Share News

వైసీపీకి ఆరుగురు కార్పొరేటర్లు గుడ్‌బై

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:19 AM

వైసీపీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

వైసీపీకి ఆరుగురు కార్పొరేటర్లు గుడ్‌బై

  • ఐదుగురు టీడీపీలో, మరొకరు జనసేనలో చేరిక

  • నేడు మరో ఆరుగురు వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరే అవకాశం

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

వైసీపీకి చెందిన ఆరుగురు కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఐదుగురు టీడీపీలో, మరొకరు జనసేనలో చేరారు. వైసీపీకి చెందిన 13వ వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీత, 17వ వార్డు కార్పొరేటర్‌ గేదెల లావణ్య, 73వ వార్డు కార్పొరేటర్‌ భూపతిరాజు సునీత, 54వ వార్డు కార్పొరేటర్‌ చల్లా రజని, 57వ వార్డు కార్పొరేటర్‌ ముర్రువాణిలు గురువారం అమరావతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు. 36వ వార్డు కార్పొరేటర్‌ మాసిపోగు మేరీజోన్స్‌ జనసేనలో చేరారు. దీంతో జీవీఎంసీ కౌన్సిల్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం 60కి పెరిగింది. శుక్రవారం మరో ఆరుగురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే కూటమి బలం 66కి పెరుగుతుంది. వీరుకాకుండా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కూటమికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ మొత్తం 11 మంది ఉన్నారు. వారితో కలిపితే కౌన్సిల్‌లో కూటమికి 77 మంది బలం ఉన్నట్టవుతుంది. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మంది సభ్యులు బలం అవసరం.

Updated Date - Mar 21 , 2025 | 01:19 AM