ఎట్టకేలకు మార్గం సుగమం
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:02 PM
మండలంలోని రెండు ప్రధాన రహదారుల నిర్మాణానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగాయి. గుమ్మంతి- రెడ్డిపాడు, సమిధ- పెదబూరగ గ్రామాల రహదారుల నిర్మాణానికి గత డిసెంబరు 21న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శంకుస్థాపన చేసినా అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.

రెండు రహదారుల నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
జిల్లా స్థాయి కమిటీ ఆమోదంతో గుమ్మంతి- రెడ్డిపాడు, సమిధ- పెదబూరగ గ్రామాల రోడ్లకు మోక్షం
త్వరలో ప్రారంభంకానున్న పనులు
అనంతగిరి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని రెండు ప్రధాన రహదారుల నిర్మాణానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగాయి. గుమ్మంతి- రెడ్డిపాడు, సమిధ- పెదబూరగ గ్రామాల రహదారుల నిర్మాణానికి గత డిసెంబరు 21న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శంకుస్థాపన చేసినా అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అయితే బుధవారం కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి కమిటీలో ఈ రెండు రోడ్లకు ఆమోదం తెలపడంతో రహదారుల నిర్మాణానికి మార్గం సుగమమైంది.
గిరిజన ప్రాంతంలోని అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా డిసెంబరు 21న అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువు గ్రామాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సందర్శించారు. తొలి విడతగా గుమ్మంతి- రెడ్డిపాడు, సమిధ- పెదబూరగ గ్రామాల రెండు రహదారులకు శంకుస్థాపన చేశారు. అయితే అటవీశాఖ అనుమతులతో పాటు టెండర్, వివిధ కారణాలతో మూడు నెలల పాటు పనులు ప్రారంభం కాలేదు.. దీంతో గిరిజనులకు డోలీమోతలు తప్పలేదు. రహదారులు లేక గిరిజనులు పడుతున్న కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుసగా కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో బుధవారం కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీలో ఆ రెండు రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
రహదారుల నిర్మాణం పూర్తయితే..
గుమ్మంతి నుంచి రాచకీలం మీదుగా రెడ్డిపాడు వరకు 5.49 కిలోమీటర్లకు గాను రూ.5.86 కోట్ల నిధులు మంజూరయ్యాయి. సుమారు వెయ్యి మంది జనాభాకు ఇది ఉపయోగపడనుంది. అలాగే సమిధ నుంచి తట్టబూడి, చిందులపాడు, పెదబూరగ మీదుగా చింతపాక వరకు 16.56 కిలోమీటర్లకు గాను రూ.16.67 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రెండు రోడ్ల నిర్మాణంతో సుమారు 1500 మంది జనాభాకు ఉపయోగపడుతుంది..