గనుల శాఖ కొరడా
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:13 AM
పెందుర్తి మండలం గుర్రంపాలెం ఏపీఐఐసీ పారిశ్రామిక లేఅవుట్, పక్కన రెవెన్యూ పరిధిలో గల కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్విన వారిపై ఎట్టకేలకు కొరడా ఝులిపించేందుకు గనుల శాఖ సిద్ధమైంది.

అనుమతులు లేకుండా గుర్రంపాలెంలో గ్రావెల్ తవ్వకాలు జరిపిన వారికి
నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
తొమ్మిది మందికి తొలుత షోకాజ్
5.2 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వినట్టు నిర్ధారణ
రూ.40 కోట్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని అంచనా
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
మరోవైపు కేసు మాఫీకి ఉన్నత స్థాయిలో పైరవీలు
విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలం గుర్రంపాలెం ఏపీఐఐసీ పారిశ్రామిక లేఅవుట్, పక్కన రెవెన్యూ పరిధిలో గల కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్విన వారిపై ఎట్టకేలకు కొరడా ఝులిపించేందుకు గనుల శాఖ సిద్ధమైంది. మొత్తం తొమ్మిది మందికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని నిర్ణయించింది. అనుమతులు లేకుండా 5.2 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వినందుకు అన్ని రకాల పన్నులు కలిపి సుమారు రూ.40 కోట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
ఏపీఐఐసీ లేఅవుట్‌లో ఎనిమిది ప్లాట్లు కొనుగోలుచేసిన పారిశ్రామికవేత్తలు వాటిని ఫిల్లింగ్ చేయడానికి సమీపంలో గల కొండ, దాని పక్కన రెవెన్యూ శాఖకు చెందిన కొండ నుంచి గత ఏడాదిగా అక్రమంగా గ్రావెల్ తవ్వుకున్నారు. నిబంధనల మేరకు అందుకు గనుల శాఖ నుంచి అనుమతులు పొందాలి. కానీ అవేమీ లేకుండా ఏపీఐఐసీ అధికారులు, స్థానిక రెవెన్యూ అఽధికారుల దన్నుతో భారీగా గ్రావెల్ తవ్వేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు కథనాలు రావడంతో తొలుత గనుల శాఖ రెగ్యులర్, ఆ తరువాత విజయనగరంలో గనుల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ప్లాట్ల ఫిల్లింగ్‌కు వినియోగించిన గ్రావెల్‌ను లెక్కించారు. ఇంకా ఏపీఐఐసీ, రెవెన్యూ పరిధిలో గల కొండల వద్ద కొలతలు తీసుకున్నారు. మొత్తం 5.2 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వినట్టు గుర్తించారు. అక్రమంగా తవ్విన గ్రావెల్‌కు సంబంధించి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి విశాఖలోని గనుల శాఖ ఏడీ కార్యాలయానికి ఫైలు పంపాలి. ఈలోగా కూటమి పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు గనుల శాఖ విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో చాలా రోజులు ఫైలు పక్కనపెట్టారు. దీనిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో మరోసారి కథనం వెలువడడంతో విజిలెన్స్ అధికారుల్లో కదలిక వచ్చి షోకాజ్‌లకు సంబంధించిన ఫైలును గనుల శాఖ ఏడీ కార్యాలయానికి పంపారు. దీని ప్రకారం ఏపీఐఐసీ లేఅవుట్‌లో ఎనిమిది ప్లాట్ల యజమానులు, అదే ప్రాంతంలో మరో ప్లాట్‌ను ఫిల్లింగ్ చేసిన వ్యక్తికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని గనుల శాఖ నిర్ణయించింది. అయితే ప్లాట్ల యజమానుల వివరాలు తెలియకపోవడంతో ఏపీఐఐసీకి లేఖ రాసి తరువాత షోకాజ్ జారీ చేయనున్నది. షోకాజ్ నోటీసు జారీచేసిన 15 రోజుల్లో సమాధానం తీసుకుని తరువాత జరిమానా నోటీస్ ఇస్తారు. అక్రమంగా 5.2 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వినందుకు సుమారు రూ.40 కోట్ల వరకు జరిమానా పడుతుందని గనుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలావుండగా గనుల శాఖ విజిలెన్స్ నుంచి విశాఖలోని రెగ్యులర్ కార్యాలయానికి షోకాజ్ నోటీసులు వెళ్లాయని తెలుసుకున్న మైనింగ్ చేసిన వారంతా కూటమికి చెందిన కీలక నేతలను కలిసి...జరిమానా లేకుండా చూడాలంటూ కోరుతున్నారు. గనుల శాఖ మంత్రిని కూడా కలిసే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.