Housing: ఇల్లు ఒకటే.. బిల్లులు రెండు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:14 AM
Double billing వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల మంజూరులో అక్రమాలు అడ్డేలేదు. పాత ఇళ్లకు కూడా గత ప్రభుత్వ హయాంలో బిల్లులు మంజూరు అయ్యాయి. ఇద్దరి పేరిట పట్టాలు తీసుకుని ఒకే ఇల్లు కట్టి బిల్లులు పొందారు. నడగాం గ్రామంలోనే 11 ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని స్పందనలో ఫిర్యాదు చేయడంతో బిల్లుల బాగోతం బయటపడింది.

జగనన్నకాలనీల్లో అన్హరులకు అందలం
2018లో పూర్తయిన ఇంటికీ బిల్లులు
వైసీపీ హయాంలో అడ్డుగోలు వ్యవహారం
జమ్ములో ఇళ్ల స్థానంలో షాపుల నిర్మాణం
చక్రం తిప్పిన గ్రామ వైసీపీ నాయకులు
నడగాం గ్రామంలోని ఈ ఇంటికి బానాల భారతి (హౌసింగ్ ఐడీ నెం: 012209 ఎన్‌పీఐ 2621856) పేరిట బిల్లులు డ్రా చేశారు. ఈ ఇల్లు గత ప్రభుత్వం హయాంలో నిర్మించినట్లు రికార్డుల్లో రూపొందించారు. వాస్తవానికి అయితే ఆ ఇల్లు 2018లోనే నిర్మించారు.
...............
ఇవి రెండు ఇళ్లు కానేకాదు. ఒకటే. కానీ హౌసింగ్ రికార్డులలో మాత్రం రెండు ఇళ్లుగా నమోదు చేసి బిల్లులు చెల్లించారు. నడగాం గ్రామంలో లుకలాపు భవానీ, లుకలాపు సుమలత పేర్లతో ఇళ్లు మంజూరు చేశారు. నిర్మాణం సమయంలో రెండు ఇళ్లు వేర్వేరుగా నిర్మిస్తామని ఆఫిడవిట్ ఇచ్చి.. తరువాత ఒకే ఒక బిల్డింగ్‌గా కట్టారు. ఆతర్వాత బిల్లులు డ్రా చేశారు.
.................
నరసన్నపేట, మార్చి 20(ఆంధ్రజ్యోతి) : వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల మంజూరులో అక్రమాలు అడ్డేలేదు. పాత ఇళ్లకు కూడా గత ప్రభుత్వ హయాంలో బిల్లులు మంజూరు అయ్యాయి. ఇద్దరి పేరిట పట్టాలు తీసుకుని ఒకే ఇల్లు కట్టి బిల్లులు పొందారు. నడగాం గ్రామంలోనే 11 ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని స్పందనలో ఫిర్యాదు చేయడంతో బిల్లుల బాగోతం బయటపడింది. ఇక జమ్ము జగనన్న కాలనీలో అన్హురులకే 60శాతం మేరకు పట్టాలు ఇచ్చి.. ఇళ్లు మంజూరు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
నరసన్నపేట మండలంలో వైసీపీ ప్రభుత్వ హాయాంలో ఇంటి పట్టాలు, ఇళ్లు మంజూరులో వైసీపీ నాయకులు చేతివాటం ప్రదర్శంచారనే ఆరోపణలు ఉన్నాయి. పాత ఇళ్లకే కొత్తగా బిల్లులు మంజూరు చేయించి డ్రా చేసుకోగా.. కొన్ని గ్రామాల్లో అన్హరులకు జగనన్నకాలనీలో పట్టాలు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 1600 ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 30శాతం వరకు పాత ఇళ్లకే బిల్లులు చేసుకున్నారు. ఇవన్నీ వైసీపీ నాయకుల అనుచరులవేనని విమర్శలు ఉన్నాయి.
నరసన్నపేట పట్టణంలో ఇంటి స్థలాలు లేనివారికి జమ్ములో ఏడు లేఅవుట్లను వైసీపీ ప్రభుత్వ హయాంలో వేశారు. సుమారు 800 మందికి పట్టాలు ఇచ్చారు. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు అన్హరులను కూడా లబ్ధిదారులుగా చేర్చారు. 30శాతం పైగా ఇందులో అనర్హులు ఉన్నట్లు సమాచారం.
రావాడపేట వద్ద 326ఏ జాతీయ రహదారికి అనుకుని వేసిన రెండు లే అవుట్లలో విలువైన స్థలాల పట్టాలను వైసీపీ నాయకులు, వారి అనుచరులకు మంజూరు చేశారు. ఇతర మండలాల్లో ఉన్నవారికి, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నవారికి ఈ ఖరీదైన లే అవుట్‌లో పట్టాలు ఇచ్చారు. ఈ స్థలంలో ఇంటి పట్టాలు పొంది షాపుల నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
దర్యాప్తు చేపడతాం:
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇంటి నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నాం. నడగాంలో ఇంటి నిర్మాణాలపై స్పందనలో ఫిర్యాదులు వచ్చాయి. జమ్ము లే అవుట్లలో ఇంటి పట్టాలు ఇచ్చింది రెవెన్యూ అధికారులు. నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వాటిని పరిశీలన చేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా చేపడితే రద్దు చేస్తాం.
- ఊరిటి రాజేంద్రప్రసాద్, గృహనిర్మాణశాఖ ఏఈ