Rims hospital: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:28 AM
medical services improvement ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు స్నేహపూర్వకంగా సేవలు అందించాలి. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి. ప్రతీ రోగి యొక్క సమగ్ర ఆరోగ్య వివరాలను(ఈహెచ్‌ఆర్) తప్పనిసరిగా నమోదు చేయాల’ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ ఆదేశించారు.

రోగులతో స్నేహపూర్వకంగా మెలగాలి
సమగ్ర ఆరోగ్య వివరాల నమోదు తప్పనిసరి
డీఎంఈ డాక్టర్ రఘునందన్
రిమ్స్ కళాశాల, ఆస్పత్రి సందర్శన
అరసవల్లి, మార్చి 21(ఆంద్రజ్యోతి): ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు స్నేహపూర్వకంగా సేవలు అందించాలి. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి. ప్రతీ రోగి యొక్క సమగ్ర ఆరోగ్య వివరాలను(ఈహెచ్‌ఆర్) తప్పనిసరిగా నమోదు చేయాల’ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళంలోని రిమ్స్ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్-రిమ్స్)ని కళాశాల ప్రిన్సిపాల్ రవి వెంకటాచలం, ఆస్పత్రి సూపరింటెండెంట్ దాసరి షకీలాతో కలిసి సందర్శించారు. ఎమర్జెన్సీ, ఆప్తాల్మిక్, చిన్నపిల్లల ఐసీయూ, సర్జికల్ వార్డు, గైనిక్ వార్డు, డీఈఐసీ, ఈఎన్‌టీ తదితర విభాగాలను పరిశీలించారు. సంబంధిత విభాగాధిపతులతో రోగుల వివరాలు, అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం రిమ్స్ కళాశాల సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కళాశాలలో కొత్తగా చేరిన పీజీలను ఆయన అభినందించారు. ప్రజలకు మెరుగైన, అత్యుత్తమైన సేవలను స్నేహపూర్వక వాతావరణంలో అందిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ప్రజలకు రిమ్స్‌లో లభించే సేవల వివరాలను, ప్రైవేటు ఆసుపత్రుల మాదిరిగా.. నగరంలోని ముఖ్యకూడళ్లలో అందరికీ కనిపించేలా పెద్దపెద్ద బోర్డులను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వైద్యశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. వైద్యులు తప్పనిసరిగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో విధుల్లోనే ఉండాలి. రోగులతో స్నేహపూర్వకంగా మెలగి, వారికి ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కలిగించాలి. ఏవైనా ప్రత్యేకమైన, అరుదైన చికిత్సలు/శస్త్రచికిత్సలు ఆసుపత్రిలో నిర్వహిస్తే ప్రజలకు వాటిని తెలియజేయాలి. వైద్యపరికరాలు, సిబ్బంది నియామకాలు అవసరమైతే వాటి నివేదికను అందజేయాల’ని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో డిజిటల్ లైబ్రరీ, తరగతి గదులు, క్రిటికల్ కేర్ యూనిట్ బ్లాక్, నర్సింగ్ స్టాఫ్ బ్లాక్, వైద్య విద్యార్థులకు హాస్టల్ భవనాలు పూర్తయినా ఫర్నీచర్ లేక ప్రారంభానికి నోచుకోలేదని ప్రిన్సిపాల్ రవి వెంకటాచలం చెప్పగా, వెంటనే భవనాలను ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వివిధ వైద్య విభాగాల అధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.