈ మేరకు కమిషనర్‌ ఎన్‌.రామారావు, ఇంజనీరింగ్‌ అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం పైపులైన్లు వేయడానికి స్థలాలు పరిశీలించారు. కిలోమీటరు పొడవునా పైపులైన్‌ వేసి ఉద్దానం ట్యాంకులకు కలిపితే మొత్తం నీరు అందించవచ్చని కమిషనర్‌ విలేకరులకు తెలిపారు. కాగా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే శిరీషకు టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, మల్లా శ్రీనివాస్‌, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, దడియాల నర్సింహులు, ఎ.రామకృష్ణ, జోగ మల్లి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 12:31 AM

News Hub