ఆక్రమణల చెరలో ప్రభుత్వ స్థలాలు
ABN , Publish Date - Mar 23 , 2025 | 10:50 PM
చింతపల్లి సబ్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ భవనాలు శిథిలమై దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. ఆ భవనాల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేదు.

దశాబ్దాలుగా నిరుపయోగంగా సర్కారు భవనాలు
శిథిలావస్థకు చేరడంతో చుట్టూ ఉన్న స్థలాల ఆక్రమణ
పట్టించుకోని అధికారులు
చింతపల్లి, మార్చి 23: చింతపల్లి సబ్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ భవనాలు శిథిలమై దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. ఆ భవనాల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేదు. ఈ భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిన్న నీటిపారుదల శాఖ(ఎస్‌ఎంఐ) భవనాన్ని 20 ఏళ్ల క్రితం గిరిజన సంక్షేమశాఖ అధికారులు కార్యాలయంగా ఉపయోగించారు. 14 ఏళ్లగా భవనాన్ని ఉపయోగించకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయం చుట్టూ 20 సెంట్ల స్థలం వుంది. ఈ స్థలాన్ని కొందరు అనధికారికంగా సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు.
నిరుపయోగంగా ఈపీడీసీఎల్ బిల్లు సేకరణ భవనం
ఈపీడీసీఎల్‌కి చెందిన విద్యుత్ బిల్లు సేకరణ భవనం పదేళ్లగా నిరుపయోగంగా వుంది. ఈ భవనం చుట్టూ 25 సెంట్ల స్థలం ఉండేది. అయితే ఆక్రమణల వలన 15 సెంట్లకు కుంచించుకుపోయింది. ఈ ఖాళీ స్థలంలో కొంత మంది వ్యాపారులు బడ్డీలను ఏర్పాటు చేయడం వలన కొంత స్థలం ఆక్రమణకు గురైంది.
శిథిలావస్థలో పట్టుపరిశ్రమ భవనాలు
నాలుగు పట్టుపరిశ్రమ భవనాలు 10 ఏళ్ల క్రితం శిథిలావస్థకు చేరాయి. సుమారు ఐదు ఎకరాల స్థలం పట్టు పరిశ్రమశాఖ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఈ భవనాలను ఆనుకుని కొందరు దుకాణాలు ఏర్పాటు చేశారు. దాదాపు 20 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైంది.
వీటీసీ భవనం కూడా అంతే..
వీటీసీ భవనం పదేళ్లగా నిరుపయోగంగా వుంది. ఈ భవనం చుట్టూ దాదాపు ఎకరం ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఏడాది క్రితం కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తాజాగా ఈ స్థలాన్ని వారపు సంతకు కేటాయించారు. అయితే కొందరు వ్యాపారులు ఈ స్థలాన్ని ఆక్రమించి బడ్డీలను ఏర్పాటు చేసుకున్నారు.
డెయిరీ ఫారం భవనాల ఆక్రమణ
డెయిరీ ఫారాన్ని 15 ఏళ్ల క్రితం ఎత్తి వేయడంతో దాదాపు 20 భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ భవనాలన్నీ శిథిలమైపోయాయి. డెయిరీ ఫారానికి 400 ఎకరాలకు పైగా భూమి ఉన్నా 20 ఎకరాల్లోనే భవనాలు నిర్మించారు. వీటి పర్యవేక్షణను ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆరు ఎకరాలకు పైగా ఆక్రమణకు గురయ్యాయి. కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సెంటు భూమి కూడా మిగిలే పరిస్థితి లేదని ఈ ప్రాంతవాసులు అభిప్రాయపడుతున్నారు.