Share News

అక్రమాలకు సహకారం!

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:17 AM

జిల్లాలోని సహకార శాఖ పనితీరు ఘోరంగా ఉంది. సూపర్‌ బజార్‌ వంటి సహకార సంస్థలు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తుంటే గుర్తించాల్సిన ఆడిట్‌ విభాగం గుడ్డిగా సంతకాలు చేసి పడేస్తోంది.

అక్రమాలకు సహకారం!

  • సూపర్‌ బజారులో తప్పులపై తప్పులు చేస్తున్నా గుర్తించని వైనం

  • రూ.కోట్ల దుర్వినియోగమైనా గుడ్డిగా ఆడిటింగ్‌

  • విచారాణాధికారిగా డీసీఏఓనే నియామకం

  • ఇలాగైతే తప్పులు బయటపడతాయా?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని సహకార శాఖ పనితీరు ఘోరంగా ఉంది. సూపర్‌ బజార్‌ వంటి సహకార సంస్థలు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తుంటే గుర్తించాల్సిన ఆడిట్‌ విభాగం గుడ్డిగా సంతకాలు చేసి పడేస్తోంది. ఆడిట్‌ విభాగానికి బాధ్యత వహించే జిల్లా అధికారినే సూపర్‌ బజార్‌ గోల్‌మాల్‌ వ్యవహారంపై విచారణాధికారిగా నియమించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగైతే వాస్తవాలు వెలుగులోకి వస్తాయా?...అనేది ఉన్నతాధికారులే చెప్పాలి.

విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ స్టోర్స్‌ (సూపర్‌ బజార్‌) చాలాకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. కీలకమైన భూమిని సుహానీ షాపింగ్‌ మాల్‌కు లీజుకు ఇచ్చిన దగ్గర నుంచి అంతా అడ్డగోలుగానే నడిచింది. సంస్థ లీజు పత్రాలను బ్యాంకులో కుదవ పెట్టి సుహానీ యాజమాన్యం రూ.300 కోట్లకు పైగా అప్పులు చేసేసింది. వాటిని తీర్చలేక దివాలా తీస్తే ఆ మొత్తం మీరే కట్టాలంటూ సూపర్‌ బజార్‌కు నోటీసులు అందాయి. ఈ విషయం చాలాకాలం క్రితమే జరిగినా ఇటీవల వరకు వెలుగులోకి రాలేదు. అలాగే గత నాలుగేళ్లుగా ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ రకరకాల ఖర్చుల పేరుతో లక్షలాది రూపాయలు ఏటా డ్రా చేసుకుంటున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అందులో వివరాలు కూడా పొందుపరచారు.

ఆడిట్‌ అధికారులు ఏమి చేస్తున్నట్టు?

జిల్లాలో సహకార శాఖకు ప్రత్యేకంగా జిల్లా సహకార ఆడిట్‌ అధికారి (డీసీఏఓ) ఉన్నారు. డీసీఏవో కింద దాదాపు 70 మంది ఆడిటర్లు పనిచేస్తున్నారు. విశాఖ జిల్లాలోని సహకార సంఘాల లెక్కలన్నీ ఏటా ఆడిట్‌ చేసి, తప్పులుంటే వాటిని నివేదించాల్సిన బాధ్యత ఆడిటర్లది. వారి పనితీరు, నివేదికలను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాల్సింది డీసీఏఓ. ఇంత పెద్ద ఆడిట్‌ విభాగం ఉండగా సూపర్‌ బజార్‌లో జరుగుతున్న తప్పుడు వ్యవహారాలను ఒక్క ఏడాది కూడా ఎందుకు బయట పెట్టలేదు అన్నదే ఇప్పుడు ప్రశ్న. సుహనీ షాపింగ్‌ మాల్‌ ఒప్పందంలో చాలా తప్పులు జరిగాయి. వందల కోట్ల రూపాయల వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడిట్‌ చేయాలి. కానీ ఆ దాఖలాలు లేవు. ఒకవేళ అలా చేసి ఉంటే గుర్తించిన తప్పులను డీసీఏఓ ద్వారా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు తెలియజేసి ఉండేవారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. అక్కడ ఆడిటింగ్‌కు అనుకూలమైన వారిని పంపడం, ఏ తప్పులు గుర్తించకుండా, అంతా బాగుందని నివేదికలు ఇవ్వడం వంటి పనులు నిరాటంకంగా సాగుతూ వస్తున్నాయి.

పెరుగుతున్న ఖర్చులు గుర్తించలేరా?

సూపర్‌ బజార్‌కు గతంలో భవన నిర్వహణకు ఏడాదికి రూ.5 లక్షలకు మించి ఖర్చు కాలేదు. ఇప్పటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ హయాంలో అది రెట్టింపు అయింది. ఆ పేరుతో గత నాలుగేళ్లలో రూ.60 లక్షలు వెచ్చించారు. ఖర్చు ఒక్కసారిగా పెరిగినప్పుడు ప్రశ్నించి, వాటిని నివేదించాల్సిన బాధ్యత ఆడిటర్లది. అలాగే కంటెంజెన్సీ, ఆఫీసు నిర్వహణ పేరుతో లక్షల రూపాయల ఖర్చు చూపించారు. వాటిని కూడా ఆడిటర్లు వేలెత్తి చూపించలేదు. వీటన్నింటిపై సరైన విచారణ జరిగి, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే...ఇప్పుడున్న డీసీఏఓ స్థానంలో విచారణ బాధ్యతలు వేరొకరికి అప్పగించాల్సి ఉంది. అలాగే ఈ ఐదేళ్లలో సూపర్‌ బజార్‌ లెక్కలు ఆడిటింగ్‌ చేసిందెవరో గుర్తించి, వేరే వారితో మళ్లీ ఆ లెక్కలు ఆడిట్‌ చేయించాల్సి ఉంది.

Updated Date - Mar 21 , 2025 | 01:17 AM