Share News

రోగులకు సేవలందించడంలో అలసత్వం వద్దు

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:48 PM

‘శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. వారికి సేవలందించడంలో అలసత్వం వహించవద్దు. ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటాం.’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

 రోగులకు సేవలందించడంలో అలసత్వం వద్దు
రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- సర్వజన ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు నిధులిస్తాం

-ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. వారికి సేవలందించడంలో అలసత్వం వహించవద్దు. ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటాం.’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. తొలుత ఓపీ రిజిస్ట్రేషన్‌ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఎముకల విభాగం ఓపీ వద్దకు చేరుకుని రోగులతో మాట్లాడారు. వైద్యసేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? లేదా అని సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ సెంటర్లను పరిశీలించారు. సదరం రిజిస్ట్రేషన్‌ కేంద్రానికి చేరుకుని రోగులతో మా ట్లాడారు. రిజిస్ట్రేషన్‌ ఎలా జరుగు తున్నదీ స్వయంగా పరిశీలించారు. అక్కడ తాగునీరు కూడా లేకపోవడంపై కొంత అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే వాటర్‌ క్యాన్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చిన్న చిన్న సమస్య లను కూడా పరిష్కరించకపోతే ఎలా అని ప్రశ్నించారు. నీరు సరిపోవడం లేదని సూపరింటెండెం ట్‌ డా.షకీలా చెప్పగా.. వెంటనే అదనంగా బోరు వేయించాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈని కలెక్టర్‌ ఆదేశించారు. సిబ్బంది విషయంలో ఖాళీలుంటే వెంటనే తెలియజేయాలని, అవసరం మేరకు నియామకాలు చేపడతామని అన్నారు. మార్చురీ వద్ద ఫ్లోరింగ్‌ పూర్తిగా పాడైందని , బాగు చేయడానికి మూడు నెలల సమయం పడుతుం దని ఈఈ కలెక్టర్‌కు వివరించారు. సౌకర్యాల కల్పనకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తామని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఎస్‌ ఆర్‌ఎంవో అనిత, డీసీఎస్‌ ఆర్‌ఎంవో సుభాషిణి, రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ రవి వెంకటాచలం, వైద్యులు శ్రీదేవి, భానుప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:49 PM