Share News

అంగరంగ వైభవంగా..

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:03 AM

స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో అందుకు తగ్గట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ.. అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు.

అంగరంగ వైభవంగా..
బాలాలయంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న నూకాంబిక అమ్మవారు

అనకాపల్లిలో నూకాంబిక కొత్త అమావాస్య జాతర ప్రారంభం

తొలిపూజ చేసిన ఎమ్మెల్యే కొణతాల, పీలా గోవింద

అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

అనకాపల్లి టౌన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో అందుకు తగ్గట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ.. అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న వీరికి ఉత్సవ కమిటీ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారి కె.శోభారాణి, ఈవో వెంపలి రాంబాబు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానికి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన నేలవేషాలు ఆకట్టుకున్నాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్‌ సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎన్టీఆర్‌ స్టేడియంలో..

స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో నూకాంబిక అమ్మవారి జాతరను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై నూకాంబిక అమ్మవారి భారీ ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య జనసేన నియోజకవర్గం ఇన్‌చార్జి భీమరశెట్టి రామకృష్ణ(రాంకీ) పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వినతి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సానుకూలంగా స్పందించి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్రస్థాయు పండుగగా ప్రకటించారని అన్నారు. ఇక్కడ వేదికపై 30 రోజులపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి, కండేపల్లి మురళీలను ఆయన సత్కరించారు. అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని బృంద సభ్యుల భక్తి గేయాలతో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారులు కూచిపూడి నృత్యప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్‌ పీలా నాగశ్రీను, కూటమి నాయకులు డాక్టర్‌ నారాయణరావు, బీఎస్‌ఎంకే జోగినాయుడు, తాడి రామకృష్ణ, సకల గోవిందరావు, కాండ్రేగుల శ్రీరామ్‌, ఆళ్ల రామచంద్రరావు, డాక్టర్‌ డీడీ నాయుడు, బొడ్డేడ మురళీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:03 AM