జిల్లాలో 10,500 ఫారం పాండ్స్
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:41 PM
జిల్లాలో 10,500 ఫారం పాండ్స్ నిర్మించాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్‌ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌కు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం
పశువుల షెడ్లకు ప్రాధాన్యమివ్వండి
ఉపాధి పనుల్లో అత్యధిక పని దినాలు
కల్పించి, ఆర్థిక భరోసా కల్పించండి
పాడేరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 10,500 ఫారం పాండ్స్ నిర్మించాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్‌ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. శుక్రవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌కు పలు సూచనలు చేశారు. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఫారం పాండ్స్ నిర్మించాలని, నీటి వసతి మెరుగుపరచి అధిక ఉత్పత్తులు సాధించాలని ఆదేశించారు. అదేవిధంగా పశువుల షెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం అమల్లో పూర్తి పారదర్శకత పాటించి ప్రజలకు అండగా నిలవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అత్యధిక పని దినాలు కల్పించాలని, ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. వ్యవసాయ భూముల్లో నీటి కుంటల ఏర్పాటు, పండ్ల తోటల పెంపకం, పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు డ్వామా పీడీ విద్యాసాగర్, డీపీవో లవరాజు, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, డీడీ రజిని, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్ పాల్గొన్నారు.