కార్మికుల జొలికొస్తే ఉద్యమం
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:14 AM
స్టీల్‌ప్లాంట్‌లో ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని తొలగించినా ప్లాంట్‌ను దిగ్బంధిస్తామని అఖిలపక్ష కార్మిక, రాజకీయ నాయకులు హెచ్చరించారు.

‘ఉక్కు’ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు సరికాదు
ఉపాధి రక్షణ పేరుతో అఖిలపక్ష రాజకీయ, కార్మిక నేతల పాదయాత్ర
గాజువాక, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంట్‌లో ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని తొలగించినా ప్లాంట్‌ను దిగ్బంధిస్తామని అఖిలపక్ష కార్మిక, రాజకీయ నాయకులు హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించవద్దని డిమాండ్ చేస్తూ కొత్త గాజువాక నుంచి కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వరకు ‘ఉపాధి రక్షణ’ పేరుతో ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించారు. కొత్తగాజువాక జంక్షన్ వద్ద ప్రారంభమైన యాత్రనుద్దేశించి పలువురు నాయకులు మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్నో ఏళ్ల పాటు ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను తీసివేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కార్మికుల జోలికొస్తే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామన్నారు. ప్లాంట్‌ను పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరించమని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తొలగించిన 248 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. పాదయాత్రలో అఖిలపక్ష నాయకులు సీహెచ్ నరసింగరావు, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్, కేఎస్‌ఎన్.రావు, డీవీ.రమణారెడ్డి, జి.శ్రీనివాస్, మంత్రి రవి, లోకనాథం, రమణ, వంశీకృష్ణ, వేణుగోపాల్, రాజకీయ నేతలు తిప్పల దేవన్‌రెడ్డి, లక్కరాజు రామారావు, సోంబాబు పాల్గొన్నారు. ఈ యాత్ర కొత్తగాజువాక నుంచి పాతగాజువాక, చినగంట్యాడ, శ్రీనగర్, వడ్లపూడి మీదుగా కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వరకు సాగింది.