Pagan propaganda ఆలయాల గోడలపై అన్యమత ప్రచారం
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:26 AM
Pagan propaganda జలుమూరు మండలంలోని వివిధ ఆలయాల గోడలపై అన్యమత ప్రచారం రాతలు కలకలం సృష్టించాయి.

బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగదళ్ ఆందోళన
యలమంచిలిలో ఉద్రిక్తత
సీసీ కెమెరాలు అమర్చకపోవడంపై ఎస్పీ అసంతృప్తి
గోడలపై వేలిముద్రలు సేకరించిన క్లూస్‌టీమ్
జలుమూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): జలుమూరు మండలంలోని వివిధ ఆలయాల గోడలపై అన్యమత ప్రచారం రాతలు కలకలం సృష్టించాయి. యలమంచిలి ఎండల కామేశ్వర, కామినాయుడుపేట అభయాంజనేయ, కొండకామేశ్వరపేట ఆంజనేయస్వామి ఆలయాల గోడలపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏసుక్రీస్తు శిలువ గుర్తు, ఏసుక్రీస్తు ప్రచార బోధనలు నలుపు రంగుతో రాశారు. యలమంచిలి ఎండల కామేశ్వరస్వామి ఆలయ అర్చకులు వసనాభి వెంకటరమణ ఆదివారం తెల్లవారుజామున ఆ రాతలను గమనించి గ్రామపెద్దలకు తెలిపారు. వారిచ్చిన సమాచారంతో విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ , బీజేపీ నాయకులు వచ్చి ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గోడలపై ఉన్న రాతలను చెరిపేసేందుకు ప్రయత్నించగా వీహెచ్‌పీ నాయకులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు చెరపడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, టెక్కలి, శ్రీకాకుళం డీఎస్పీలు మూర్తి, సీహెచ్.వివేకానంద, నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు, సారవకోట, నరసన్నపేట, పోలాకి ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామ పెద్దలు, బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగదళ్ నేతలు శాంతించారు. గోడలపై వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. ఇంత విశిష్టత కలిగిన ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చకపోవడంపై ఎస్పీ మహేశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్చకుడు వసనాభి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సారవకోట ఇన్‌చార్జి ఎస్‌ఐ అనిల్ కుమార్ తెలిపారు.
పాస్టరుపై గ్రామస్థుల అనుమానం
ఆలయ గోడలపై రాతలు యలమంచిలిలో నివసిస్తున్న పాస్టరు చొక్కాపు శంకరరావు, ఆయన కుమారుడు హైజాక్ పనే అయి ఉంటుందని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. శంకరరావు బుడితి చర్చి పాస్టరుగా పనిచేస్తూ యలమంచిలిలో గత 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. శంకరరావు తన కుమారుడితో కలసి శనివారం రాత్రి 10 గంటల తరువాత ద్విచక్రవాహనంపై తిరిగారని, ఈ రాతలు వారిపనే అయి ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తగదు
ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి అక్కడికి చేరుకుని హిందూ సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పర్వదినం నాడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాం టి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. ప్రభుత్వాలు, చట్టాలపై మాకు నమ్మకం ఉందని, బాధ్యులను గుర్తించి పోలీసులు కఠినంగా శిక్షిస్తారని నమ్ముతున్నామన్నారు. అయితే చర్యలు తీసుకో వడంలో జాప్యం చేస్తే రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దోషులను శిక్షించే వరకు ఆలయం వద్ద మౌనదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ రవికుమార్, చల్లవానిపేట సొసైటీ మాజీ అధ్యక్షుడు కనకయ్య, వీహెచ్‌పీ, భజరంగదళ్, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.