Share News

బయటపడని నివేదిక!

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:10 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పలువురు ప్రొఫెసర్లకు సీనియర్‌ ప్రొఫెసర్లుగా ఆరేళ్ల కిందట పదోన్నతులు కల్పించారు.

బయటపడని నివేదిక!

  • ఏయూలో పదోన్నతుల వ్యవహారం

  • ఆరేళ్ల కిందటే నివేదిక సమర్పించిన విచారణ కమిటీ

  • ఇప్పటికీ వివరాలు వెల్లడించని అధికారులు

విశాఖపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పలువురు ప్రొఫెసర్లకు సీనియర్‌ ప్రొఫెసర్లుగా ఆరేళ్ల కిందట పదోన్నతులు కల్పించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో 2018 డిసెంబరు 19వ తేదీన ‘ఆచార్యుల పదోన్నతులపై ఏయూలో రచ్చ’ శీర్షికన కథనం కూడా ప్రచురితమైంది.

ఈ కథనంపై స్పందించిన ఉన్నత విద్యా మండలి పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఓ కమిటీని నియమించింది. ఇందులో అప్పటి సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సీఈఎస్‌ఎస్‌) చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.రాధాకృష్ణ, విక్రమ సింహపురి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ సీఆర్‌ విశ్వేశ్వరరావు, ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ర్టీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ పీఎస్‌ఎన్‌ రెడ్డిని సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ అనేక అంశాలను పరిశీలించి 2019లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తరువాత ఎన్నికలు జరగడం, ప్రభుత్వం మారడంతో నివేదిక మరుగున పడిపోయింది. ఈ విషయం తాజాగా వర్సిటీలోని పలువురు ప్రొఫెసర్ల దృష్టికి వచ్చింది. దీనిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది.

సీనియర్‌ ప్రొఫెసర్ల పదోన్నతులు వ్యవహారంలో కమిటీ అనేక లోటుపాట్లను నివేదికలో ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ నివేదిక బయటపడితే ఎంతోమంది నష్టపోవాల్సి వస్తుందని, అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, వర్సిటీలో చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి నివేదిక వెలుగుచూడకుండా చక్రం తిప్పినట్టు చెబుతున్నారు.

సీనియర్లకు అన్యాయం

జీవో 38 ప్రకారం 2018లో పదోన్నతులు ఇచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు వర్సిటీ ప్రొఫెసర్లలో పదింట ఒక వంతు మందికి సీనియర్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించేందుకు అవకాశం ఉంది. దీని ప్రకారం 14 మందికి సీనియర్‌ ప్రొఫెసర్లుగా అవకాశం ఇవ్వాలి. కానీ 11 మందితో సరిపెట్టారు. పదోన్నతికి సంబంధించి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని సక్రమంగా పరిశీలించకుండానే పలువురికి పదోన్నతులు కల్పించినట్టు విమర్శలు రావడంతో ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. సీనియర్‌ ప్రొఫెసర్‌ పదోన్నతులు వ్యవహారంలో అనుసరించిన విధానాలపై ఆటా ద్వారా ఏయూ పాలకులకు అప్పట్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అనర్హులకు పదోన్నతులు కల్పించడం వల్ల అర్హులైన వారు కీలక పదవులకు దూరం కావాల్సి వచ్చిందని, ఆర్థికంగానూ నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నత విద్యామండలి నాటి కమిటీ నివేదికను బయటపెట్టి నష్టపోయిన సీనియర్‌ ప్రొఫెసర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Mar 24 , 2025 | 01:10 AM