Traffic: అటుగా ప్రయాణం.. నరకమే
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:07 AM
Dangerous Route జిల్లాలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రధానంగా శ్రీకాకుళంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఇరుకు రహదారులు, ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

శ్రీకాకుళం కొత్తవంతెనపై నిత్యం ట్రాఫిక్ రద్దీ
ఇష్టారాజ్యంగా బస్సులు, ఆటోల రాకపోకలు
నిబంధనలు పాటించని వాహనదారులు
తరచూ రోడ్డు ప్రమాదాలు
శ్రీకాకుళం క్రెం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రధానంగా శ్రీకాకుళంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఇరుకు రహదారులు, ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళంలోని కొత్త వంతెనపై ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఆటోలు నిలిపివేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారుల విస్తరణ జరగడం లేదు. ప్రత్యామ్నాయ దారులపై కూడా అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు.
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం, పొందూరు, రాజాం, బొబ్బిలి వెళ్లే వాహనాలు డేఅండ్‌నైట్ జంక్షన్ సమీపంలో ఉన్న నాగావళి నదిపై నిర్మించిన కొత్తవంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు కూడా ఇదే బ్రిడ్జి మీదుగా వస్తుంటాయి. నిత్యం ఈ వంతెనపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఈ వంతెన చివరన ప్రయాణికులను దించేందుకు నిలిపేస్తున్నారు. అలాగే డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి విశాఖపట్నం, లావేరు, చిలకపాలెం వెళ్లే ఆటోలు సైతం బ్రిడ్జి ప్రారంభంలో నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. దీంతో బ్రిడ్జి నుంచి డే అండ్‌నైట్ జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఇదే ప్రాంతంలో అత్యధిక ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలలు ఉన్నాయి. ట్రాఫిక్ కారణంగా ఆస్పత్రులు, పాఠశాలలకు వెళ్లేవారు నరకయాతన పడుతున్నారు.
ప్రమాదాలెన్నో...
నాగావళి కొత్త వంతెన ప్రారంభంలో రహదారి ఇరుకుగా ఉంటుంది. కాగా.. విశాఖ నుంచి వచ్చే వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నిలిపేయడం ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. అలాగే బస్సులు, కార్లలో అతివేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో కొత్త వంతెనపై తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
ఈ నెల 10న కొత్తవంతెనపై ఆర్టీసీ బస్సు ఢీకొని ఎచ్చెర్ల మండలం కుంచాలకురమయ్యపేట చెందిన వెంపాడ రాజేశ్వరి అనే నిండు గర్భిణి మృతి చెందింది. ఈమె భర్త దుర్గారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఓ ఆటోడ్రైవర్ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. గర్భస్థ శిశువు కూడా చనిపోయింది. కొన్నాళ్ల కిందట ఇదే బ్రిడ్జిపై మృతురాలి భర్త దుర్గారావు మేనత్త సైతం ఇదే రీతిలో వాహనం ఢీకొని మరణించింది.
గత నెలలో ఓ ఆర్టీసీ బస్సుడ్రైవర్ కొత్త వంతెనపై అతివేగంగా వెళ్తూ కారుని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు యజమానిపై డ్రైవర్ బుకాయించేందుకు ప్రయత్నించగా స్థానికులు ఎదురుతిరిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో కారు అద్దాన్ని ఆర్టీసి డ్రైవర్ బాగు చేయించారు.
కొన్నేళ్ల కిందట ఇదే జంక్షన్‌లో ఎక్సైజ్ డీసీ కారును అతివేగంగా నడుపుతూ.. సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టారు. వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇటువంటి ఘటనలు కోకొల్లలు.
కొత్త వంతెనతో పాటు, జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా కోర్టు పరిసర ప్రాంతాల్లో సైతం ప్రైవేట్ బస్సులు, ఆటోలు ఇష్టానుసారంగా నిలిపివేస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
సమస్య పరిష్కరిస్తాం
డేఅండ్‌నైట్ కూడలిలో ట్రాఫిక్ సమస్య వాస్తవమే. ఆర్టీసీ సిబ్బందికి హెచ్చరించినా బ్రిడ్జి ముందు ప్రయాణికులను దించేందుకు బస్సులు ఆపుతున్నారు. ఆటోడ్రైవర్లు సైతం ఇదే పంఽథాలో నడుస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు యజమానులతో చర్చిస్తాం. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.
- నాగరాజు, ట్రాపిక్ సీఐ