Share News

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:29 PM

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు బుధవారం ఆందోళన చేశారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ఆందోళన చేస్తున్న గిరిజన సంఘం నాయకులు

చిన్నారికి తీవ్ర గాయాలు

- మృతుల కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని గిరిజన సంఘం ఆందోళన

హుకుంపేట, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు బుధవారం ఆందోళన చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ పాములపుట్టు గ్రామానికి చెందిన గెమ్మెలి నూకరాజు(45), దొసుభ(43) దంపతులు తమ బాబుతో హుకుంపేట మండలంలోని కోట్నాపల్లి గ్రామంలోని క్రైస్తవ సంఘ సమావేశానికి ద్విచక్ర వాహనంపై మంగళవారం వచ్చారు. రాత్రి తిరిగి గ్రామానికి వెళుతుండగా పెదగరువు వైపు నుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆ దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సీఐ నాయుడు, ఎస్‌ఐ సురేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను, గాయపడిన బాలుడిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.

గిరిజన సంఘం ఆందోళన

మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు బుధవారం ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. జాతీయ రహదారి పనుల వల్ల అనేక మంది మృతి చెందుతున్నారని ఆరోపించారు. మృతుల కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు ఎ.నర్సయ్య, హైమావతి, పోతురాజు, మృతుల బంధువులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 11:29 PM