29న జీవీఎంసీ బడ్జెట్ సమావేశం
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:12 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించనున్నట్టు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు.

సభ్యులకు సమాచారం అందజేసిన సిబ్బంది
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించనున్నట్టు జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4,554.27 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు ముసాయిదా బడ్జెట్ రూపొందించిన విషయం తెలిసిందే. దానిని స్టాండింగ్ కమిటీ ఈ ఏడాది జనవరిలోనే ఆమోదించింది. అనంతరం కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదించాల్సి ఉండగా, అదే సమయంలో కమిషనర్ బదిలీ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌చార్జి కమిషనర్‌గా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఆలోగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఉండగా బడ్జెట్ సమావేశానికి వీల్లేకపోవడంతో అధికారులు మిన్నకుండిపోయారు. ఈనెల ఐదో తేదీ నుంచి ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయడంతో బడ్జెట్ సమావేశం ఏర్పాటుపై అధికారులు దృష్టిసారించారు. కానీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతో ఎమ్మెల్యేలంతా అమరావతిలో ఉండిపోయారు. దీంతో బడ్జెట్ సమావేశం నిర్వహణకు అవకాశం లేకుండాపోయింది. మరో పది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నది. అప్పటిలోగా బడ్జెట్ ఆమోదం పొందకపోతే జీవీఎంసీ సాధారణ కార్యకలాపాలకు కూడా ఇబ్బంది తలెత్తుతుంది. ఇదే విషయం ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం కథనం ప్రచురితమవడంతో ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న ఏర్పాటుచేయాలని జీవీఎంసీ కార్యదర్శిని ఆదేశించారు. దీంతో సమావేశానికి హాజరుకావాలని నోటీసుతోపాటు బడ్జెట్ ముసాయిదా ప్రతులను గురువారం కార్పొరేటర్లందరికీ అందజేశారు. 29వ తేదీ నాటికి కొత్త కమిషనర్‌ను నియమిస్తే ఆయన ఆధ్వర్యంలోనే బడ్జెట్ సమావేశం జరుగుతుందని, ఎవరినీ నియమించకపోతే ఇన్‌చార్జి కమిషనర్ హోదాలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ హాజరవుతారని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.
టీచర్ల సీనియారిటీ జాబితాలో మళ్లీ తప్పులు
గతంలో తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోని డీఈవో కార్యాలయ సిబ్బంది
24 వరకు వినతుల స్వీకరణ
విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా రూపకల్పనలో విద్యా శాఖ మళ్లీ తప్పటడుగులు వేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనియారిటీ జాబితాపై గత వారం ఇచ్చిన అభ్యంతరాలను విద్యా శాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో పరిశీలించకుండా పక్కనపడేశారని టీచర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన సీనియారిటీ జాబితానే స్వల్పంగా సవరించి గురువారం మరోసారి విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గతంలో మెరిట్ కమ్ రోస్టర్ జాబితా ఇచ్చిన అధికారులు ఇప్పుడు మెరిట్ జాబితా పేరిట మరో లిస్టు అందుబాటులోకి తీసుకువచ్చారు. గత వారం టీచర్ల నుంచి సుమారు 150 వరకు అభ్యంతరాలు వచ్చాయి. ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి దాని ప్రకారం సీనియారిటీ జాబితాలో మార్పులు చేయాల్సి ఉన్నప్పటికీ విద్యా శాఖ కార్యాలయ సిబ్బంది పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ జాబితాకు సంబంధించి మొత్తం వివరాలు ఒక ఉద్యోగి గుప్పిట్లోనే ఉన్నాయని, అతని నిర్ణయానుసారమే టీచర్ల నుంచి వచ్చి అభ్యంతరాలను పక్కనపెట్టేశారనే వాదన వినిపిస్తోంది. తప్పులు సవరించకుండా ఎన్ని పర్యాయాలు జాబితాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినా ఫలితం ఉండదని ఉపాధ్యాయ సంఘ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా గురువారం అందుబాటులో ఉంచిన జాబితాపై ఈనెల 24వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పదో తరగతి ఇన్విజిలేషన్ విధులు కాదని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి విశాఖ వచ్చి అభ్యంతరాలు ఎలా ఇస్తారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు ఇచ్చే ప్రక్రియ ఎందుకు చేపట్టరని అంటున్నారు. తొలుత అభ్యంతరాలు ఆన్‌లైన్‌లో తీసుకుని తరువాత సంబంధిత టీచర్ నుంచి వివరణ తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.