Share News

ఉక్కు ఉద్యోగుల మెడపై ఫిట్‌నెస్‌ కత్తి

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:10 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి మరో అస్ర్తాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది.

ఉక్కు ఉద్యోగుల మెడపై ఫిట్‌నెస్‌ కత్తి

  • నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ

  • అనారోగ్యంతో ఉన్నట్టు తేలితే ఇంటికే...

  • 50 దాటితే ఏటా పరీక్షలు

  • యాజమాన్యం కొత్త కుట్ర అంటూ కార్మిక వర్గాల ఆందోళన

విశాఖపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి మరో అస్ర్తాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ పేరిట 1,160 మందికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరంతా ఈ నెలాఖరుకు వెళ్లిపోతారు. మరోవైపు కాంట్రాక్టు కార్మికులకు గేట్‌ పాస్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య తగ్గించాలని కాంట్రాక్టర్లను హెచ్చరిస్తున్నారు.

ఇదిలావుండగా ‘ఫిట్‌నెస్‌’ క్లాజ్‌కు మరింత పదునుపెట్టి సవరించిన ఉత్తర్వులు శుక్రవారం జారీచేశారు. ఉద్యోగులకు పీరియాడికల్‌గా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తామని, వాటిలో ఏమైనా తేడా వస్తే నిబంధనల ప్రకారం ఉద్యోగం వదిలి వెళ్లిపోవలసి ఉంటుందని హెచ్చరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ప్లాంటులో జనరల్‌ సర్వీస్‌ చేసే ఉద్యోగులకు ఐదేళ్లకు ఓసారి మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అదే షిఫ్టుల్లో పనిచేసే వారికైతే రెండేళ్లకు ఓసారి చేస్తారు. ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా స్టీల్‌ ప్లాంటు జనరల్‌ ఆస్పత్రికే వెళతారు. పెద్ద అనారోగ్యం అయితే అక్కడి నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేయించుకుంటారు. ఉద్యోగుల మెడికల్‌ రిపోర్టు అంతా ఆస్పత్రి నుంచి యాజమాన్యానికి ఎప్పటికప్పుడు అందుతుంది. కాబట్టి యాజమాన్యాన్ని మోసగించి అనారోగ్యంతో విధులు నిర్వహించే ఉద్యోగులు ఎవరూ ఉండరు. కానీ యాజమాన్యం ‘ఫిట్‌నెస్‌’ పేరుతో యాభై ఏళ్లు దాటిన వారిని బయటకు పంపించేయాలనే ఆలోచనతో కొత్త ఉత్తర్వులు జారీ చేసిందని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులలో ఎవరికైనా తాత్కాలికంగా నడుము నొప్పి, తదితర సాధారణ సమస్య ఉంటే...అటువంటి వారిని ఆఫీసుకు పరిమితం చేసి, ఆ విభాగంలో మిగిలిన ఉద్యోగులు ఆ పనిని షేర్‌ చేసుకొని పూర్తి చేస్తుంటారు. ఇలాంటివి అన్ని విభాగాల్లోను సాధారణం. ఇప్పుడు ఇలాంటి వారిని గుర్తించి బయటకు పంపాలని నిర్ణయించారనే ప్రచారం జరుగుతోంది. అదొక్కటే కాకుండా నిజాయితీ, పనితీరును కూడా అంచనా వేసి దానిని కూడా ఫిట్‌నెస్‌ నివేదికలో పొందుపరిచేలా పాత నిబంధనలకు సవరణలు చేశారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

యాభై దాటితే ఏటా పరీక్షలు

యాభై ఏళ్లు దాటిన వారికి ఇకపై ఏటా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తామని యాజమాన్యం చెబుతోంది. ఇది చట్టంలోనే ఉందని, తాము కొత్తగా పెట్టిన నిబంధన కాదని అధికారులు చెబుతున్నారు. అలాగైతే ఇన్నాళ్లూ ఎందుకు అమలు చేయలేదని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కొన్ని విభాగాల్లో వేయి డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని, అక్కడ పనిచేస్తున్న వారికి కచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయని, వారికి న్యాయం చేయాల్సింది పోయి ఫిట్‌నెస్‌ పేరుతో తొలగిస్తామంటే...కొత్తగా ఎవరైనా పనిచేయడానికి వస్తారా? అని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ కొత్త ఉత్తర్వులు యాభై ఏళ్లు దాటిన వారిని లక్ష్యంగా చేసుకొని ఇచ్చారని, తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని అధికార, కార్మిక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Mar 22 , 2025 | 01:10 AM