Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:15 PM
Tirupati Stampede: వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో టికెట్ల జారీ ముందు తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలంటూ ఏపీ హైకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యాయి. వాటిపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతి, ఫిబ్రవరి12: వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి టికెట్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ సంఘటనపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో.. వేరే విచారణ అవసరం లేదని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ జరపాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. ఇక ఇదే అంశంపై ఈ రోజు మరో పిల్ దాఖలు చేసింది. దీనిని సైతం హైకోర్టు కొట్టివేసింది. టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలంటూ.. కర్నూలుకు చెందిన ప్రభాకర్ రెడ్డి ఏపీ హైకోర్టులో గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. 2025, జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి. ఈ నేపథ్యంలో తిరుమలలో 10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఆ క్రమంలో జనవరి 9వ తేదీ తెల్లవారుజాము నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది.
అందుకోసం తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో 94 టోకెన్ జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పిల్లాపాపలతో సహా భారీగా తిరుపతికి వచ్చి చేరుకున్నారు. అయితే బైరాగి పట్టెడ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో సిబ్బంది ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించేందుకు క్యూ లైన్ గేట్‌ను తెరిచారు.
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్లు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ సైతం క్షమాణలు చెప్పారు.
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
అలాగే మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు సైతం నష్ట పరిహారం అందించారు. అలాగే వారికి మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాట ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ ఇద్దరు వ్యక్తులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ పిల్‌ను కోర్టు కొట్టి వేసింది.
For AndhraPradesh News And Telugu News