Share News

రాజీవ్‌ స్వగృహ భూమి డీ నోటిఫై

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:10 AM

ఎండాడలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన భూమిని ప్రభుత్వం డీ నోటిఫై చేసింది.

రాజీవ్‌ స్వగృహ భూమి డీ నోటిఫై

  • 22-ఏ నుంచి తొలగింపు

  • ప్లాట్లు కొన్నవారికి త్వరలోనే రిజిస్ట్రేషన్లు

  • మిగిలిన ప్లాట్ల వేలానికి సన్నాహాలు

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

ఎండాడలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిన భూమిని ప్రభుత్వం డీ నోటిఫై చేసింది. ప్రభుత్వ భూముల జాబితా 22-ఏ నుంచి తప్పించింది. దాంతో అక్కడ ప్లాట్లు కొన్న వారికి రిజిస్ట్రేషన్లు చేయడానికి మార్గం సుగమమైంది. మధ్య తరగతి ప్రజలకు ఫ్లాట్లు కట్టాలని 2009లో రాష్ట్ర ప్రభుత్వం ఎండాడలోని సర్వే నంబరు 16లో 57.16 ఎకరాలను రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు కేటాయించింది. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. మధ్యలోనే ఆగిపోయింది. ఆ భూమి ఖాళీగా ఉండిపోయింది. అందులో కొంత తిరుమల తిరుపతి దేవస్థానానికి కేటాయించారు. అన్నీ పోగా 47.62 ఎకరాలు మిగిలింది. గత వైసీపీ ప్రభుత్వం ఆ భూమిని 78 ప్లాట్లుగా విభజించి 2024 సాధారణ ఎన్నికలకు ముందు ఈ-వేలం నిర్వహించింది. అప్‌సెట్‌ ధర గజం రూ.60 వేలుగా నిర్ణయించగా, వాటిలో సగం ప్లాట్లు గజం రూ.60,500 చొప్పున పలువురు పాడుకున్నారు. వాటి ద్వారా రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు రూ.300 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. అయితే ఆ భూమి నెల రోజుల క్రితం వరకు 22-ఏలోనే ఉంది. ఆ ప్లాట్లు కొనుక్కున్న వారు రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందిగా అడిగితే కార్పొరేషన్‌ అధికారులు తెల్లముఖం వేశారు. అది ప్రభుత్వ భూమిగా ఇంకా రికార్డుల్లో ఉండడంతో రిజిస్ట్రేషన్లు చేయలేకపోయారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దాంతో ప్రభుత్వం అన్నీ పరిశీలించి వాటిని 22-ఏ నుంచి తప్పించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

త్వరలోనే రిజిస్ట్రేషన్లు

రాజీవ్‌ స్వగృహలో ప్లాట్లు కొనుక్కున్న వారిలో పూర్తి మొత్తం చెల్లించిన వారందరికీ వీలైనంత త్వరగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తామని హౌసింగ్‌ అధికారి సుబ్బరాజు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అక్కడ ఇంకా 39 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం కొత్తగా నిర్ణయించిన ధర గజం రూ.75,560 చొప్పున అప్‌సెట్‌ ధర నిర్ణయించి, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ-కొనుగోళ్లు పోర్టల్‌ ద్వారా వేలం నిర్వహిస్తామన్నారు.


మధురవాడలో రెండో సబ్‌ రిజిస్ర్టార్‌ పోస్టు రద్దు?

పెదగంట్యాడ నుంచి గతంలో డిప్యుటేషన్‌పై నియమించిన రోహన్‌కుమార్‌ను వెనక్కి పంపాలని ఉన్నతాధికారుల నిర్ణయం

రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు తగ్గడమే కారణం

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జాయింట్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టును రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, సూపర్‌ బజార్‌ ప్రాంగణంలోని కార్యాలయానికి మాత్రమే ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు (జాయింట్‌-1 జాయింట్‌-2) ఉన్నారు. అక్కడ లావాదేవీలు అధికంగా ఉండడం, ఆదాయం ఎక్కువ కావడంతో ఇద్దరు అధికారులతో నడుపుతున్నారు. దీని తరువాత ఎక్కువ ఆదాయం వచ్చే కార్యాలయం మధురవాడే కావడం, అక్కడ కూడా లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో గత ఏడాది జాయింట్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టును తాత్కాలికంగా సృష్టించారు. సూపర్‌ బజార్‌ కార్యాలయం నుంచి నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఆదాయం వస్తుండగా, అదేస్థాయిలో మధురవాడలో వస్తున్నదని, ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు ఉంటే పనులు వేగంగా జరుగుతాయని ఆ నిర్ణయం తీసుకున్నారు. పెదగంట్యాడలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న గ్రేడ్‌-1 సబ్‌ రిజిస్ట్రార్‌ రోహణ్‌కుమార్‌ను డిప్యుటేషన్‌పై మధురవాడలో జాయింట్‌ -2గా వేశారు. ఈ డిప్యుటేషన్‌ 2025 మార్చి 31 వరకు మాత్రమేని అప్పుడే స్పష్టంచేశారు. పెదగంట్యాడలో పెద్దగా లావాదేవీలు లేని కారణంగా డీఐజీ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ను డిప్యుటేషన్‌పై నియమించారు. అయితే ఇటీవల కాలంలో విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు బాగా తగ్గిపోవడం, ముఖ్యంగా పరిపాలనా రాజధాని వస్తుందని ప్రచారం జరిగిన మధురవాడ ప్రాంతంలో పెద్దగా కార్యకలాపాలు సాగకపోవడంతో అక్కడ జాయింట్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టును ఈ నెలాఖరు తరువాత కొనసాగించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. అక్కడ పనిచేస్తున్న రోహణ్‌కుమార్‌ను తిరిగి పెదగంట్యాడ పంపాలని భావిస్తున్నారు. పెందుర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ దీప్తి ప్రియ ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో అక్కడ కూడా మూడు నెలలు సీనియర్‌ అసిస్టెంట్‌తో కార్యాలయం నడిపించారు. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడం, లక్ష్యాలు పూర్తిచేయాల్సిన అవసరం ఉండడంతో ఆమె ఇటీవలె తిరిగి విధుల్లో చేరారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి అన్ని కార్యాలయాలను డిప్యుటేషన్లు లేకుండా పూర్తిస్థాయి సబ్‌ రిజిస్ట్రార్లతో నడపనున్నారు.


నేడు జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమాశం

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్టు కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు 104 అంశాలతో అజెండా తయారుచేసి సభ్యులకు అందజేశారు. 2023లో జరిగిన వినాయక నిమజ్జనం కోసం తీరంలో 12 చోట్ల, దేవీ నిమజ్జనం కోసం ఒకచోట సుమారు 300 మంది గజ ఈతగాళ్లను వారంరోజులపాటు నియమించినందున వారందరికీ రోజుకు రూ.500 చొప్పున చెల్లించే అంశాన్ని అజెండాలో చేర్చారు. ఏడాదిన్నర తరువాత ఈ అంశాన్ని పెట్టని అధికారులు ఇప్పుడు అజెండాలో చేర్చడం అనుమానాలకు దారితీస్తోంది.

Updated Date - Mar 21 , 2025 | 01:12 AM