sand: పట్టుకోండి చూద్దాం!
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:04 AM
Sand Transportation జిల్లాలో వంశధార నది నుంచి గత రెండు నెలలుగా ఇసుకను ఒడిశాకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. కొత్తూరు మండలం ఆకులతంపర రీచ్ నుంచి ఇసుకను హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు దాటుకుని ఒడిశా రాష్ట్రంలోని బిన్నాళ, బావుసోళ, ఉప్పలాడ ప్రాంతాలకు ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు.

జిల్లా నుంచి ఒడిశాకు ఇసుక తరలింపు
పట్టించుకోని అధికారులు
మెళియాపుట్టి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంశధార నది నుంచి గత రెండు నెలలుగా ఇసుకను ఒడిశాకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. కొత్తూరు మండలం ఆకులతంపర రీచ్ నుంచి ఇసుకను హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు దాటుకుని ఒడిశా రాష్ట్రంలోని బిన్నాళ, బావుసోళ, ఉప్పలాడ ప్రాంతాలకు ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.. అంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఒడిశాలో ఇసుక మంచి డిమాండ్ ఉంది. ట్రాక్టర్ లోడు రూ.8వేలకుపైగా పలుకుతోంది. ఆంధ్రాలో ఉచిత ఇసుక విధానం అమలుకావడంతో.. వంశధార నది నుంచి రోజు 20 నుంచి 30 ట్రాక్టర్లలో ఒడిశాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒడిశాకు చెందిన కొంతమంది ఇసుక వ్యాపారులు కొంతమంది అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చి.. తమకు అడ్డులేకుండా మంతనాలు చేసుకుని ఇసుక తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికంగా సెలవు రోజుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక వ్యాపారులకు కొంతమంది నేతలు సహకారం ఉండడంతో అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. రాత్రివేళలో కొంతమంది రెవెన్యూ సిబ్బంది అడ్డుకోగా.. వారిని తప్పించుకుని అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఇటీవల ఆంధ్రా రిజిస్ర్టేషన్ ట్రాక్టర్లుపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు ఆంధ్రా రిజిస్ర్టేషన్ గల ట్రాక్టర్లతో సరిహద్దు ప్రాంతాల వరకు ఇసుకను తరలించి డంపింగ్ చేస్తున్నారు. మహేంద్రతయన నది సమీపంలోని కొసమాళ వద్ద, శేఖరాపురం రహదారిలో, వసుంధర, పెద్దజగన్నాథపురం వంటి ప్రాంతాల్లో అధికంగా ఇసుక నిల్వలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఒడిశా ట్రాక్టర్లలో లోడ్ చేసి.. అక్రమ రవాణా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై మెళియాపుట్టి తహసీల్దార్ బి.పాపారావు వద్ద ప్రస్తావించగా.. ‘ఒడిశాకు ఇసుక తరలిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. సరిహద్దు వీఆర్వోలతో నిఘా ఉంచాం. రాత్రివేళల్లో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పోలీసులకు కూడా తెలిపాం. వంశధార నది సమీపంలో ఇసుక తవ్వకాలు కట్టడి చేసేందుకు సంబంధించి అధికారులతో చర్చిస్తామ’ని తెలిపారు.