ఈసారీ అరకొర సరకులే!
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:12 AM
రేషన్ కార్డుదారులకు ఏప్రిల్‌లో కూడా కందిపప్పు, గోధుమ పిండి సరఫరా అయ్యే పరిస్థితి లేదు. వచ్చే నెలలో పంపిణీ చేయడానికి బియ్యం, పంచదార మాత్రమే పౌరసరఫరాల గోదాములకు చేరాయి. కందిపప్పు, గోధుమ పిండి సరఫరాపై పౌరసరఫరాల అధికారిని వివరణ కోరగా.. మే నెల నుంచి కందిపప్పు పంపిణీ అవుతాయని, గోధుమ పిండి కొనుగోలుకు రేషన్‌కార్డుదారులు ఆసక్తి చూపడం లేదన్నారు.

పౌరసరఫరాల గోదాములకు చేరని కందిపప్పు, గోధుమ పిండి
వచ్చే నెలలో కార్డుదారులకు బియ్యం, పంచదారతోనే సరి
రెండు నెలల నుంచి ఆగిన కందిపప్పు, గోధుమ పిండి సరఫరా
ప్రభుత్వం మారినా... తీరుమారని పౌరసరఫరాల శాఖ
నర్సీపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రేషన్ కార్డుదారులకు ఏప్రిల్‌లో కూడా కందిపప్పు, గోధుమ పిండి సరఫరా అయ్యే పరిస్థితి లేదు. వచ్చే నెలలో పంపిణీ చేయడానికి బియ్యం, పంచదార మాత్రమే పౌరసరఫరాల గోదాములకు చేరాయి. కందిపప్పు, గోధుమ పిండి సరఫరాపై పౌరసరఫరాల అధికారిని వివరణ కోరగా.. మే నెల నుంచి కందిపప్పు పంపిణీ అవుతాయని, గోధుమ పిండి కొనుగోలుకు రేషన్‌కార్డుదారులు ఆసక్తి చూపడం లేదన్నారు.
జిల్లాలో 5,37,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 1,069 చౌక ధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా ఉచితంగా బియ్యం, సబ్సిడీపై పంచదార అందిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు బియ్యం, పంచదారతోపాటు కందిపప్పు, వంట నూనె, చింతపండు, గోధుమ పిండి, తదితర సరకులు తక్కువ ధరకు అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం, పంచదారను మాత్రమే క్రమం తప్పకుండా సరఫరా చేశారు. కందిపప్పు, గోధుమ పిండిని అప్పుడప్పుడు అందించారు. అయితే వైసీపీ అధికారంలో వున్నప్పుడు కందిపప్పు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో ఆ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడింది. మరోవైపు గత ఏడాది (2023-24) తీవ్ర వర్షాభావం వల్ల కంది సాగుతోపాటు దిగుబడులు కూడా బాగా తగ్గిపోయాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.180 వరకుచేరింది. దీంతో ప్రభుత్వం కోట్ చేసిన ధరకు కందిపప్పు సరఫరా చేయలేమని వ్యాపారులు చేతులేత్తేశారు. దీంతో గత తొమ్మిది నెలల్లో రెండు నెలలు మాత్రమే కందిపప్పు, గోధుమ పిండి రేషన్ కార్డుదారులకు పంపిణీ చేశారు. కాగా గోధుమ పిండి అవసరమా? లేదా? అని రెండు నెలల క్రితం సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే చేయిస్తే అత్యధిక శాతం మంది కావాలని కోరారు. బహిరంగ మార్కెట్లో గోధుమ పిండి కిలో రూ.65 వుంది. రేషన్ డిపోల ద్వారా ప్రభుత్వం రూ.17లకు పంపిణీ చేసేది. దీంతో ఎక్కువ మంది గోధుమ పిండి సరఫరా చేయాలని కోరారు. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, గోధుమ పిండి సరఫరా చేయకపోవడంపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. మే నెల నుంచి కందిపప్పు సరఫరా చేస్తామని, గోధుమ పిండిని కార్డుదారులు తీసుకోవడంలేదని అన్నారు.