Share News

Medical: కాలం చెల్లిన మందులు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:40 AM

medical shops inspections రాష్ట్ర పోలీసు బాస్‌ ఆదేశాల మేరకు ఆపరేషన్‌ గరుడ కార్యక్రమంలో భాగంగా మందుల షాపులపై అధికారులు నిఘా పెట్టారు. జిల్లాలో రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఔషధ నియంత్రణ, పోలీసు, ఈగల్‌ బృందం సంయుక్తంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు.

Medical: కాలం చెల్లిన మందులు
శ్రీకాకుళంలో మందుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ ఎస్పీ ప్రసాదరావు

  • మెడికల్‌ షాపుల్లో ‘ఆపరేషన్‌ గరుడ’ తనిఖీలు

  • జిల్లాలో 12 చోట్ల సోదాలు

  • వైద్యుల సూచనలు లేని మందుల గుర్తింపు

  • శ్రీకాకుళం/ పలాస/ పాతపట్నం/ హిరమండలం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసు బాస్‌ ఆదేశాల మేరకు ఆపరేషన్‌ గరుడ కార్యక్రమంలో భాగంగా మందుల షాపులపై అధికారులు నిఘా పెట్టారు. జిల్లాలో రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఔషధ నియంత్రణ, పోలీసు, ఈగల్‌ బృందం సంయుక్తంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్లలో సోదాలు చేశారు. మత్తు కోసం వినియోగించే మాత్రలు.. ఇతర మందుల విక్రయాలపై ఆరాతీశారు. పలాసలో కాలం చెల్లినవాటిని, వైద్యుల సలహా లేకుండా ఇస్తున్న మందులను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు. అలాగే పాతపట్నం, హిరమండలంలోని మందుల షాపుల్లోనూ తనిఖీలు చేశారు. అధిక దుకాణాల్లో మందుల విక్రయాలకు సంబంధించి వినియోగదారులకు బిల్లులు ఇవ్వడంలేదు. అలానే వైద్యుని చీటీ లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నాయి. అన్నింటికంటే మెడికల్‌ షాపుల్లో ఉండాల్సిన ఫార్మాసిస్ట్‌.. అక్కడ అందుబాటులో లేకపోవడం.. మరొకరు మందులను విక్రయించడం వంటివి గుర్తించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదికను పంపనున్నారు. త్వరలోనే చర్యలు తీసుకునే అంశముంది.

  • పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో రెండు షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఔషధ దుకాణాల సంఘం అధ్యక్షుడు నిర్వహిస్తున్న తర్లాన వాసుదేవరావు మెడికల్‌ స్టోర్‌లో కాలం చెల్లిన మందులు గుర్తించారు. దీంతోపాటు వైద్యుల సలహా లేకుండా ఇస్తున్న మందులను గుర్తించి కేసు నమోదు చేశారు. పట్టుకున్న మందులను సీజ్‌ చేసి తరలించారు. దాడుల నేపథ్యంలో జంట పట్టణాల్లో ఔషధ షాపుల యజమానులు బిల్లులు రాసే పనిలో ఉన్నారు. ఉన్న మేరకు బిల్లులు అప్‌డేట్‌ చేస్తున్నారు. అలాగే కాలం చెల్లినవి, నాసిరకం మందులను ఇతర ప్రాంతాలకు తరలించారు.

  • పాతపట్నంలో విజిలెన్స్‌ సీఐ డి.సింహాచలం ఆధ్వర్యంలో ఒక మందుల షాపును తనిఖీ చేశారు. పలు ప్రైవేటు క్లినిక్‌ల వద్ద ఉండే డ్రగ్స్‌ను పరిశీలించారు. షాపుల నిర్వహణ, స్టాక్‌ వివరాలు నమోదు చేశారు.

  • హిరమండలంలోని ఒక మందుల దుకాణంలో తనిఖీ చేశారు. ఈగల్‌ విభాగం అధికారులు మాట్లాడుతూ.. వైద్యుల ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆల్ర్ఫాజోలమ్‌, ట్రెమడాల్‌ లాంటి సైకోటిక్‌ మందులు అనధికారికంగా విక్రయించడం నేరమన్నారు. తనిఖీల నేపథ్యంలో పలువురు మెడికల్‌ షాపులను మూసివేశారు. అధికారులు వెళ్లిపోయిన అనంతరం సాయంత్రం వాటిని తెరిచారు.

  • ఆస్పత్రి అనుబంధంగా ఉండేవి తనిఖీ చేస్తే..

  • ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించి ఉంటే అక్రమాలు వెలుగులోకి వచ్చేవి. ఎక్కువగా పీడీ కంపెనీల మందులే అంతటా అక్కడ ఉంటున్నాయి. సొంతంగా బ్రాండ్‌ల తయారీతో... హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలతో మ్యానుఫ్యాక్చరింగ్‌ చేయించిన మందులు రకరకాలుగా అందుబాటులో ఉంటున్నాయి. వాటిని జిల్లాకు చెందినవారే సొంతంగా మార్కెటింగ్‌ చేసుకుని.. డాక్టర్‌లకు అధికశాతం మార్జిన్‌ ఇస్తూ.. విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటివాటిపై ఆపరేషన్‌ గరుడ దృష్టి సారించి ఉంటే.. ఈ మందులను కొన్ని శాంపిల్స్‌ తీసి.. ప్రయోగశాలకు పంపి ఉంటే అసలు లెక్క తేలేది. ప్రతి పీడీ కంపెనీలో మందుల నాణ్యత ఏరీతిన అన్నదో.. అటు డాక్టర్‌లకు.. ఇటు ఔషధ నియంత్రణ అధికారుల మనస్సాక్షికి తెలుసు. ఈరీతిన తనిఖీలు చేపట్టిఉంటే ఫలితముండేదని జిల్లాప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  • మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి

  • టెక్కలి డివిజన్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘డీజీపీ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నాం. పలాస, టెక్కలి రెవెన్యూ డివిజన్లలో నాలుగు షాపులను తనిఖీ చేశాం. పలాసకు సంబంధించి ఒక కేసు నమోదు చేశాం. హిరమండలంలో జయశంకర్‌ మెడికల్‌ స్టోర్‌, పాతపట్నంలో మధు మెడికల్‌ షాపు కూడా తనిఖీ చేశాం. యువత మత్తు పదార్థాలకు బానిసై బలవుతున్నారు. ప్రమాదకరమైన మందులు మత్తు మందుగా వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని సమూలంగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మెడికల్‌ షాపులో ఇటువంటి మందులు అమ్మేటపుడు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. మందుల వివరాలు అందుబాటులో ఉంచాల’ని తెలిపారు. కార్యక్రమంలో రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు, ఔషధ నియంత్రణ సహాయ సంచాలకులు చంద్రరావు, సీఐలు ఈశ్వరరావు, సింహాచలం, రామారావు, ఎస్‌ఐలు అశోక్‌, ఎండీ యాసిన్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:40 AM