Soil and Gravel: తవ్వుకుంటాం.. దండుకుంటాం!
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:03 AM
Soil digging పలాసలో కంకర, మట్టి మాఫియా మళ్లీ పెరిగిపోతుంది. రాత్రి 11 గంటలైతే చాలు ఎక్స్‌కవేటర్లు, భారీ టిప్పర్లు, ట్రాక్టర్లు.. కంకర, మట్టి కోసం క్యూ కడుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మాఫియా తవ్వకాలు యథాతఽథంగా సాగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

పలాసలో రెచ్చిపోతున్న మట్టి, కంకర మాఫియా
రాత్రివేళ యథేచ్ఛగా తవ్వకాలు.. తరలింపు
పలాస, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పలాసలో కంకర, మట్టి మాఫియా మళ్లీ పెరిగిపోతుంది. రాత్రి 11 గంటలైతే చాలు ఎక్స్‌కవేటర్లు, భారీ టిప్పర్లు, ట్రాక్టర్లు.. కంకర, మట్టి కోసం క్యూ కడుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మాఫియా తవ్వకాలు యథాతఽథంగా సాగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మారినా.. తమ తీరు మారదంటూ అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతుండడం చర్చనీయాంశం అవుతోంది. పలాసకు సమీపంలో కంబిరిగాం, కేదారిపురం ప్రాంతాల్లో మట్టిని అర్ధరాత్రి వరకూ తవ్వకాలు సాగిస్తున్నారు. పొలాల దిగువన ఇండియన్ ఆయిల్ కంపెనీ(ఐఓసీ)కి చెందిన పైపులైన్లు ఉండడంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు నిషేధం. కానీ మాఫియా యథేచ్ఛగా టన్నుల కొద్దీ మట్టిని తవ్వేస్తోంది. రెండు రోజులుగా తవ్వకాలు జోరందుకోవడంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఐఓసీ అధికారులు కూడా తమ పైపులైన్లకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం మట్టి మాఫియా ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోంది. ట్రిప్పర్‌లో 30 టన్నుల వరకూ మట్టిని లోడ్ చేస్తున్నారు. ఇలా రోజుకు పది నుంచి 15 ట్రిప్పర్ల మట్టి తరలిపోతుంది. ఇటుకల తయారీ, పునాదుల్లో నింపేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. పలాస-కాశీబుగ్గకు చెందిన ఓ వ్యక్తి ఇటుకల బట్టీలకు మట్టిని సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఒక్కో టిప్పర్ రూ.15వేల నుంచి రూ.20వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో 20కు పైగా ఇటుకబట్టీలు ఉండగా మొత్తం కంబిరిగాం, కేదారిపురం గ్రామాల సరిహద్దుల నుంచే మట్టి రవాణా అవుతోంది.
కంకరనూ వదలని అక్రమార్కులు:
కంకర తవ్వకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పద్మనాభపురం కాలనీకి సమీపాన శనీశ్వర ఆలయం వెనుక భాగంలో ఉన్న కంకర కొండంతా ఇప్పటికే సగానికి పైగా తవ్వి సొమ్ము చేసుకున్నారు. 30 సంవత్సరాల కిందట ప్రభుత్వ భూములుగా ఉన్న ఈ స్థలంలో 16 మంది వ్యక్తులకు పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఎటువంటి నిర్మాణాలు చేసుకోలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న కంకర మొత్తం తవ్వేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకూ అమ్ముతున్నారు. గతంలో ఇక్కడ కంకర తవ్వకాలు జరిగినపుడు అధికారులు అడ్డుకొని కేసులు నమోదు చేయడంతో తవ్వకాలు ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారి తొమ్మిది నెలలు కావడంతో కంకర, మట్టి మాఫియా సభ్యులు తెగబడుతున్నారు. మాఫియాపై అధికారులకు సోమవారం రాత్రి స్థానిక ప్రజలు ఫోన్ చేసి సమాచారం అందించారు. అర్ధరాత్రి పోలీసుల సహకారం లేకపోవడంతో ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయారు. మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారుల బృందం వెళ్లి పరిశీలించినపుడు అప్పటికే విలువైన మట్టి, కంకర తరలిపోయింది. రెవెన్యూ, పోలీసు, మైన్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి ఈ మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ వ్యవహారంపై తహసీల్ధార్ టి.కళ్యాణచక్రవర్తి వద్ద ప్రస్తావించగా.. కంకర, మట్టి తవ్వకాల విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.
మూడు టిప్పర్లు, ఎక్స్‌కవేటర్ స్వాధీనం
అక్రమంగా మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కేదారిపురం, కంబిరిగాం గ్రామాల వద్ద పొలాల్లో మట్టిని తవ్వుతుండగా తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తి ఆధ్వర్యంలో సిబ్బంది, కాశీబుగ్గ పోలీసులు దాడులు చేసి మూడు టిప్పర్లు, ఒక ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి నుంచి రూ.60 వేలు అపరాధ రుసుం వసూలు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. వాహనాలను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. బుధవారం వాటికి నిబంధల మేరకు అపరాధ రుసుం విధించి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టకూడదని, దీనిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.