మైనింగ్ మాఫియా
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:02 AM
చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలోని పలు గ్రామాల్లో నల్లరాయి అక్రమ క్వారీల్లో యథేచ్ఛగా కార్యకలాపాలు సాగుతున్నాయి. రాంబిల్లి మండలంలో నిర్మాణంలో వున్న నేవీ ప్రత్యామ్నాయ నిర్వహణ బేస్ (ఎన్‌ఏవోబీ)కు భారీ పరిమాణంలో బండరాళ్లు అవసరం ఏర్పడడంతో ఇక్కడ అనధికార క్వారీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రోలుగుంట మండలంలో మూడు రాయి క్వారీలకు మాత్రమే మైనింగ్ శాఖ అనుమతులు వుండగా, దీనికి ఐదు రెట్టు.. దాదాపు 14 అక్రమ క్వారీలు నడుస్తున్నాయి. వీరికి నర్సీపట్నం, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కూటమిలో ఒక పార్టీ నేతలు అండదండలు వున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఈ క్వారీలు వైసీపీ నేతల చేతుల్లో వుండగా, రాష్ట్రంలో అధికారం మారినట్టే.. ఇక్కడ రాయి క్వారీలు చేతులు మారాయి.

రోలుగుంటలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్
అనధికారికంగా రాయి క్వారీలు నిర్వహణ
వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండదండలు
అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు
ప్రభుత్వం మారిన తరువాత కూడా ఆగని అక్రమ తవ్వకాలు
అక్రమార్కులకు అధికార పార్టీ నేతల దన్ను
పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పర్యావరణ శాఖల అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలోని పలు గ్రామాల్లో నల్లరాయి అక్రమ క్వారీల్లో యథేచ్ఛగా కార్యకలాపాలు సాగుతున్నాయి. రాంబిల్లి మండలంలో నిర్మాణంలో వున్న నేవీ ప్రత్యామ్నాయ నిర్వహణ బేస్ (ఎన్‌ఏవోబీ)కు భారీ పరిమాణంలో బండరాళ్లు అవసరం ఏర్పడడంతో ఇక్కడ అనధికార క్వారీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రోలుగుంట మండలంలో మూడు రాయి క్వారీలకు మాత్రమే మైనింగ్ శాఖ అనుమతులు వుండగా, దీనికి ఐదు రెట్టు.. దాదాపు 14 అక్రమ క్వారీలు నడుస్తున్నాయి. వీరికి నర్సీపట్నం, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కూటమిలో ఒక పార్టీ నేతలు అండదండలు వున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఈ క్వారీలు వైసీపీ నేతల చేతుల్లో వుండగా, రాష్ట్రంలో అధికారం మారినట్టే.. ఇక్కడ రాయి క్వారీలు చేతులు మారాయి.
అనకాపల్లి మండలం తరువాత రోలుగుంట మండలంలోనే అత్యధికంగా నల్లరాయి కొండలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో వున్నప్పడు ఆ పార్టీ నేతలు, మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి, మైనింగ్ శాఖ నుంచి అనుమతులు లేకుండా కొండలను తొలిచి రాళ్లు, రోడ్డు మెటల్, కంకర భారీఎత్తున అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అక్రమ మైనింగ్‌పై అప్పట్లో టీడీపీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు అనేకమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఒక్కసారి కూడా క్వారీలను సందర్శించలేదు. పైగా ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మారినా... అక్రమ మైనింగ్ ఆగలేదు. నర్సీపట్నం, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నాయకులు రాయి క్వారీలను పంచుకుని మైనింగ్‌ను కొనసాగిస్తున్నారు. వాస్తవంగా రోలుగుంట మండలంలో మూడు నల్లరాయి క్వారీలకు మాత్రమే మైనింగ్ శాఖ అనుమతులు వున్నాయి. కానీ రోలుగుంట, నిండుగొండ, కె.నాయుడుపాలెం, కొవ్వూరు, వడ్డిప, రాజన్నపేట గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా మరో 14 నల్లరాయి క్వారీల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నది. బోరు బ్లాస్టింగులతో కొండలను తొలిస్తున్నారు. రాజన్నపేటలో రాయిక్వారీకి వాహనాల రాకపోకల కోసం చెరువు గర్భం మీదుగా రోడ్డు వేశారు.
రోలుగుంట టు రాంబిల్లి...
రాంబిల్లి మండలంలో నేవీ ప్రత్యామ్నాయ నిర్వహణ బేస్ (ఎన్‌ఏవోబీ) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సముద్ర తీరంలో నౌకలు నిలుపుదల చేయడానికి బెర్త్‌లు నిర్మిస్తున్నారు. వీటికి అలల తాకిడి లేకుండా వుండడానికి సముద్రంలో రాళ్లతో భారీ కట్ట (బ్రేక్ వాటర్స్) వేస్తున్నారు. ఇందుకోసం భారీ మెత్తంలో నల్లరాయి అవసరం ఏర్పడింది. బండరాళ్లను సరఫరా చేసే కాంట్రాక్టును రాయి క్వారీల నిర్వాహకులు దక్కించుకుని అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా నల్లరాయిని ఎన్‌ఏవోబీకి తరలిస్తున్నారు. అక్రమార్కులు నాడు వైసీపీ నాయకులతో, ఇప్పుడు కూటమి నాయకులతో అంటకాగుతున్నారు. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఒక నేత అనుచరులు రోలుగుంట మండలంలో పాగా వేసి అక్రమ మైనింగ్ సాగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజన్నపేట, కొవ్వూరుల్లో గతంలో వైసీపీ నాయకులు నిర్వహించిన క్వారీలను ప్రస్తుతం కూటమి నేతలు తమ ఆధీనంలోకి తీసుకొని నడుపుతున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
అనుమతి లేకుండా బండరాళ్లను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసే అధికారం రవాణా, పోలీసు శాఖలకు వుంది. కానీ బండరాళ్లను రవాణా చేస్తున్న టిప్పర్లు, లారీలను ఎక్కడా అడ్డుకోవడంలేదు. మరోవైపు గనులు, రెవెన్యూ, పర్యావరణ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ మాఫియా నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయని, అందువల్లనే చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ క్వారీలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
రోలుగుంట మండలంలో నల్లరాయి క్వారీలను అక్రమంగా నిర్వహిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు శుక్రవారం కలెక్టర్ విజయకృష్ణన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్వారీల వల్ల నిండుగొండ, కె.నాయుడుపాలెం, కొవ్వూరు, నందిపురం, వడ్డిప, రాజన్నపేట, తదితర గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బండరాళ్లను రవాణా చేసే భారీ వాహనాల కారణంగా రోడ్లు పాడుతున్నాయన్నారు. విచారణ జరిపించి అనధికార క్వారీలపై చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారని ఆయన చెప్పారు. ఆయన వెంట జనసేన నాయకులు బలిజ మహారాజు, మైచర్ల నాయుడు, గూనూరు మూలునాయుడు, అల్లం రామఅప్పారావు, కర్రి రమేశ్ తదితరులు ఉన్నారు.