రేషన్ మాఫియా
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:16 AM
నగరంలో రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. పేదలకు ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని దళారులు కిలో రూ.12కి కొనుగోలుచేసి మిల్లర్లకు రూ.25కి విక్రయిస్తున్నారు.

ఒక్క గాజువాక ప్రాంతంలోనే 500 టన్నుల బియ్యం పక్కదారి
కార్డుదారుల నుంచి కిలో రూ.12-15కి కొనుగోలు
సబ్బవరం, చోడవరం, ఆనందపురం మండలాల్లో గల మిల్లులకు రూ.25కి విక్రయం
ప్రాంతాల వారీగా వాటాలు వేసుకున్న నలుగురు వ్యాపారులు
ఇద్దరు కార్పొరేటర్లతోపాటు మరొక నేత అండదండలు
నెలనెల మామూళ్లు
బియ్యం రవాణా చేసే మార్గంలోని పోలీస్ స్టేషన్లకు రూ.50 వేలు
కళ్లముందు నుంచి రేషన్ బియ్యం తరలిపోతున్నా పట్టించుకోని వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోతోంది. పేదలకు ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని దళారులు కిలో రూ.12కి కొనుగోలుచేసి మిల్లర్లకు రూ.25కి విక్రయిస్తున్నారు. ఒక్క గాజువాక నుంచే నెలకు 500 టన్నుల వరకు రేషన్ బియ్యం మిల్లులకు తరలిపోతున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలతోపాటు పోలీసులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా 5.29 లక్షల బియ్యం కార్డులు ఉండగా, ప్రభుత్వం ఎనిమిది వేల టన్నులు సరఫరా చేస్తోంది. అయితే ఆ బియ్యాన్ని అతికొద్దిమంది మాత్రమే తింటున్నారు. మిగిలిన వారంతా కేజీ రూ.12 నుంచి రూ.15కి విక్రయించుకుంటున్నారు. ఆ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న వారంతా తమతో అవగాహన కుదుర్చుకున్న మిల్లర్లకు కిలో రూ.25కి విక్రయిస్తున్నారు. మంచి లాభం వస్తుండడంతో రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయించేవారు పెరిగిపోతున్నారు. దళారులంతా ఒక్కో ప్రాంతాన్ని పంచుకుని ప్రజల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలిస్తున్నారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో అయితే రేషన్ బియ్యం మాఫియా మరింత వేళ్లూనుకుపోయింది. గతంలో గుట్కా వ్యాపారం చేసిన వ్యక్తితోపాటు మరో ముగ్గురు గాజువాక, పెదగంట్యాడ, మల్కాపురం, సింథియా ప్రాంతాలను వాటాలుగా పంచుకుని రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆయా పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, స్థానిక నేతలు కొందరు విలేకరుల సమావేశాలు పెట్టి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పౌర సరఫరాల శాఖ అధికారులతోపాటు పోలీస్ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో నేతలను ఆ నలుగురు వ్యాపారులు కలిసి ప్రసన్నం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్‌తోపాటు టీడీపీకి చెందిన కార్పొరేటర్‌కు, టీడీపీ స్థానిక నాయకుడికి ప్రతి నెలా మామూళ్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు ఆరోపిస్తున్నారు. గాజువాక సర్కిల్‌లో 146 రేషన్ డిపోలు ఉండగా, 1.33 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా రెండు వేల టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. వీటిలో సుమారు 500 టన్నులను ఆ నలుగురు దళారీలే ప్రత్యేకంగా మనుషులను నియమించుకుని కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కేజీకి రూ.12 నుంచి రూ.15 వరకు వెచ్చించి కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి వాటిని సబ్బవరం, చోడవరం సమీపంలోని మిల్లులకు రూ.25 కి విక్రయిస్తున్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్‌కు రూ.50 వేలు మామూళ్లు
రేషన్ బియ్యం కొనుగోలు చేసిన దళారులు వాటిని వ్యాన్‌లలో సబ్బవరం సమీపంలోని ఆరిపాక, చోడవరం సమీపంలోని వెంకన్నపాలెంలోని మిల్లులకు తరలిస్తున్నారు. రైస్‌మిల్లుల సంఘంలో కీలకంగా వ్యవహరించే ఒక మిల్లు యజమాని ఏ వాహనం ఏ మిల్లుకు వెళ్లాలో ముందుగానే చెబుతాడు. వాహనం ప్రయాణించే మార్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లలోని సిబ్బందితోపాటు అధికారులను కూడా దళారులు మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మార్గంలో ఉన్న ప్రతీ పోలీస్ స్టేషన్‌కు నెలకు రూ.50 వేలు చొప్పున మామూళ్లు అందజేస్తున్నారంటున్నారు. స్థానికంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు కార్పొరేటర్లుగా ఉన్న కొందరికి, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉండే స్థానిక నేతలు, కార్పొరేటర్లకు కూడా నెలావారీ మామూళ్లు ముట్టజెబుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు టన్నుల రేషన్ బియ్యంతో మిల్లుకు వెళుతున్న వాహనాన్ని స్థానికులు కొందరు పట్టుకుని పోలీసులకు అప్పగించినా, కేసు నమోదుచేయకుండా రెండు రోజులు తాత్సారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. చివరకు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదుచేసినట్టు పోలీసులు ప్రకటించారనే ప్రచారం జరిగింది. మిల్లులకు చేరిన రేషన్ బియ్యాన్ని మిల్లర్లు కొద్దిగా పాలిష్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి లెవీ కింద అప్పగించేస్తున్నారు. దీనివల్ల మిల్లర్లకు పెద్దగా ఖర్చు, శ్రమ లేకుండానే కిలోకు రూ.పది వరకు మిగులుతోంది. రేషన్‌బియ్యం మాఫియాపై పోలీసులు, విజిలెన్స్ అధికారులతోపాటు పౌర సరఫరాల శాఖ అధికారులు ఉమ్మడిగా ఉక్కుపాదం మోపాల్సి ఉంది.