Share News

ఉపాధి పనుల్లో ఎఫ్‌ఏల చేతివాటం

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:43 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణలో సిబ్బంది మస్తర్ల మాయాజాలం చేశారు. పనులకు రాకపోయినప్పటికీ వచ్చినట్టు మస్తరు వేశారు. పచ్చదనం కోసం మొక్కలు నాటినట్టు రికార్డుల్లో చూపి నిధులు స్వాహా చేశారు.

ఉపాధి పనుల్లో ఎఫ్‌ఏల చేతివాటం
భట్లపూడి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పండూరి లలితను ప్రశ్నిస్తున్న అధికారులు

పనులకు రానివారికి కూడా మస్తర్లు

అనకాపల్లి పట్టణంలో ఉంటున్న మహిళకు భట్లపూడిలో జాబ్‌ కార్డు

మరో మహిళ బ్రాండిక్స్‌లో ఉద్యోగి.. ఉపాధి పనులకు వచ్చినట్టు మస్తర్లు

ఆయా వ్యక్తుల నుంచి లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు

సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెల్లడించిన అధికారులు

తుమ్మపాల (అనకాపల్లి), మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణలో సిబ్బంది మస్తర్ల మాయాజాలం చేశారు. పనులకు రాకపోయినప్పటికీ వచ్చినట్టు మస్తరు వేశారు. పచ్చదనం కోసం మొక్కలు నాటినట్టు రికార్డుల్లో చూపి నిధులు స్వాహా చేశారు.

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ ఆర్‌.పూర్ణిమాదేవి, ఉపాధి హామీ పథకం ఏపీడీ మణికుమార్‌, జిల్లా విజిలెన్స్‌ అధికారి, నిర్మలాదేవి, ఎంపీడీవో నరసింహారావు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, తదితరుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మండలంలో దాదాపు అన్ని పంచాయతీల్లో నిర్వహించిన ఉపాధి పనుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు (ఎఫ్‌ఏ) పలు అక్రమాలు, అవినీతికి పాల్పడినట్టు వివరాలతో సహా వెల్లడించారు. కొంతమంది ఉపాధి కూలీలతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు కుమ్మకయ్యారు. ఉపాధి పనులకు రాకపోయినా మస్తర్లు వేశారు. వచ్చిన వేతనం సొమ్మును పంచుకున్నారు. అలాగే పలు పంచాయతీల్లో ఉపాధి కూలీల సంతకాలు, వేలిముద్రలు లేకుండానే పేమెంట్లు చేసినట్టు గుర్తించారు. ప్రధానంగా మాకవరం, సీహెచ్‌ఎన్‌ అగ్రహారం, రేబాక, కోడూరు, భట్లపూడి పంచాయతీల్లో మస్తర్లలో తేడాలు కనిపించాయి. గ్రామాల్లో రహదారుల పక్కన, చెరువు గట్లపైన మొక్కలు నాటి, వాటిని సంరక్షించినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా మొక్కలు కనిపించడంలేదు.

భట్లపూడి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పండూరి లలిత తీవ్ర అక్రమాలకు పాల్పడినట్టు పూర్తి ఆధారాలను డ్వామా పీడీ పూర్ణిమాదేవికి అందజేశారు. అనకాపల్లి అర్బన్‌ ప్రాంతానికి చెందిన పసుపులేటి లక్ష్మికి భట్లపూడిలో జాబ్‌కార్డు ఇచ్చారు. అంతేకాక ఉపాధి పనులకు రాకపోయినా 2020 నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా పసుపులేటి లక్ష్మి నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లలిత రూ.25 వేలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇదే గ్రామానికి చెందిన బుదిరెడ్డి లక్ష్మి బ్రాండిక్స్‌ కంపెనీలో విధులకు వెళుతుండగా, ఉపాధి పనులకు వస్తున్నట్టు మస్తర్లు వేసి 42 రోజుల వేతనాన్ని చెల్లించారు. ఈమె నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పండూరి లలిత రూ.5 వేలు తీసుకున్నట్టు గుర్తించారు. అయితే తన మీద ఉద్దేశపూర్వకంగా అభియోగాలు మోపుతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పండూరి లలిత ఆరోపించారు. ఈ ఉద్యోగంలో ఉండాలంటే రూ.5 లక్షలు లంచంగా ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్‌ చేశారని, సొమ్ము ఇవ్వకపోవడంతో అభియోగాలు మోపుతున్నారని ఆమె అన్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానన్నారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ ఆర్‌.పూర్ణిమాదేవి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

Updated Date - Mar 21 , 2025 | 12:44 AM