40 కేసులూ ఓపెన్ చేయండి
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:06 AM
ఆధారాలు దొరకలేదనే కారణంతో మూసివేసిన కేసులపై నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు.

మూసివేసిన వాటిపై సీపీ యాక్షన్
పోలీసు అధికారులకు ఆదేశం
విశాఖపట్నం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):
ఆధారాలు దొరకలేదనే కారణంతో మూసివేసిన కేసులపై నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు. ఇటీవల జరిగిన నేర సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలపై సీసీఆర్‌బీ అధికారులతో పాటు అన్ని పోలీస్‌స్టేషన్ల హౌస్ ఆఫీసర్లను ఆరా తీశారు. కమిషనరేట్ పరిధిలో అన్‌డిటెక్టబుల్ (యూఎన్) కేసులు 40 ఉన్నట్టు అధికారులు సీపీకి వివరించారు. దీంతో ఆయా కేసులను తిరిగి ఓపెన్‌చేసి దర్యాప్తు పునఃప్రారంభించాలని ఆదేశించారు. కొన్ని ముఖ్యమైన కేసులు, పోలీసుల దర్యాప్తునకు సవాల్‌గా మారిన కేసులను ప్రత్యేక అధికారులకు అప్పగించి చిక్కుముడి విప్పాలని సీపీ నిర్ణయించారు.
ఇందులో భాగంగా కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల కిందట జరిగిన రౌడీషీటర్ గనగళ్ల శ్రీను హత్య కేసును కేస్ స్టడీగా తీసుకుని, దర్యాప్తు బాధ్యతలను కంట్రోల్‌రూమ్ సీఐ షేక్ హుస్సేన్‌కు అప్పగించారు. కేసు దర్యాప్తును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు పునఃప్రారంభించిన సీఐ షేక్‌హుస్సేన్ సిబ్బంది సహాయంతో హత్యకేసు చిక్కుముడిని ఛేదించి నిందితులను సాక్ష్యాధారాలతో సహా అరెస్టు చేశారు. ఈ కేసును స్ఫూర్తిగా తీసుకుని మూసివేసిన కేసుల్లో ఒకదాని తర్వాత ఒకటిగా చిక్కుముడి విప్పుతామని సీపీ వివరించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి ర్యాంకే ధ్యేయం
సర్వే కోసం సర్వం సన్నద్ధం
జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్
విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
స్వచ్ఛసర్వేక్షణ్‌లో మొదటి ర్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్నామని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.నరేష్‌కుమార్ తెలిపారు. స్వచ్ఛసర్వేక్షణ్ -2025 పోటీలో భాగంగా కేంద్ర బృందాలు ప్రస్తుతం నగరంలో సర్వే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛసర్వేక్షణ్ కోసం ఎలా సన్నద్ధమయ్యారనేదానిపై ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన ఇంటర్వూ ఇచ్చారు.
ప్రశ్న: స్వచ్ఛసర్వేక్షణ్ -2025 ప్రత్యేకత ఏమిటి?
జవాబు: స్వచ్ఛసర్వేక్షణ్ పోటీ ప్రతి ఏటా జరిగేదే అయినప్పటికీ ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం టూల్‌కిట్ పేరుతో పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది. దాని ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ పరిశుభ్రత ఉండేలా ప్రతి తరగతి గదిలోనూ డస్ట్‌బిన్ల ఏర్పాటు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కంపోస్ట్ పిట్‌లను ఏర్పాటుచేశాం.
ప్రశ్న: స్వచ్ఛసర్వేక్షణ్‌లో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి ఏం చేశారు?
జవాబు: స్వచ్ఛసర్వేక్షణ్ పోటీలో ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ కీలకం. ఆన్‌లైన్‌లో ఫీడ్‌బ్యాక్‌ను ఇస్తే గరిష్టంగా 20 శాతం మార్కులే వస్తాయి. అదే కేంద్ర ప్రభుత్వ బృందాలు సర్వేకోసం వచ్చినపుడు నివాసాలు, వాణిజ్య సముదాయాలకు వెళ్లి పారిశుధ్య నిర్వహణలో జీవీఎంసీ కృషి ఎలా ఉందనేదానిపై ప్రజలను అడిగి వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపిస్తారు. దీనికి 80 శాతం మార్కులుంటా యి. అందువల్లే ప్రజల్లో స్వచ్ఛసర్వేక్షణ్‌పై అవగాహన పెంచేందుకు అనేకరకాలుగా ప్రచారం చేశాం.
ప్రశ్న: చెత్త పునర్వినియోగంలో ఎలాంటి పురోగతి సాధించారు?
జవాబు: నగరంలో ఉత్పత్తయ్యే చెత్త పునర్వినియోగం అంశం స్వచ్ఛసర్వేక్షణ్‌లో కీలకం. కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త (లెగసీవేస్ట్)ను అనేక రూపాల్లో పునర్వినియోగానికి ముడిసరకుగా మార్చాం. దీనివల్ల సుమారు 22 ఎకరాల భూమి అందుబాటులోకి రావడంతో మొక్కలు నాటాం. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌యూనిట్ మూతపడగా, దానిని ఇటీవల పునఃప్రారంభించాం. ఇది నగరానికి మంచి ర్యాంకు దక్కడానికి దోహదపడుతుంది.
ప్రశ్న: పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
జవాబు: విశాఖ అంటేనే పర్యాటకం అనే భావన కేంద్ర సర్వే బృందానికి ఉంటుంది. పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యం ఎలా ఉందనే దానిని పరిశీలిస్తుంది. కాబట్టి బీచ్‌లో యంత్రాలతో చెత్తసేకరణ చేసి పరిశుభ్రంగా ఉంచుతున్నాం. పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, బీచ్‌లోని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుతున్నాం.
ప్రశ్న: లిక్విడ్ వేస్ట్ రీసైక్లింగ్ విభాగంలో జీవీఎంసీ పరిస్థితి ఎలా ఉంది?
జవాబు: స్వచ్ఛసర్వేక్షణ్‌లో లిక్విడ్‌వేస్ట్ (మురుగునీరు పునర్వినియోగం) రీసైక్లింగ్ కీలకం. గత కొన్నేళ్లుగా ఈ అంశంలో కొంత వెనుకబడినప్పటికీ ఇటీవల ఉన్నతాధికారుల ప్రత్యేక చొరవతో బీచ్‌లో కలుస్తున్న మురుగునీటిని ఎస్‌టీపీలకు మళ్లిస్తున్నాం. అలాగే యూజీడీ ద్వారా ఎస్‌టీపీలకు చేరిన మురుగునీటిని శుద్ధిచేసి పరిశ్రమలకు విక్రయిస్తున్నాం. దీనివల్ల జీవీఎంసీకి ఏటా రూ.30 కోట్లు ఆదాయం సమకూరుతోంది.
3 నుంచి టెన్త్ మూల్యాంకనం
జిల్లాకు రెండు లక్షల జవాబు పత్రాలు
సోషల్ స్టడీస్, హిందీ సబ్జెక్టులకు టీచర్ల కొరత
విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
పదోతరగతి పరీక్షల్లో కీలకమైన జవాబుపత్రాల మూల్యాంకనం వచ్చేనెల మూడోతేదీ నుంచి జ్ఞానాపురంలోని జూబ్లీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ సన్నాహాలు చేపట్టింది.
మూల్యాంకనంలో విధులు నిర్వహించే టీచర్లకు సంబంధిత ఎంఈవోల ద్వారా ఆర్డర్లను అందజేశారు. గత ఏడాది జిల్లాకు 1.8 లక్షల జవాబుపత్రాలు వచ్చాయి. ఈ ఏడాది రెండు లక్షల వరకు జవాబుపత్రాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒక్కో సబ్జెక్టుకు సగటున 120మంది టీచర్లు అవసరం. చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా స్కూలు అసిస్టెంట్లు, హెచ్‌ఎంల సేవలు వినియోగిస్తారు. స్పెషల్ అసిస్టెంట్లుగా సెకండరీగ్రేడ్ టీచర్లకు విధులు అప్పగించనున్నారు. కాగా ఏడు సబ్జెక్టులలో ఎక్కువగా గణితం జవాబుపత్రాలు జిల్లాకు కేటాయించనున్నారని సమాచారం. ఈ జవాబుపత్రాల మూల్యాంకనానికి సరిపడా స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. కానీ సోషల్ స్టడీస్, హిందీ సబ్జెక్టులలో మూల్యాంకనం నిర్వహించేందుకు టీచర్ల కొరత ఉందని భావిస్తున్నారు. మూల్యాంకనానికి 57 సంవత్సరాలు వయసు దాటిన టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించిందని తెలిసింది. దీంతో అనకాపల్లి జిల్లానుంచి కొందరు టీచర్ల సేవలు తీసుకోవాలని భావిస్తున్నారు. రెండుమూడు రోజుల్లో వారికి ఆర్డర్లు పంపనున్నారు. వారం పదిరోజుల్లో మూల్యాంకనం పూర్తిచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లుచేస్తున్నారు.
నేటి నుంచి ఇన్విజిలేటర్ల జంబ్లింగ్
పదోతరగతి పరీక్షల్లో భాగంగా శనివారంతో లాంగ్వేజస్ పూర్తయ్యాయి. సోమవారం గణితం పరీక్ష ప్రారంభం కానున్నది. నిబంధనల మేరకు లాంగ్వేజస్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించే వారిలో సగం మందిని జంబ్లింగ్ విధానంలో సమీపంలోని పరీక్షా కేంద్రాలకు పంపుతారు. ప్రతి కేంద్రంలో సేవలందించే వారిలో సగం మందిని ఈ విధానంలో మారుస్తారు.