బీచ్ రెస్టారెంట్ల బరితెగింపు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:49 AM
విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో వెలసిన రెస్టారెంట్లు ఏవీ నిబంధనలు పాటించడం లేదు.

ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు
అడ్డగోలుగా భూగర్భ జలాల వినియోగం
శుద్ధి చేయకుండానే సముద్రంలోకి వ్యర్థ జలాలు విడుదల
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న జీవీఎంసీ
హైకోర్టు ఆదేశంతో వెలుగులోకి అక్రమాలు
జాబితాలో ‘సీహార్స్’, విరాగో, ‘తీరం రెస్టారెంట్’, శాంక్టమ్, మేర్లిన్ కే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో వెలసిన రెస్టారెంట్లు ఏవీ నిబంధనలు పాటించడం లేదు. జీవీఎంసీ నుంచి అనుమతులు లేకుండానే నిర్వాహకులు నిర్మాణాలు చేపడుతున్నారు. ఏ చట్టబద్ధ సంస్థ నుంచి అనుమతులు తీసుకోకుండానే భారీ వ్యాపారాలు చేస్తున్నారు. కేవలం ట్రేడ్ లైసెన్స్ అడ్డం పెట్టుకొని భారీ దందా చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, భారీ నజరానాలతో ఇన్నాళ్లూ కళ్లు మూసుకున్న అధికారులు హైకోర్టు ఆదేశంతో వాటిపై విచారణ చేపట్టారు. ఫిర్యాదు అందిన రెస్టారెంట్లన్నీ అక్రమేనని తేల్చారు. మరి ఇన్నాళ్లు ఎందుకు వారిపై చర్యలు చేపట్టలేదనేది అధికారులే చెప్పాలి.
ముఖ్యంగా భీమిలి మండలంలో సముద్ర తీరాన్ని ఆనుకొని ప్రముఖ రెస్టారెంట్లు ఉన్నాయి. కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) పరిధిలో ఏదైనా నిర్మాణం చేపడితే ముందుగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ మేనేజ్‌మెంట్ జోన్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ)కి దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి. వారు ఎన్‌ఓసీ ఇచ్చాకే పనులు ప్రారంభించాలి. సీఆర్‌జెడ్‌లో నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం బోర్లు తవ్వకూడదు. వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే బయటకు పంపాలి. అయితే ఏ రెస్టారెంట్ కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. పైగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేశారు. వీటిపై జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్, మత్స్యకార సంఘ నాయకులు తెడ్డు శంకరరావు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. మూర్తియాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె కూడా ఇలాగే భీమిలి బీచ్‌లో అక్రమ నిర్మాణం చేపట్టగా దానిపై హైకోర్టు విచారించి, కూల్చివేయాల్సిందిగా ఆదేశించింది. ఆ క్రమంలో నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, ఫిర్యాదు అందిన ఐదు రెస్టారెంట్ల నిబంధనల ఉల్లంఘనపై నివేదిక కోరింది. జీవీఎంసీ ఏమి చర్యలు చేపట్టిందో నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. వీరి విచారణలో అసలు బాగోతాలు బయటపడ్డాయి.
పగ్గాలు లేని సీహార్స్
భీమిలి మండలం నేరెళ్లవలస సర్వే నంబరు 39/5సిలోని 33 సెంట్ల జిరాయితీ భూమిలో సీహార్స్ రెస్టారెంట్‌ను నిర్మించారు. ఆ తరువాత దీని పేరు జీ బ్యాగ్‌గా మార్చారు. ఇక్కడ 410 చ.మీ. విస్తీర్ణంలో అక్రమ నిర్మాణం ఉందని తేల్చారు. అక్కడ నిర్మాణాలు గుర్తించిన జీవీఎంసీ 16-6-2021న తొలగించాలని నోటీసు ఇచ్చింది. ఆ తరువాత పనులు ఆపాలని కోరింది. దాంతో వారు హైకోర్టుకు వెళ్లి రిట్ పిటిషన్ వేసి 3074/2024 ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది సీఆర్‌జెడ్-3లో ఉంది. అందులో హోటల్/రెస్టారెంట్ నిర్మించకూడదు. కానీ కట్టారు. అడ్డగోలుగా బోరు వేశారు. వినియోగించిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా విడిచిపెడుతున్నారు. హైకోర్టు స్టే ఎత్తివేస్తే తప్ప దీనిపై చర్యలు తీసుకునే వీలే లేదు.
విరాగోకి ఎన్‌ఓసీ నిరాకరణ
భీమిలి మండలం కాపులుప్పాడ సర్వే నంబరు 328-14, 18, 329-5లలో 285 సెంట్లలో విరాగో రెస్టారెంట్ ఏర్పాటైంది. జి ప్లస్ వన్ నిర్మాణానికి 2022లో ఒమ్మి అప్పారావు, సన్యాసిరావులు దరఖాస్తు చేశారు. దీనికి ఎన్‌ఓసీ ఇవ్వడానికి ఏపీసీజెడ్‌ఎంఏ నిరాకరించింది. ఏసీసీ నిర్మాణాలు చేపడుతుంటే జీవీఎంసీ పనులు ఆపాలని కోరింది. ఆ తరువాత దానిని మద్దిపాటి శిరీష లీజుకు తీసుకుని జీవీఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు. అలాగే ఎక్సైజ్ నుంచి లిక్కర్ లైసెన్స్ పొందారు. ఇది సీఆర్‌జెడ్-3లో ఉంది. హోటల్, రెస్టారెంట్ కట్టకూడదు. బోరు అక్రమంగా వేసి నీటిని వాడుతున్నారు. వ్యర్థ జలాలు కాలువలోకి వదిలేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఓ ప్రజా ప్రతినిధి అండగా ఉండడంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారు.
ప్రభుత్వ భూమి ఆక్రమించిన తీరం బీచ్
నేరెళ్లవలస సర్వే నంబరు 12/1డి, 1ఈలలో 23 సెంట్ల జిరాయితీ భూమిలో తీరం రెస్టారెంట్ పెట్టారు. 135 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమించినట్టు అధికారులు తేల్చారు. స్విమ్మింగ్ పూల్స్ నిర్మించారు. ఏసీసీ షీట్లతో నిర్మాణం ఉంది. ఇది సీఆర్‌జెడ్ నో డెవలప్‌మెంట్ జోన్‌లో ఉంది. ఏపీసీజెడ్‌ఎంఏ నుంచి ఎన్‌ఓసీ తీసుకోలేదు. వీరు కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
వైసీపీ నేతల అడ్డా శాంక్టమ్ బీచ్
కాపులుప్పాడ సర్వే నంబర్ 412లో 2.11 ఎకరాల్లో ఏపీటీడీసీ తొట్లకొండకు ఎదురుగా బీచ్‌లో బే వాచ్ పేరుతో రెస్టారెంట్ నిర్మించింది. అందులో ప్రస్తుం ప్రభుత్వ భూమి 46 సెంట్లు ఉన్నట్టు తేల్చారు. దానిని మూర్తి అనే వ్యక్తికి ఏపీటీడీసీ 2017లో పదేళ్లకు లీజుకు ఇచ్చింది. దానిని ముగ్గురు వైసీపీ నేతలు తీసుకుని పేరు ‘శాంక్టమ్’గా మార్చి నిర్వహిస్తున్నారు. అదనపు నిర్మాణాలకు జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకోలేదు. దీనిపై అధికారులు నివేదిక సమర్పించడానికి 24 గంటల ముందు వారికి నోటీసు ఇచ్చారు. ఇది కూడా నో డెవలప్‌మెంట్ జోన్‌లో ఉంది. బోర్లు వేసి నీటిని వినియోగిస్తూ వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ నిర్మాణాలన్నీ సిమెంట్ ఇటుకలతో కట్టారు.
ఆక్రమిత స్థలంలో మేర్లిన్ కే బీచ్
భీమిలి మండలం నేరేళ్లవలస సర్వే నంబరు 126లో ఏపీటీడీసీ మేర్లిన్ కే బీచ్ పేరుతో నిర్మాణం చేపట్టింది. లీజుకు ఇచ్చేసి తన పని అయిపోయిందని చేతులు దులుపుకుంది. ప్రస్తుతం అందులో 65 సెంట్లు ఆక్రమిత భూమి ఉన్నట్టు తేలింది. నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. వీరు కూడా అక్రమంగా బోరు వేసి, వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీనికి కూడా నివేదిక సమర్పించడానికి ఒకరోజు ముందు జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది.
ఫొటో: 25 వీఎస్‌పి 2
రైటప్: బీచ్‌లో నేహారెడ్డి నిర్మించిన పునాదులు తొలగిస్తున్న దృశ్యం
మరో 4 వారాలు గడువివ్వండి
భీమిలి బీచ్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు
సమయం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించిన జీవీఎంసీ
తీరం వెంబడి అనుమతులు లేకుండానే రెస్టారెంట్ల నిర్మించినట్టు నివేదిక
విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి బీచ్‌లో నిర్మించిన పునాదులను తొలగించడానికి మరో నాలుగు వారాల సమయం కావాలని జీవీఎంసీ అధికారులు హైకోర్టును కోరారు. ఇప్పటివరకూ చేపట్టిన పనులపై నివేదిక అందజేశారు. నేహారెడ్డి 588 మీటర్ల మేర ప్రహరీ నిమిత్తం పునాదులు నిర్మించగా, అందులో ఇప్పటివరకూ 361 మీటర్లు తొలగించామని పేర్కొన్నారు. ఇసుకలో లోతుగా పునాదులు ఉండడం వల్ల ఐదు బ్రేకర్లు, రెండు ఎక్స్‌కవేటర్లు ఉపయోగిస్తున్నామని, డెబ్రిస్‌ను దూరంగా తరలించడానికి సమయం పడుతోందని అఽదికారులు పేర్కొన్నారు. కష్టతరమైన పని కావడంతో మరికొంత గడువు కావాలని కోరారు.
భీమిలి మండలంలో తీరం వెంబడి నిర్మించిన ఐదు రెస్టారెంట్లపై కూడా నివేదిక సమర్పించారు. బీ జాగ్ (సీహార్స్) రెస్టారెంట్, తీరం బీచ్ రెస్టారెంట్, మేర్లిన్ క్లే రెస్టో బార్, శాంక్టమ్ బీచ్ రిసార్ట్స్ (తొట్లకొండ), విరాగో రెస్టో బార్...అన్నీ కోస్తా నియంత్రణ మండలిలోని నాన్ డెవలప్‌మెంట్ జోన్‌లో నిర్మించారని పేర్కొన్నారు. ఈ సంస్థలు స్థానికంగా జీవీఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోలేదని స్పష్టంచేశారు. ఏపీ కోస్టల్ మేనేజ్‌మెంట్ జోన్ వీటికి ఎన్‌ఓసీ ఇవ్వడానికి నిరాకరించిందన్నారు. నీటి కోసం భూమిలో బోర్లు వేయకూడదని, నిబంధనలు ఉల్లంఘించి బోర్లు వేశారని వెల్లడించారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే సముద్రంలోకి విడిచిపెడుతున్నారని, అవి కలుషిత జలాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించిందని వివరించారు. ఈ ఐదింటిలో రెండు సంస్థలు హైకోర్టు నుంచే స్టే ఆర్డర్ తీసుకున్నాయని, అందుకని వాటిపై చర్యలు తీసుకోలేకపోయామని పేర్కొన్నారు. ఇంకో రెండు సంస్థలు ఏపీటీడీసీ పరిధిలో ఉన్నాయని వివరించారు. ఇదిలావుండగా భీమిలి బీచ్‌లో కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారంటూ హైకోర్టు నియమించిన కమిటీ కూడా మంగళవారం తన నివేదికను సమర్పించింది.