ఏప్రిల్ 30న అప్పన్న చందనోత్సవం
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:19 AM
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (నిజరూప దర్శనం) వచ్చే నెల 30వ తేదీన జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ తెలిపారు. చందనోత్సవానికి భారీఎత్తున భక్తులు హాజరుకానున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో చందనోత్సవ ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, దేవదాయ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. చందనోత్సవం నేపథ్యంలో ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి దర్శనాలు నిలిపివేయాలని, భక్తులకు ఈ విషయం తెలియజేయాలని అధికారులకు సూచించారు. దర్శనం టికెట్ల విక్రయ కేంద్రాలు నగరంలో అనుకూలమైన ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

రూ.1,500, రూ.1,000, రూ.300 టికెట్ల అమ్మకం
స్లాట్ల ప్రకారమే దర్శనాలు
కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి నిషేధం
కలెక్టర్ హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (నిజరూప దర్శనం) వచ్చే నెల 30వ తేదీన జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరప్రసాద్ తెలిపారు. చందనోత్సవానికి భారీఎత్తున భక్తులు హాజరుకానున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో చందనోత్సవ ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, దేవదాయ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. చందనోత్సవం నేపథ్యంలో ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి దర్శనాలు నిలిపివేయాలని, భక్తులకు ఈ విషయం తెలియజేయాలని అధికారులకు సూచించారు. దర్శనం టికెట్ల విక్రయ కేంద్రాలు నగరంలో అనుకూలమైన ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని ఆదేశించారు. దర.్శనం కోసం రూ.1,500, రూ.1,000, రూ.300 టికెట్లు అమ్మకం ప్రణాళికాయుతంగా చేపట్టాలన్నారు. రూ.1,500 టికెట్ కొన్న భక్తులకు నీలాద్రిగుమ్మం వరకూ అనుమతిస్తామన్నారు. ఏప్రిల్ 30వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకూ అనువంశిక ధర్మకర్త, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు అంతరాలయ దర్శనాలు ఉంటాయన్నారు. వీఐపీలకు అంతరాయల దర్శనాలపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొండపైకి వచ్చే వాహనాలను గణనీయంగా తగ్గించాలని పోలీసులకు సూచించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాల పాస్‌లు ఇవ్వాలని, ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించవద్దన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా కింద నుంచి కొండపైకి, దర్శనం తరువాత కొండ పైనుంచి కిందకు బస్సులు ఏర్పాటుచేయాలన్నారు. పోలీస్ కమిషనర్ శంఖబాత్రబాగ్చి మాట్లాడుతూ కొండపై అదనపు పార్కింగ్ ప్రదేశం ఏర్పాటుచేయాలని, శాశ్వత అవుట్ పోస్టు నెలకొల్పాలని సూచించగా, ఆ మేరకు సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇంకా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీపీ చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలతో దేవదాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో భవానీశంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, సింహాచలం ఇన్‌చార్జి ఈవో కె.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.