Gravel Mining: మాకెవరు అడ్డొచ్చేది?
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:10 AM
Environmental Damage ‘కొండనూ వదలం. ప్రభుత్వ భూమి అయినా విడిచిపెట్టం. అంతా మా ఇష్టం. మమ్మల్ని ఆపేది ఎవరు?’ అంటూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారుల హెచ్చరికలను సైతం భేఖాతరు చేస్తూ కొండలకు కొండలే దోచేస్తున్నారు. కంకర అక్రమ తవ్వకాలు చేపడుతూ.. సొమ్ము చేసుకుంటున్నారు.

ముక్తింపురం కొండపై ఆగని తవ్వకాలు
భారీగా తరలిపోతున్న కంకర
హెచ్చరిక బోర్డును చించేసిన అక్రమార్కులు
అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న వైనం
రణస్థలం మండలం ముక్తింపురం కొండపై కంకర అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. ఇక్కడ నుంచి వేలాది క్యూబిక్ మీటర్లలో కంకరను తరలించి సగానికిపైగా కొండను చదును చేసేశారు. దీనిపై గత నెల 8న ‘ఇక్కడ ఓ కొండ ఉండేది’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు అధికారులు స్పందించి ఆ కొండపై ‘ఇది ప్రభుత్వం స్థలం, కంకర తవ్వకాలు చేపడితే శిక్షర్హులు’ అంటూ హెచ్చరిక నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్రమార్కులు ఆ హెచ్చరిక బోర్డును చింపేసి.. యథావిధిగా కంకర తరలించుకుపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రణస్థలం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘కొండనూ వదలం. ప్రభుత్వ భూమి అయినా విడిచిపెట్టం. అంతా మా ఇష్టం. మమ్మల్ని ఆపేది ఎవరు?’ అంటూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారుల హెచ్చరికలను సైతం భేఖాతరు చేస్తూ కొండలకు కొండలే దోచేస్తున్నారు. కంకర అక్రమ తవ్వకాలు చేపడుతూ.. సొమ్ము చేసుకుంటున్నారు. రణస్థలం మండలం ముక్తింపురంలో 58 సర్వే నంబర్‌లో 76 ఎకరాల్లో కొండ పోరంబోకు భూమి ఉంది. వననర్సరీలో భాగంగా అప్పటికే ఆ భూమిలో అటవీ శాఖ నీలగిరి, ఆకేసు చెట్లు పెంచుతోంది. ఈ ప్రాంతంలో కంకర డిమాండ్ ఉండడంతో అక్రమార్కుల కన్ను ఈ కొండపై పడింది. కనీస అనుమతులు లేకుండా ఈ కొండపై వేలాది క్యూబిక్‌మీటర్ల కంకరను తవ్వేస్తున్నారు. వందలాది లారీలు, ట్రాక్టర్లలో తరలించుకుపోతూనే ఉన్నారు. దీనిపై గత నెల 8న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురించగా అధికారులు స్పందించారు. ‘ఇది ప్రభుత్వ భూమి అని.. అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరిక బోర్డు పెట్టారు. కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్న అక్రమార్కులు.. మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. ఆ హెచ్చరిక బోర్డును చింపేసి.. యథావిధిగా తమ పని కానిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా భూగర్భ గనులు, మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ హయాం నుంచీ..
ముక్తింపురం కొండను ఆక్రమించేందుకు గతంలో వైసీపీ నేతలు పన్నాగం పన్నారు. ఇక్కడ ఎకరా రూ.5కోట్లపైగా పలుకుతోంది. ఈ భూమి పక్కనే ప్రైవేటు లేఅవుట్‌లు వెలిశాయి. ఇక్కడ సెంటు భూమి రూ.5లక్షలు. మూడున్నర సెంట్ల ఇంటి ప్లాట్ రూ.17 లక్షలకు విక్రయిస్తున్నారు. దీంతో కొండ పోరంబోకు భూమిపై కొంతమంది కన్నుపడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండ దిగువ ప్రాంతంలో 15ఎకరాలు చదును చేసి ప్లాట్లుగా విభజించారు. గ్రామంలో నిరుపేదల పేరిట ప్లాట్లను విభజించారు. ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ అనుమతులు తీసుకోలేదు. మొత్తం 200మందికిపైగా ప్లాట్లు కట్టబెట్టారు. అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ తెరవెనుక మొత్తం భూమిని ఆక్రమించుకోవాలని అప్పటి చోటానేతలు యత్నించారు. దీంతో అది రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిపోయింది. గతేడాది ఫిబ్రవరి 4న ఘర్షణకు దారితీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత అధికారులు వచ్చి బోర్డులు పాతడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఏడాది తిరగక ముందే కంకర దందా నడిచింది. ఇప్పుడు కూడా హెచ్చరిక బోర్డులు పెట్టినా.. అక్రమార్కులు బేఖాతరు చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. కొండ పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, అధికారులు స్పందించి కంకర అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
ముక్తింపురం కొండలో గ్రావెల్ తవ్వకాలపై ఫిర్యాదుల మేరకు సిబ్బందిని అప్రమత్తం చేశాం. పూర్తిస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేశాం.
- ఎన్.ప్రసాద్, తహసీల్దార్, రణస్థలం