గెడ్డలో వ్యర్థాల తొలగింపు
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:55 AM
వడ్లపూడి గెడ్డలో వ్యర్థాలను ఎట్టకేలకు జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది తొలగించారు.

వడ్లపూడి వాసుల హర్షం
అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...
కూర్మన్నపాలెం, మార్చి 24 (ఆంద్రజ్యోతి):
వడ్లపూడి గెడ్డలో వ్యర్థాలను ఎట్టకేలకు జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది తొలగించారు. దుర్ఘంధంతో సతమతమవుతున్న కాలనీవాసులకు ఉపశమనం కల్పించారు. జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని తిరుమలనగర్‌లో ‘ఆంధ్రజ్యోతి’ జనవరి 28వ తేదీన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమం నిర్వహించింది. వడ్లపూడిలో ప్రధాన గెడ్డకు ఎగువ నుంచి వస్తున్న మురుగు అడ్డంకుల వల్ల నిలిచి పోవడంతో దుర్గంధం వెలువడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. సమస్యను పరిష్కరించాలని కార్యక్రమానికి హాజరైన స్థానిక కార్పొరేటర్ బొండా జగన్, ఇతర అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ జగన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అప్పారావు, ఏఎంఓహెచ్ కిరణ్‌కుమార్ చొరవతో సోమవారం ఎస్కవేటర్‌తో గెడ్డలో వ్యర్థాలను తొలగించారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో తమ సమస్య పరిష్కారమైందనీ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.