Share News

minister achhenna: రూ.100కోట్లతో ఆదిత్యాలయ అభివృద్ధి

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:27 PM

Adityalaya Development కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకం ద్వారా రూ.100కోట్లు మంజూరు చేయించి, అరసవల్లి ఆదిత్యాలయాన్ని దేశంలోనే ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

minister achhenna: రూ.100కోట్లతో ఆదిత్యాలయ అభివృద్ధి
మంత్రి అచ్చెన్నాయుడుకి జ్ఞాపికను అందిస్తున్న ఆలయ ఈవో భద్రాజీ

  • మంత్రి అచ్చెన్నాయుడు

  • అరసవల్లి/ శ్రీకాకుళం రూరల్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకం ద్వారా రూ.100కోట్లు మంజూరు చేయించి, అరసవల్లి ఆదిత్యాలయాన్ని దేశంలోనే ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కుటుంబ సమేతంగా సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి చిత్రపటాన్ని ఈవో భద్రాజీ అందజేశారు. అనంతరం మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘నా తల్లి మరణంతో సంవత్సరం పాటు స్వామిని దర్శించుకోలేకపోయాను. ఇప్పుడు దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. రాష్ట్ర పండగగా ప్రకటించడంతో ఈ ఏడాది రథసప్తమి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించాం. ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించి.. కొంతమేర చేపట్టాం. కలెక్టర్‌, ఎమ్మెల్యే శంకర్‌, ఇతర అధికారులతో తక్షణమే మాట్లాడి మిగిలిన పనులను పూర్తిచేస్తాం. స్నానాల గదులు, మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు భక్తులకు ఎండ నుంచి రక్షణ కోసం తగిన ఏర్పాట్లు వెంటనే చేయాల్సి ఉంది. భక్తులు సంతృప్తి చెందేలా అభివృద్ధి పనులు చేపడతామ’ని తెలిపారు. అనంతరం ఆయన నగరంలోని ఉమారుద్ర కోటేశ్వరస్వామిని, పెద్దపాడులోని అప్పన్నమ్మ తల్లిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:27 PM