Share News

మరింతగా కాఫీ ఘుమఘుమలు

ABN , Publish Date - Apr 02 , 2025 | 10:53 PM

ఏజెన్సీలో కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా మరో కాఫీ ప్రాజెక్టు మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

మరింతగా కాఫీ ఘుమఘుమలు
మన్యంలోని కాఫీ తోటలు

మన్యంలో కొత్తగా లక్ష ఎకరాల్లో తోటలు

రూ.1,050 కోట్లతో కాఫీ ప్రాజెక్టుకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

కలెక్టర్ల సమావేశంలో ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబునాయుడు

ఏడేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ మొక్కలు, 75 వేల ఎకరాల్లో నీడ మొక్కల పెంపకం లక్ష్యం

డీపీఆర్‌ రూపకల్పనలో అధికార యంత్రాంగం నిమగ్నం

లక్షన్నర మంది గిరిజన కాఫీ రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళిక

గిరిజన కాఫీకి జీవం పోస్తున్న సీఎం చంద్రబాబునాయుడు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఏజెన్సీలో కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా మరో కాఫీ ప్రాజెక్టు మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రూ.1,050 కోట్ల వ్యయంతో ఏడేళ్ల కాల పరిమితిలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు, మరో 75 వేల ఎకరాల్లో కాఫీకి నీడనిచ్చే మొక్కలను పెంచాలనే లక్ష్యంతో సుమారుగా లక్షన్నర మంది గిరిజన కాఫీ రైతులకు సంపూర్ణంగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించింది.

ఏజెన్సీలో 2015 నుంచి పదేళ్ల కాల పరిమితితో అమలవుతున్న రూ.526 కోట్ల కాఫీ ప్రాజెక్టు 2024- 25 ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. దీంతో కొత్తగా మరో కాఫీ ప్రాజెక్టు అమలైతే గాని గిరిజన కాఫీ రైతులకు మేలు జరగదనే ఉద్దేశంతో కొత్త కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో సుమారుగా మరో పదేళ్లు గిరిజన కాఫీకి భరోసా లభించినట్టే.

మన్యంలో కాఫీ తోటల అభివృద్ది ఇలా...

గిరిజనులు పోడు వ్యవసాయంపై ఆధారపడి అడవులను నాశనం చేయకుండా ఉండేందుకు గానూ 1989లో కాఫీ సాగును ప్రభుత్వం గిరిజనులకు పరిచయం చేసింది. దీంతో 1989 నుంచి 2002 వరకు కేవలం 32,072 ఎకరాల్లో మాత్రమే కాఫీ తోటలు అభివృద్ధి జరగ్గా, 2003 నుంచి 2008 వరకు 64,265 ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు. ఆ తరువాత 2009లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. దీంతో 2009 నుంచి 2016 వరకు 61,684 ఎకరాల్లో, 2016 నుంచి 2024 వరకు 84 వేల ఎకరాల్లో కాఫీని అభివృద్ధి చేశారు. ఈ లెక్కన 1989 నుంచి 2024 వరకు ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 42 వేల 21 ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. ఆయా తోటల ద్వారా 2 లక్షల 36 వేల 618 మంది గిరిజన కాఫీ రైతులు లబ్ధి పొందుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా గిరిజన రైతులు స్వయంగా తమ వారసత్వ భూముల్లో వేసుకున్న సుమారుగా 30 వేల ఎకరాలు కలిపి మొత్తం ఏజెన్సీ వ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షల 72 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. అయితే వాటిలో సుమారుగా లక్షా 52 వేల ఎకరాల్లో ఏడాదికి 71 వేల టన్నుల కాఫీ పండ్లు దిగుబడి వస్తుందని అంచనా. సుమారుగా 14 వేల టన్నుల క్లీన్‌ కాఫీ గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ఏడాదికి ఒక ఎకరం కాఫీ తోటతో సుమారుగా రూ.50 నుంచి రూ.60 వేలు ఆదాయం సమకూరుతున్నది. దీంతో కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే సేంద్రీయ పద్ధతిలో కాఫీ ఉత్పత్తి జరగడంతో ఇక్కడ ఉత్పత్తి చేసే కాఫీ గింజలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ గిరాకీ ఉంది.

కొత్త కాఫీ ప్రాజెక్టు ఇలా....

ఏజెన్సీలో 2015 ఆర్థిక సంవత్సరం నుంచి పదేళ్ల కాలపరిమితితో అమలవుతున్న రూ.526 కోట్ల కాఫీ ప్రాజెక్టు ముగిసిపోయింది. దీంతో భవిష్యత్తులో కాఫీ తోటల అభివృద్ధికి, కొత్త కాఫీ తోటల పెంపకానికి చర్యలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలో అధిక విస్తీర్ణంలో ఉన్న కాఫీని ప్రోత్సహించడంతో పాటు కొత్తగా కాఫీ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో కాఫీ రైతుల పరిస్థితి అయోమయంగా మారే అవకాశం లేకపోలేదు. దీంతో ఏజెన్సీలో కాఫీ రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం భావించింది. 2024- 25 నుంచి 2030- 31 వరకు ఏజెన్సీ వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు, మరో 75 వేల ఎకరాల్లో కాఫీ మొక్కలకు నీడనిచ్చే మొక్కల పెంపకానికి ప్రణాళికలు తయారు చేశారు. 2024- 25లో 15 వేల ఎకరాల్లో నీడ మొక్కలు, 10 వేల ఎకరాల్లో కాఫీ మొక్కలు, 2025- 26లో 15 వేల ఎకరాల్లో నీడ మొక్కలు, 10 వేల ఎకరాల్లో కాఫీ మొక్కలు, 2026- 27లో 15 వేల ఎకరాల్లో నీడ మొక్కలు, 10 వేల ఎకరాల్లో కాఫీ మొక్కలు, 2027- 28లో 15 వేల ఎకరాల్లో నీడ మొక్కలు, 10 వేల ఎకరాల్లో కాఫీ మొక్కలు, 2028- 29లో 15 వేల ఎకరాల్లో నీడ మొక్కలు, 20 వేల ఎకరాల్లో కాఫీ మొక్కలు, 2029- 30లో 20 వేల ఎకరాల్లో కాఫీ మొక్కలు, 2030- 31లో 20 వేల ఎకరాల్లో కాఫీ మొక్కల పెంపకాన్ని చేపడతారు. దీని వల్ల ప్రత్యక్షంగా లక్షన్నర మంది గిరిజన కాఫీ రైతులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే కాఫీ రైతులకు అవసరమైన డ్రైయింగ్‌ ప్లాట్‌ఫారాలు, నిచ్చెనలు, మినీ పల్పింగ్‌ యంత్రాలు, తదితరాలను అందిస్తారు. మొత్తం రూ.1,050 కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.838 కోట్లు ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ నుంచి, మరో రూ.199 కోట్లు కేంద్ర కాఫీ బోర్డు నుంచి, మిగిలిన రూ.13 కోట్లు లబ్ధిదారుల వాటా ప్రణాళికలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కొత్త కాఫీ ప్రాజెక్టును మంజూరు చేస్తే మరో పదేళ్లు మన్యంలో కాఫీ రైతులకు మేలు జరుగుతుందని ఐటీడీఏ, కాఫీ బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గిరిజన కాఫీకి జీవం పోస్తున్న చంద్రబాబు

మన్యంలోని గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే కాఫీ తోటల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఎప్పడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చెప్పుకోదగ్గ విషయం. 2014లో సంభవించిన హుద్‌హుద్‌ తుఫాన్‌కు భారీ స్థాయిలో కాఫీ తోటలు ధ్వంసమయ్యాయి. దీంతో కాఫీ రైతులను ఆదుకునేందుకు 2015 నుంచి 2025 వరకు లక్ష ఎకరాల కాఫీ తోటల అభివృద్ధికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.526 కోట్లతో ఒక ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేకంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు అభివృద్ధి చేశారు. కాగా 2016లోనే చంద్రబాబునాయుడు మన్యం కాఫీని ‘అరకు కాఫీ’గా ప్రపంచానికి పరిచయం చేసి ప్రమోట్‌ చేశారు. ఇందులో భాగంగా అదే ఏడాది ప్రధాని మోదీతో పాటు అనేక మంది ప్రముఖులతో అరకు కాఫీని తాగించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ మరింతగా ప్రాచుర్యం పొందింది.

కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటలకు గ్రీన్‌ సిగ్నల్‌

ఏజెన్సీలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని మార్చి 25, 26 తేదీల్లో అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సైతం లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అక్కడ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. దీనికి సీఎం చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో సదస్సు అనంతరం జిల్లాకు వచ్చిన కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి డీపీఆర్‌ సిద్ధం చేయాలని, కొత్త కాఫీ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.526 కోట్ల ప్రాజెక్టు, తాజాగా రూ.1,050 కోట్ల కాఫీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టడంపై గిరిజన కాఫీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా మన్యం కాఫీని అరకు కాఫీ పేరిట ప్రమోట్‌ చేయడంలో భాగంగా పార్లమెంట్‌లో, అసెంబ్లీలోనూ కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయించారు. ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడ గిరిజనులు పండించిన కాఫీ, ఇతర ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తుండడం గిరిజనుల పట్ల చంద్రబాబునాయుడుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ స్పష్టమవుతున్నది.

రూ.1,050 కోట్లతో కొత్త కాఫీ ప్రాజెక్టు విస్తీర్ణం, వ్యయాల వివరాలు

- 2024- 25 నుంచి 2030-31 వరకు లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి రూ.691 కోట్లు

- 2024-25 నుంచి 2028-29 వరకు 75 వేల ఎకరాల్లో పాత కాఫీ తోటల పునరుద్ధరణకు రూ.225 కోట్లు

- 2024- 25 నుంచి 2032- 33 వరకు కాఫీ రైతులకు కాఫీ బోర్డు నుంచి బేబీ పల్పర్‌ యూనిట్లకు రూ.23 కోట్లు

- 2024- 25 నుంచి 2028- 29 వరకు డ్రైయింగ్‌ యార్డుల నిర్మాణానికి రూ.23 కోట్లు

- 2024- 25 నుంచి 2028- 29 వరకు పాలిథిన్‌ టార్పలిన్లకు రూ.13 కోట్లు

- 2024- 25 నుంచి 2028- 29 వరకు అల్యూమినియం నిచ్చెనలకు రూ.35 కోట్లు

- మొత్తం ప్రాజెక్టు నిర్వహణకు పరిపాలనా వ్యయం రూ.40 కోట్లు

Updated Date - Apr 02 , 2025 | 10:53 PM