అడవిలో 6 కిలోమీటర్లు!
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:18 AM
‘రెండు దశాబ్దాలుగా మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బడి మాత్రం రావడం లేదు.

జియ్యమ్మవలస, మార్చి 20(ఆంధ్రజ్యోతి)
‘రెండు దశాబ్దాలుగా మా గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బడి మాత్రం రావడం లేదు. మా పిల్లల చదువు, వారి భవిష్యత్ కోసం ఎంతో ఆందోళన చెందుతున్నాము. మా ఆవేదన అరణ్యరోదనలా మిగిలిపోతోంది. దయచేసి మా పరిస్థితి ఒక్కసారి అర్ధం చేసుకోండి’ అంటూ జియ్యమ్మవలస మండలం టీకే జమ్ము పంచాయతీ కూటం గ్రామ గిరిజనులు వేడుకుంటున్నారు. కనీసం వచ్చే ఏడాది నుంచి అయినా పాఠశాల ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
- కూటం టీకే జమ్ము పంచాయతీలో మారుమూల గిరిజన గ్రామం. ఈ గ్రామంలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు తమ చదువుకోవాలంటే ఆరు కిలో మీటర్లు కాలినడకన గోర్లి గ్రామానికి వెళ్తున్నారు. అదీకూడా అటవీ ప్రాంతంలో.. రాళ్లు తేలిన కాలిబాటన వెళ్తున్నారు. పాఠశాలకు వెళ్లిన నుంచి తిరిగి ఇంటికి వెళ్లేవరకు వారి తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. ఈ విద్యార్థులు ఎండకు, వర్షాలకు భయపడి కొన్ని రోజులు బడికి దూరంగా ఉండాల్సి వస్తోంది. బడికి వెళ్తున్నప్పుడు.. తిరిగి వస్తున్నప్పుడు భారీ వర్షాలు కురిస్తే తమ పిల్లల గతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే అటవీజంతువులు వస్తే వారిని ఎలా రక్షించుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడచిన రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను కోరుతున్నామని, ఎవరూ తమగోడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పాఠశాల ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల చాలామంది చదువు మానేస్తున్నారని వారు చెబుతున్నారు.
భయపడుతున్నాం..
పిల్లలు మా గ్రామం నుంచి గోర్లి గ్రామానికి చదువుకో వడానికి వెళ్తే చాలా భయపడుతున్నాం. ఆరు కిలోమీటర్లు కాలినడకన అడవి మధ్య రాళ్లు తేలిన రోడ్డుపై వెళుతు న్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాం.
- కొండగొర్రి సుశీల, గిరిజన మహిళ, కూటం గ్రామం
మా పరిస్థితి అర్థం చేసుకోండి
ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మా పరిస్థితిని అర్థం చేసుకోవా లి. మా పిల్లల భవిష్యత్ అంధకారంలో పడిపోతోంది. చదు వుకోవాలనే ఆశ మా పిల్లలకు, చదివించాలనే ఆశ మాకు ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాం. గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయండి.
-కొండగొర్రి నాగేశ్వరరావు, గ్రామపెద్ద, కూటం గ్రామం
ఆందోళనకరమే
కూటం గ్రామం నుంచి గోర్లి గ్రామానికి చదువుకోవడానికి చిన్నారులు కాలినడకన వస్తుండటం చాలా ఆందోళనకరమే. చాలా దారుణమైన పరిస్థితి. పాఠశాల ఏర్పాటు చాలా అవసరం. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలి.
-బిడ్డిక సుగ్రీవులు, ప్రతినిధి, ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ, గోర్లివలస గ్రామం
పరిశీలిస్తాం
కూటం గ్రామంలో పాఠశాల ఏర్పాటు విషయం నా దృష్టికి వచ్చింది. పూర్తి పరిశీలన చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
-కె.చంద్రబాబు, ఏటీడబ్ల్యూవో, కురుపాం సబ్ డివిజన్