వైద్యులకు వసతి సమస్య తీరేనా?
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:37 PM
చింతపల్లిలో వైద్యులకు వసతి సమస్య వెంటాడుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయకపోవడంతో వైద్యుల క్వార్టర్స్ పూర్తికాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. చింతపల్లిలో అద్దెకు ఇళ్లు అందుబాటులో లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వైసీపీ హయాంలో పూర్తికాని క్వార్టర్స్ నిర్మాణాలు
బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం
పనులను చేపట్టని కాంట్రాక్టర్
అద్దె గృహాలు లభించక వైద్యుల అవస్థలు
నర్సీపట్నం నుంచి రాకపోకలు
కొత్త ప్రభుత్వంలోనూ కనిపించని కదలిక
చింతపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): చింతపల్లిలో వైద్యులకు వసతి సమస్య వెంటాడుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయకపోవడంతో వైద్యుల క్వార్టర్స్ పూర్తికాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. చింతపల్లిలో అద్దెకు ఇళ్లు అందుబాటులో లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
వైద్యులు స్థానికంగా ఉండాలంటే ఇళ్లు అందుబాటులో ఉండాలని భావించిన గత టీడీపీ ప్రభుత్వం 2018 ఆగస్టులో క్వార్టర్స్ నిర్మాణానికి రూ.70 లక్షలను మంజూరు చేసింది. అదే ఏడాది నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ క్వార్టర్స్ నిర్మాణాలను ప్రారంభించారు. 2019 ఫిబ్రవరిలో టీడీపీ ప్రభుత్వం పునాదుల బిల్లు రూ.13 లక్షలు మంజూరు చేసింది. అనంతరం కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నిర్మాణాలు కొనసాగాయి. 2019 నవంబరు నాటికి రూ.18 లక్షలు వ్యయం చేసి కాంట్రాక్టర్ రెండు అంతస్తులు నిర్మించారు. అయితే ఈ బిల్లును వైసీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో పనులను కాంట్రాక్టర్ అర్థంతరంగా నిలిపివేశారు. ప్రస్తుతం మూడో అంతస్థు శ్లాబ్, గోడలు, టైల్స్, విద్యుత్, తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాల్సి వుంది.
నిర్మాణాలకు ముందుకురాని కాంట్రాక్టర్..
2021 ఏప్రిల్‌లో ఐటీడీఏ అధికారులు వైద్యుల క్వార్టర్స్ బకాయి రూ.18 లక్షలను మంజూరు చేశారు. అయితే రెండో విడత బిల్లులు చెల్లించేందుకు రెండేళ్ల సమయం నిరీక్షించాల్సి వచ్చిందని, పెట్టుబడి పెట్టి పనులు చేసిన తర్వాత బిల్లులు వస్తాయో.. రావోననే సందేహంతో నిర్మాణాలు కొనసాగించేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. కాగా క్వార్టర్స్ నిర్మాణాల గడువు 2021 ఏడాది అంతానికి ముగిసిపోయింది.
వసతి సమస్యను ఎదుర్కొంటున్న వైద్యులు..
చింతపల్లిలో వైద్యుల క్వార్టర్స్ నిర్మాణం పూర్తికాకపోవడంతో వైద్యులు వసతి సమస్యను తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్నారు. చింతపల్లి, జీకేవీధి మండలాల పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు చింతపల్లిలో ఇళ్లను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొంతమంది వైద్యులకు చింతపల్లిలో అన్ని వసతులు కలిగిన అద్దె ఇళ్లు లభించక నర్సీపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం చింతపల్లిలో రెండు బెడ్‌రూమ్‌లు, మరుగుదొడ్లు కలిగిన వసతి గృహాలు దొరకడం లేదు. వసతి సమస్య కారణంగానే మెజారిటీ వైద్యులు చింతపల్లిలో బస చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
క్వార్టర్స్ అందుబాటులోకి వస్తే..
చింతపల్లిలో నిర్మిస్తున్న క్వార్టర్స్ అందుబాటులోకి వస్తే ఆరుగురు వైద్యులు కుటుంబంతో నివాసం ఉండే అవకాశం కలుగుతుంది. ఈ క్వార్టర్స్‌లో వైద్యులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అందువల్ల వైద్యులు కూడా స్థానిక నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతారు.
ఎన్డీయే ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైద్యుల క్వార్టర్స్ నిర్మాణాలకు కదలిక వస్తుందని వైద్యులు ఆశ పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ క్వార్టర్స్ పూర్తి చేసేందుకు కనీస చర్యలు చేపట్టకపోవడంతో వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనులు చేయకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారింది. భవనంలో రెండు అంతస్తుల్లోనూ ప్రతి రోజూ సాయంత్రం మందుబాబులకు బార్‌గా ఉపయోగపడుతుందని స్థానికులు అంటున్నారు. ఈ భవనం చుట్టూ ఉన్న మద్యం సీసాలే ఇందుకు నిదర్శమని చెబుతున్నారు. ఎన్డీయే ప్రభుత్వం క్వార్టర్స్ పూర్తికి చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.