పదవుల కోలాహలం
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:09 AM
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసం కోరుతూ కూటమి కార్పొరేటర్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌కు నోటీసు ఇవ్వడంతో కూటమిలో పదవుల కోలాహలం ప్రారంభమయింది.

మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కూటమి కార్పొరేటర్ల పోటీ
నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు
సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్
సీనియారిటీని గుర్తించి అవకాశం ఇవ్వాలంటున్న మరికొందరు
మేయర్‌పై అవిశ్వాసం పెట్టిన తరువాత చూద్దామంటూ నేతల దాటవేత
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసం కోరుతూ కూటమి కార్పొరేటర్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌కు నోటీసు ఇవ్వడంతో కూటమిలో పదవుల కోలాహలం ప్రారంభమయింది. మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్లు ఇద్దరినీ పదవీచ్యుతులను చేయడం ఖాయం కావడంతో వాటిని దక్కించుకునేందుకు ఆశావహులు రంగంలోకి దిగారు. అస్మదీయులైన నేతల వద్దకు వెళ్లి అవకాశం ఇప్పించాలని ఒత్తిడిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి హామీ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్న నేతలంతా మేయర్‌పై అవిశ్వాసం పూర్తయిన తర్వాత ఈ సంగతి చూద్దామంటూ దాటవేస్తున్నారు.
మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన తర్వాత కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలకు కొత్త తలనొప్పి మొదలయింది. నోటీసు ఇచ్చి ఒక్కరోజు కూడా గడవకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం టీడీపీ, జనసేనకు చెందిన కార్పొరేటర్లు పోటీపడుతున్నారు. జీవీఎంసీకి ఎన్నికలు జరిగి నాలుగేళ్లయింది. మరో ఏడాది వ్యవధి ఉంది. కౌన్సిల్‌లో కూటమి బలం పెరగడంతో కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌కు కూటమి నేతలు శనివారం అవిశ్వాసంపై నోటీసు ఇచ్చారు. దీని ప్రకారం మరో 15 రోజుల్లో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. అవిశ్వాసతీర్మానం నెగ్గిన అనంతరం మేయర్ పదవి నుంచి గొలగాని హరివెంకటకుమారి వైదొలగడంతోపాటు డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్ వైదొలగాల్సి ఉంటుంది. ఆ కుర్చీలను దక్కించుకునేందుకు కూటమికి చెందిన పలువురు కార్పొరేటర్లు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మేయర్‌గా టీడీపీ ఫ్లోర్‌లీడర్ పీలా శ్రీనివాస్‌ను ఎన్నుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే బీసీ మహిళకే మేయర్ పీఠం అప్పగిస్తే విమర్శకులకు తావుండదని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఏడాది మాత్రమే వ్యవధి ఉన్నందున సమర్థంగా కౌన్సిల్‌ను నడపడంతో పాటు నగరాభివృద్ధి దిశగా అధికారులకు దిశానిర్దేశం చేయగల విద్యావంతులను మేయర్‌గా ఎన్నుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మరికొందరు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి అభిప్రాయాలు నేతల నుంచి వస్తుండడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు మేయర్‌గా అవకాశం వస్తుందేమోననే ఆశల్లో ఉన్నారు. మేయర్‌గా పీలా శ్రీనివాస్‌ను కాదంటే తమకు అవకాశం ఇవ్వాలని యాదవ సామాజికవర్గానికి చెందిన ఐదో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, 26 వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి కూటమి నేతల వద్ద ప్రతిపాదించినట్టు తెలిసింది. ఒక డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడం ఖాయమని, 33వ వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మికి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరినప్పటికీ, మేయర్‌గా పీలా శ్రీనివాస్‌కు అవకాశం ఇస్తే అదే సామాజికవర్గానికి బీశెట్టి వసంతలక్ష్మికి అవకాశం దక్కకపోవచ్చునని అంచనావేస్తున్నారు. అలాంటపుడు కాపు సామాజికవర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలని 43వ వార్డు కార్పొరేటర్ పి.ఉషశ్రీ కోరుతున్నట్టు సమాచారం. మరో డిప్యూటీ మేయర్ పదవిని కాపు సామాజికవర్గానికి చెందిన 76వ వార్డు కార్పొరేటర్ గంథం శ్రీనివాసరావుకి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతున్నప్పటికీ, జనసేన నుంచి కాపు సామాజికవర్గానికి అవకాశం ఇస్తున్నందున యాదవ సామాజికవర్గానికే ఇవ్వాల్సి ఉంటుందని ఐదో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి ఒత్తిడి చేస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం కూడా పలువురు పోటీ పడుతున్నారు. ఇదిలావుంటే ఇటీవల వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరిన కార్పొరేటర్లంతా వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం వల్లే పార్టీ మారిపోవాల్సి వచ్చిందని, ఇక్కడైనా ప్రాధాన్యం దక్కాలంటే ఒకరికైనా పదవి దక్కేలా ఏకాభిప్రాయంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆశావహులంతా ఎవరికివారు నేతలపై ఒత్తిడి చేస్తుండడంతో వారంతా ఎవరికీ హామీ ఇవ్వలేక తల పట్టుకుంటున్నారు. ముందు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గితే, తర్వాత పదవుల పంపకంపై దృష్టిపెడదామంటూ తప్పించుకుంటున్నారు.