arasavalli : ఆదిత్యాలయంలో.. ‘ఆకలి’ బాధలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:50 AM
Aditya Temple issues ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలోని ఆదిత్యాలయంలో శనివారం ఆకలి బాధలు కనిపించాయి. 14 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో అర్థాకలితో అలమటిస్తున్నామంటూ దినసరి వేతన ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో కౌంటర్లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా అన్నదానం కేంద్రం వద్ద భోజనం కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షించి.. ఇబ్బందులు పడ్డారు.

దినసరి వేతన ఉద్యోగుల విధుల బహిష్కరణ
14 నెలలుగా జీతాల్లేవని ఆవేదన
అన్నదాన కేంద్రంలో భక్తులకు తప్పని నిరీక్షణ
వారం రోజుల్లో చెల్లిస్తామని మంత్రి అచ్చెన్న భరోసా
అరసవల్లి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలోని ఆదిత్యాలయంలో శనివారం ఆకలి బాధలు కనిపించాయి. 14 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో అర్థాకలితో అలమటిస్తున్నామంటూ దినసరి వేతన ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో కౌంటర్లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా అన్నదానం కేంద్రం వద్ద భోజనం కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షించి.. ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే.. అరసవల్లి ఆదిత్యాలయంలో 49 మంది దినసరి వేతన ఉద్యోగులు శనివారం ఉదయం విధులను బహిష్కరించారు. ‘14 నెలలుగా జీతాలు చెల్లించకుండా మాతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. జీతాల కోసం అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నాం. కుటుంబ పోషణ కోసం ఒక దినసరి ఉద్యోగి భిక్షాటన చేసి.. చివరకు ఆవేదనతో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు మానసిక ఒత్తిడికి గురై ఆస్పత్రుల పాలయ్యారు. ఈవోలు తరచూ మారుతుండడం, వచ్చిన అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే ఈ స్థితికి కారణమ’ దినసరి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కౌంటర్లు ఖాళీ
దినసరి వేతన ఉద్యోగుల నిరసన నేపథ్యంలో ఆలయంలో కౌంటర్లు తెరచుకోలేదు. ప్రసాదాల కౌంటర్లు, రూ.100, రూ.300 టిక్కెట్లు అమ్మకం సాగించే కౌంటర్లు, సమాచార కేంద్రం, సేవా కౌంటర్లు, డొనేషన్ల కౌంటర్లు, కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు హాజరు కాకపోవడంతో అన్నీ ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. దీంతో ఈవో వై.భద్రాజీ, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ వారిని కార్యాలయానికి పిలిపించి చర్చలు జరిపారు. ఈ విషయమై ఇప్పటికే దేవదాయశాఖ కమిషనర్‌కు విన్నవించామని, త్వరలోనే అందరికీ జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, విధులకు హాజరు కావాలని ఈవో భద్రాజీ నచ్చజెప్పారు. వారంతా శాంతించి మళ్లీ విధులకు హాజరయ్యారు. ప్రసాదాల తయారీ, అన్నదానం వద్ద ఉదయం 10.30 తరువాత పనులు ప్రారంభించారు. దీంతో అన్నప్రసాద వితరణ ఆలస్యంగా ప్రారంభమైంది. కొందరు భక్తులు గంటల తరబడి నిరీక్షించి ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి దినసరి వేతన ఉద్యోగుల సక్రమంగా జీతాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.
మంత్రి అచ్చెన్న దృష్టికి..
ఆదిత్యాలయంలో సేవలందిస్తున్న సుమారు 35మంది దినసరి ఉద్యోగులు శనివారం సాయంత్రం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడుని కలిశారు. జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని తమ బాధలను విన్నవించారు. మంత్రి తక్షణమే స్పందిస్తూ ఎమ్మెల్యే గొండు శంకర్, ఈవో వై.భద్రాజీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దేవదాయశాఖ కమిషనర్‌కు ఫోన్‌చేసి వారి పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున సోమవారం ఆఫీసుకు వచ్చిన వెంటనే జీతాలు విడుదలకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు వారం రోజుల్లో జీతాలు అందజేస్తామని మంత్రి అచ్చెన్న.. దినసరి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. తమ సమస్యపై తక్షణమే స్పందించిన మంత్రి అచ్చెన్నకు వారు కృతజ్ఞతలు తెలిపారు.