Mahilamart: మహిళామార్ట్‌లో అనకొండలు!
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:36 AM
financial mismanagement నరసన్నపేటలోని మహిళా సమాఖ్య సంఘాల సొమ్ముతో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌లో అవినీతి అనకొండలు పడ్డాయి. నిర్వహణ పేరిట రూ.లక్షల్లో నిధులు హాంఫట్ చేశాయి.

స్వయం సహాయక సంఘ సభ్యుల పెట్టుబడి నిధులు బొక్కేసిన వైనం
వెలుగులో అఽధికారులు, ఎంఎంఎస్ సభ్యుల చేతివాటం
నిర్వహణ పేరిట రూ.లక్షల్లో మూలధనం పక్కదారి
మండల మహిళా సమాఖ్య, స్ర్తీనిధి రుణాల్లోనూ అదే తీరు
నరసన్నపేట మండలంలో 47 గ్రామ మహిళా సమాఖ్య సంఘాల్లో 22,500 మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.110 చొప్పున షేర్ క్యాపిటల్ వసూళ్లు చేశారు. మొత్తంగా రూ.24.50లక్షలతో 2022 డిసెంబర్‌లో మహిళా మార్ట్ ఏర్పాటు చేశారు. ఈ మార్ట్ నాడు కళకళాలాడేది. రోజుకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వ్యాపారాలు జరిగేవి. ఈ మార్ట్‌పై అవినీతి అనకొండల దృష్టి పడడంతో కేవలం రెండేళ్లలోనే సరుకులన్నీ మాయమయ్యాయి. వెలుగులో కొంతమంది అధికారులు, మండల మహిళా సమాఖ్య(ఎంఎంఎస్) సభ్యుల చేతివాటం కారణంగా.. నేడు వ్యాపారాలు లేక మూత దశలో ఉంది. దీనిపై మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. తమ షేర్ క్యాపిటల్ నిధులను లాభాలతోపాటు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
....................
నరసన్నపేట, మార్చి 21(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలోని మహిళా సమాఖ్య సంఘాల సొమ్ముతో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌లో అవినీతి అనకొండలు పడ్డాయి. నిర్వహణ పేరిట రూ.లక్షల్లో నిధులు హాంఫట్ చేశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబరు 14న అప్పటి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. నరసన్నపేటలోని వెలుగుకు చెందిన భవనంలోనే మహిళా మార్ట్‌ను ప్రారంభించారు. ఈ భవనం మరమ్మతులు, మహిళా మార్ట్ ఏర్పాటుకు అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్ ఇతర ఖర్చులకు కూడా మహిళా సమాఖ్య నిధులు వెచ్చించారు. మార్ట్‌లో సరుకుల కోసం డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి రూ.110 చొప్పున క్యాపిటల్ షేర్ పేరుతో వసూలు చేశారు. ఇలా నరసన్నపేట మండలంలో 47 గ్రామ సమాఖ్య సంఘాల పరిఽధిలో 22,500 మంది సభ్యుల నుంచి రూ.24.50 లక్షలు సేకరించారు. వీటితో సరుకులు ఏర్పాటు చేశారు. అలాగే డ్వాక్రా సంఘాలు తయారు చేసిన వస్తువులు కూడా ఈ మార్ట్‌లో విక్రయించేవారు. అప్పట్లో రోజువారీ విక్రయాలను ప్రోత్సహించేందుకు ఇతర మండలాల్లో ఉన్న మహిళా సంఘాల సభ్యులు కూడా ఇక్కడ మహిళామార్ట్‌లో కొనుగోలు చేసేవారు. రోజూ సుమారు రూ.30వేల నుంచి రూ.50వేల వరకూ వ్యాపారాలు సాగేవి. మండల సమాఖ్య నిధులు, స్ర్తీనిఽధి రుణాలతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ మార్టుపై అక్రమార్కుల దృష్టి పడింది. వెలుగులో కొంతమంది అధికారులు, ఎంఎంఎస్ సభ్యులు పక్కా ప్రణాళికతో మార్ట్‌లో ప్రవేశించి నిధుల దోపిడీకి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు దీని నిర్వహణ పేరిట నెలకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకూ బొక్కడం ప్రారంభించారు. మార్ట్‌లో పనిచేసే సిబ్బందిని నియమించకుండానే.. వారు ఉన్నట్టు లెక్కలో చూపి డబ్బులు దోచేశారు. క్రమేపీ సరుకులు కూడా ఖాళీ చేసేశారు. విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంలో కూడా 5 నుంచి 10 శాతం కనిపించకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో స్వయంశక్తి సంఘాల సభ్యులకు బలవంతంగా సరుకులను విక్రయించేవారు. అలా గత రెండు నెలలుగా మార్టు మొత్తం ఖాళీ అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులు, సభ్యులు కొంతమేరకు హాంఫట్ చేశారు. అప్పటి నుంచి ఉన్న ఒక అవినీతి అనకొండ ఈ మార్ట్ సొమ్మును కాజేసినట్టు సమాచారం.
అన్నీ తప్పుడు లెక్కలే
మార్ట్ ప్రారంభోత్సవానికి, మార్ట్‌లో రేకులు, సీసీ కెమెరాలు, కంప్యూటలర్లు ఇతర సామగ్రి కోసం రూ.9లక్షలు ఖర్చయినట్టు లెక్కల్లో చూపారు. వాస్తవంగా వీటి కోసం రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేశారు. మార్ట్ ఏర్పాటు చేసిన భవనానికి అంతకుముందు ఎంఎంఎస్ నిధుల నుంచి రూ.3 లక్షలు ఖర్చు చేశారు. ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో మార్ట్ ఏర్పాటుకు రూ.12లక్షల వరకు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపించి అక్రమార్కులు భారీగా నిధులు మింగేశారనే ఆరోపణలు ఉన్నాయి.
మండల మహిళా సమాఖ్యలో అక్రమాలు
మార్ట్ నిర్వహణతోపాటు స్వయంశక్తి సంఘాలకు ఇచ్చే వివిధ శిక్షణకు, ఇతర నిర్వహణకు భారీ స్థాయిలో ఖర్చులు పెట్టినట్లు రికార్డుల్లో చూపించి మండల మహిళ సమాఖ్య నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన అక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సీ్త్ర నిధి రుణాల్లో కూడా లక్షలాది రూపాయలు అక్రమాలు జరిగాయనే విమర్శలున్నాయి. ముద్ర రుణాల పేరుతో ఎటువంటి వ్యాపారాలు లేనివారికి కూడా సిఫారసు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా మండల మహిళ సమాఖ్య, వెలుగు, సెర్ఫ్ కార్యక్రమాల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.
షేర్ క్యాపిటల్‌ను లాభాలతో చెల్లించాలి
నిధులు పక్కదారి పట్టించి.. మార్ట్‌ను నష్టాల్లో చూపించడంపై మహిళా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా స్వయంశక్తి సంఘాల నుంచి వసూళ్లు చేసిన షేర్ క్యాపిటల్ మూలధనం వాటా రూ.110తోపాటు మూడేళ్లకు వచ్చిన లాభాలను కూడా సంఘాలకు చెల్లించాలని కోరుతున్నారు. స్వయంశక్తి సంఘాల సోమ్ముతో .. మండల సమాఖ్యలో సోకులు చేస్తున్నవారు వెంటనే జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత మూడేళ్లకు చెందిన ఆదాయ వ్యయాలను బహిరంగంగా తెలియజేయాల్సిన బాధ్యత ఎంఎంఎస్‌కు ఉందని గ్రామసమాఖ్య సంఘాల సభ్యులు స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయంపై మార్ట్ ఏపీఎం మల్లేశ్వరరావు వద్ద ప్రస్తావించగా.. ‘మార్ట్ నిర్వహణ ఏరియా కో-ఆర్డినేటర్, మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోనే 2022 నుంచి కొనసాగుతోంది. మార్టులో అమ్మకాలు తగ్గడం, నిధుల వ్యవహారంపై పీడీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్నాం. సమగ్ర నివేదికను సిద్ధం చేసి అధికారులకు అందజేస్తామ’ని తెలిపారు.