Share News

అదరగొట్టిన అశుతోష్‌

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:01 AM

ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుత విజయం సాధించింది.

అదరగొట్టిన అశుతోష్‌

  • ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుత విజయం

  • రాణించిన డుప్లెసిస్‌, స్టబ్స్‌, విప్‌రాజ్‌ నిగమ్‌..

  • లఖ్‌నవూ బ్యాటింగ్‌లో మిచెల్‌ మార్ష్‌, పూరన్‌ మెరుపులు

  • సిక్సర్లతో హోరెత్తిన స్టేడియం

  • పేలమైన బ్యాటింగ్‌తో నిరాశపరిచిన రిషబ్‌ పంత్‌

విశాఖపట్నం, స్పోర్ట్సు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):

ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుత విజయం సాధించింది. చివరి ఐదు ఓవర్లలో మ్యాచ్‌ను ఊహించని మలుపుతిప్పి జట్టుకు అద్భుతమైన విజయాన్నందించిన అశుతోష్‌ శర్మను ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందించారు. చివరి ఓవర్‌లో ఆరు పరుగులు చేయాల్సి ఉండగా...మూడో బంతిని అశుతోష్‌ శర్మ సిక్సర్‌గా మలచాడు.

ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బ్యాట్స్‌మెన్‌లో మార్ష్‌ మొదటి ఓవర్‌ చివరి బంతిని సిక్సర్‌గా మలిచి ఖాతా తెరిచాడు. స్టార్క్‌ వేసిన రెండో ఓవర్‌లో మక్రమ్‌, మార్ష్‌ చెరో సిక్సర్‌ బాది స్టేడియాన్ని హోరెత్తించారు. ఐదో ఓవర్‌లో నిగమ్‌ వేసిన బంతిని మక్రమ్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదుగా సిక్సర్‌ కొట్టేందుకు యత్నించి అవుటయ్యాడు. అదే ఓవర్‌లో ఎల్‌ఎస్‌జీ 50 పరుగులు పూర్తిచేసింది. ఓపెనర్‌ మార్ష్‌ 21 బంతుల్ల్లో ఐదు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. ఆ తరువాత ఓవర్‌లో మార్ష్‌ డీప్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ కొట్టగా, మరో ఎండ్‌లోని పూరన్‌ వరుసగా మూడు సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మిచెల్‌ మార్ష్‌ కేవలం 36 బంతుల్లో ఆరు బౌండరీలు, ఆరు సిక్సర్లతో 72 పరుగులు చేసి ముకేష్‌కుమార్‌ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా పెవెలియన్‌కు చేరాడు. మ్యాచ్‌ 13వ ఓవర్‌లో ఢిల్లీ బౌలర్‌ స్టబ్స్‌ను పూరన్‌ ఊచకోత కోశాడు. మిడాన్‌, మిడాఫ్‌, లాంగ్‌ ఆన్‌ మీదుగా వరుసగా నాలుగు సిక్సర్లతోపాటు మరో బౌండరీ బాది 30 పరుగులు రాబట్టాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ రిషబ్‌పంత్‌ ఆరు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. పూరన్‌ కేవలం 30 బంతుల్లో ఆరు బౌండరీలు, ఏడు సిక్సర్లతో 75 పరుగులు చేసి స్టార్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ మోహిత్‌ బౌలింగ్‌లో చివరి రెండు బంతులను మిల్లర్‌ వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా వికెట్లు కోల్పోవడంతో గ్యాలరీలలోని ప్రేక్షకులలో ఉత్సాహం తగ్గింది. డుప్లెసిస్‌ (29), కెప్టెన్‌ అక్షర పటేల్‌ (22), స్టబ్స్‌ (34) కొద్దిసేపు మెరిశారు. స్టబ్స్‌ అవుట్‌తో మ్యాచ్‌ ఢిల్లీ చేజారిందని అందరూ భావించారు. ఆ సమయంలో అశుతోష్‌శర్మ అజేయ అర్ధ సెంచరీ (66 నాటౌట్‌), విప్‌రాజ్‌ నిగమ్‌ (39) మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశారు.

Updated Date - Mar 25 , 2025 | 02:01 AM