power: విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణ
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:20 AM
Electricity Load అవసరానికి మించి విద్యుత్ వాడే వినియోగదారులు.. లోడ్ క్రమబద్ధీకరణ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ధరావతులపై 50శాతం రాయితీ కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

గృహ వినియోగదారులకు 50 శాతం రాయితీ
డెవలప్‌మెంట్ చార్జీల తగ్గింపు
జూన్ 30వరకు దరఖాస్తుల స్వీకరణ
హిరమండలం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): అవసరానికి మించి విద్యుత్ వాడే వినియోగదారులు.. లోడ్ క్రమబద్ధీకరణ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ధరావతులపై 50శాతం రాయితీ కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలు, మండలాలు, పట్టణాల పరిధిలో మూడు కిలోవాట్ల వరకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 6.90 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కొత్తగా విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడు గృహంలో ఉపకరణాల లోడ్ లెక్కించి సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. ఉదాహరణకు ఒక కిలోవాట్ లోడుతో కనెక్షన్ తీసుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ రూ.200, డెవలప్‌మెంట్ చార్జీ కింద సుమారు రూ.2,250, దర ఖాస్తుకు రూ.200 చొప్పున చెల్లించాలి. ఇదే రెండు వాట్ల లోడ్‌కు డెవలప్ మెంట్ చార్జీ కింద రూ.4,600 కట్టాలి. ఇదే మాదిరి ఐదు కిలోవాట్ల వరకూ నిర్ణీత రుసుం చెల్లించాలి. కాగా చాలామంది ఒక కిలోవాట్‌లోడుకు కనెక్షన్ తీసుకుంటున్నారు. తక్కువ లోడు చూపుతూ.. అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. గ్రామాల్లో సైతం బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరుగుతున్నాయి. చాలామంది రెండు అంతస్తుల భవనాలు నిర్మించి.. విద్యుత్ కనెక్షన్ మాత్రం ఒక్కటే తీసుకుంటున్నారు. ఏసీలు, కూలర్లు, గ్రీజర్లు వాడుతూ.. వారు తీసుకున్న కిలోవాట్ల పరిమితికి మించి లోడ్ వినియోగిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు దాడుల సమయంలో అదనపు లోడును గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. అపరాధ రుసుము విధిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది లోడ్ క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదు. అవసరానికి మించి విద్యుత్ వినియోగం కారణంగా లోడ్ పెరిగి.. ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ పాడైపోతున్నాయి. ఫ్యూజులు పోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లోనూ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచేలా.. విద్యుత్ వినియోగం లోడు క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం 50 శాతం రాయితీ కల్పిస్తూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రాయితీ దక్కాలంటే జూన్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
రాయితీ వర్తింపు ఇలా..
----------------
అదనపులోడు అసలు తగ్గింపు
(కిలో వాట్లలో) ధర(రూ.) ఽధర(రూ.)
-------------------------
కిలోవాట్ 2,250 1,250
రెండు 4,450 2,450
మూడు 6,650 3,650
నాలుగు 8,850 4,850
ఐదు 11,050 6,050
జూన్ 30వరకు గడువు
అదనపు లోడు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జూన్ 30 వరకూ అవకాశం కల్పించింది. ప్రస్తుతం డెవలప్‌మెంట్ చార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తోంది. కిలో వాట్‌కు రూ.2వేలకు బదులు రూ.వెయ్యి చెల్లిస్తే చాలు. జూన్ 30లోగా ఆన్‌లైన్‌లో లేదా ఉప కేంద్రంలోని అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. గృహ, వాణిజ్య, ఇతర వినియోగదరాలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. అదనపులోడు అవసరమైన వారు సంబంధిత రుసుము చెల్లించి సర్వీసు క్రమబద్ధీకరించుకోవాలి.
- జి.శంకరరావు, ట్రాన్స్‌కో ఈఈ, టెక్కలి