Share News

Industrial : నిఘా ఏమైంది?

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:10 AM

Industrial zone problems పారిశ్రామికవాడ పైడిభీమవరంపై నిఘా ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ సుమారు 30 పరిశ్రమలు ఉన్నాయి. బయో, ఫార్మా పరిశ్రమలు అధికం. ఇక్కడ వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదే సమయంలో కోట్లాది రూపాయల ఉత్పత్తులు, రహస్య పరిశోధనలకు సంబంధించి నివేదికలు ఉంటాయి. కానీ వాటిపై నిఘా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

 Industrial : నిఘా ఏమైంది?
డాక్టర్‌ రెడ్డీస్‌ పరిశ్రమ

  • పైడిభీమవరం పారిశ్రామికవాడపై నిర్లక్ష్యం

  • పరిశ్రమల్లో అంతర్గత భద్రతపై అనుమానం

  • ఆందోళనలో కార్మికులు, ఉద్యోగులు

  • ప్రత్యేక పోలీసుస్టేషన్‌ ఏర్పాటు ఎప్పుడో?

  • రణస్థలం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవాడ పైడిభీమవరంపై నిఘా ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ సుమారు 30 పరిశ్రమలు ఉన్నాయి. బయో, ఫార్మా పరిశ్రమలు అధికం. ఇక్కడ వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదే సమయంలో కోట్లాది రూపాయల ఉత్పత్తులు, రహస్య పరిశోధనలకు సంబంధించి నివేదికలు ఉంటాయి. కానీ వాటిపై నిఘా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రెడ్డీస్‌ ల్యాబ్‌లో షుగర్‌ టైప్‌-2కు సంబంధించి ఔషధాన్ని తయారుచేసే క్రమంలో కోట్లాది రూపాయలతో ప్రయోగాలు చేశారు. అలా తయారుచేసిన ఫౌడర్‌ మూడు వారాల కిందట చోరీకి గురైంది. కాగా దీనికి కారకులు ఎవరనేది ఇంతవరకూ తెలియలేదంటే పారిశ్రామిక వాడలో నిఘా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా ప్రాంతంలో సీసీ కెమేరాల నిఘా ఉండి, ఆ పుటేజ్‌ పరిశీలిస్తే సమస్య కొలిక్కివచ్చేది. అయితే దీనిపై పోలీస్‌ దర్యాప్తు కొనసాగుతోంది. రెడ్డీస్‌ ల్యాబ్‌ యాజమాన్యం ఈ ముడిసరుకు చోరీతో సంస్థ వ్యాపార లావాదేవీలకు ఎటువంటి నష్టం లేదని ప్రకటించింది. కానీ ఈ ఘటన నేపథ్యంలో ఫార్మా రంగంలో అగ్రగామిగా ఉన్న ఓ కంపెనీ యూనిట్‌లో ఇలా ఉంటే.. చిన్న పాటి పరిశ్రమలో నిఘా ఎలా ఉంటుందోనన్నది చర్చనీయాంశమవుతోంది.

  • 1985లో ఏర్పాటు

    రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ).. జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటుచేసేలా పారిశ్రామికవాడను నెలకొల్పింది. 1985లో పైడిభీమవరంలో 450 ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడను ప్రారంభించింది. ఇందులో 275 ఎకరాలను రసాయనిక జోన్‌కు కేటాయించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 13 రసాయన పరిశ్రమలు కొనసాగుతున్నాయి. సరాక, అపర్ణ, అరబిందో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఆంధ్రా ఆర్గానిక్స్‌ వంటి భారీ పరిశ్రమలున్నాయి. ప్రధానంగా ఉత్తారాది రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ పనిచేస్తుంటారు. ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో భద్రత, నిఘా నిద్దరోతుండగా... అటు కార్మికులకు సైతం రక్షణ లేకపోతోంది. ఫలితంగా పైడిభీమవరం అంటేనే సామాన్యులు హడలెత్తిపోయే ప్రమాదం ఏర్పడింది.

  • విద్రోహ చర్య అని అనుమానం..

    జిల్లాలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. పైడిభీమవరం పారిశ్రామికవాడకు కూతవేటు దూరంలోనే సముద్ర తీరం విస్తరించి ఉంది. ఆపై ప్రధాన జాతీయ రహదారి, దగ్గరల్లోనే రైల్వే మార్గం కూడా ఉంది. కానీ పారిశ్రామికవాడలో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) గార్డ్స్‌ మచ్చుకైనా కానరావడం లేదు. రెడ్డీస్‌ ల్యాబ్‌లో చోరీ ఘటన.. విద్రోహ చర్య అన్న అనుమానం తలెత్తుతోంది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వపరంగా కూడా ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ అవసరం ఉంది. ఇక్కడ సబ్‌ పోలీస్‌స్టేషన్‌ పేరిట సిస్కో స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఇద్దరు, ముగ్గురు పోలీస్‌ సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. పారిశ్రామికవాడలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా, అగ్నిప్రమాదాలు సంభవించినా జే.ఆర్‌.పురం పోలీసులపై భారం పడుతోంది. అగ్నిమాపక సేవలు కూడా అంతంతమాత్రమే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు మండలాల నుంచి అగ్నిమాపక వాహనాలు రావడానికి ఆలస్యమవుతోంది. అవి వచ్చే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. ఇప్పటికైనా పైడిభీమవరం పారిశ్రామికవాడపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

  • దర్యాప్తు చేస్తున్నాం

    రెడ్డీస్‌ ల్యాబ్‌లో మందుల తయారీకి సంబంధించి ముడిసరుకు చోరీ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పైడిభీమవరం పారిశ్రామికవాడపై నిఘా పెట్టాం. అయితే లా అండ్‌ ఆర్డర్‌తో పాటు పారిశ్రామిక వాడలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని విధాలా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాం.

    - ఎం అవతారం, సీఐ, జేఆర్‌పురం

Updated Date - Mar 21 , 2025 | 12:10 AM