కొత్తూరు వంతెనకు ముప్పు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:59 AM
రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే కొత్తూరు వంతెన గోతులు ఏర్పడి ఛిద్రంగా మారింది. రాళ్లు లేచిపోయి అధ్వానంగా తయారైంది. వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా వుంటున్నది. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోయినా.. కనీసం గోతులు అయినా పూడ్చాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అడుగడుగునా గోతులతో అధ్వానం
కాంక్రీట్ లేచిపోయి బయటపడిన ఇనుప ఊచలు
వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణం
ఇబ్బంది పడుతున్న 30 గ్రామాల ప్రజలు
కొత్తూరు (అనకాపల్లి), మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే కొత్తూరు వంతెన గోతులు ఏర్పడి ఛిద్రంగా మారింది. రాళ్లు లేచిపోయి అధ్వానంగా తయారైంది. వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా వుంటున్నది. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోయినా.. కనీసం గోతులు అయినా పూడ్చాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అనకాపల్లి పట్టణాన్ని ఆనుకుని వున్న కొత్తూరు పంచాయతీ పరిధిలోని కాలేజీ రోడ్డు వంతెన మీదుగా అనకాపల్లి, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 30 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వైద్యం న నిమిత్తం నిత్యం వేలాది మంది వచ్చిపోతుంటారు. ఇంకా రైతులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి, పంటలకు అవసరమైన ఎరువులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు అనకాపల్లి వస్తుంటారు. నిత్యం రద్దీగా వుంటే ఈ మార్గాన్ని.. ప్రధానంగా వంతెనను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా నిర్వహణ పనులు చేయించలేదు. దీంతో రానురాను గోతులు అధికమై, ఇనుప ఊచలు బయటపడ్డాయి. . రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌పై పలకలు ధ్వంసమయ్యాయి. గోతులను తప్పించే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
భారీ వాహనాలతో ధ్వంసం
కశింకోట- బంగారుమెట్ట రోడ్డులో పలుచోట్ల రాయి, మెటల్ క్వారీలు వున్నాయి. పరిమితికి మించిన బరువుతో టిప్పర్లు, లారీలు ఈ వంతెన మీదుగానే వెళుతుంటాయి. దీంతో వంతెన త్వరగా పాడైపోతున్నది. బ్రిడ్జిపై సిమెంట్ కాంక్రీట్ లేచిపోయి ఇనుప ఊచలు ప్రమాదకరంగా బయటకు కనిపిస్తున్నాయి. భారీ వాహనాల రాకపోకలను నియంత్రించకపోతే వంతెన కూలిపోయే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.