Pension Distribution పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:55 PM
All Set for Pension Distribution జిల్లాలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఒకటో తేదీన ఏడు గంటల నుంచి పంపిణీ ప్రారంభించాలని, మొదటి రోజునే శతశాతం పింఛన్ల అందజేతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పార్వతీపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఒకటో తేదీన ఏడు గంటల నుంచి పంపిణీ ప్రారంభించాలని, మొదటి రోజునే శతశాతం పింఛన్ల అందజేతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 1,39,752 మందికి ఎన్టీఆర్ భరోసా కింద రూ.59.72 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.‘ఉపాధి హామీ పథకం కింద 117 సాగునీటి వనరుల్లో పూడికలు తీసే అవకాశం ఉంది. 331 ప్రహరీలు మంజూరు చేయగా 317 పనులు ప్రారంభమయ్యాయి. వంద ఎకరాలకు మించి ఆయకట్టు ఉన్న చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలి. ప్రతి కుటుంబం ఆదాయ వనరుకు అవకాశం ఉన్న రంగాన్ని ఎంచుకోవాలి. రాగిపిండి తయారీ, పసుపు, చింతపండు ప్రాసెసింగ్, చేపల పెంపకం, ఉద్యాన పంటలు , చెత్త నుంచి సంపద తయారు వంటివి చేపట్టాలి. జిల్లాలో కనీసం పది వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంచాలి. పది వేల కుటుంబాలకు సూర్యఘర్ కింద విద్యుత్ అందించాలి. పబ్లిక్ పర్సెప్షన్‌లో జిల్లా నాలుగో స్థానంలో ఉండడంపై ముఖ్యమంత్రి ప్రశంసించారుు. ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలు పక్కాగా ఉండాలి. బడిఈడు పిల్లలు విధిగా పాఠశాలల్లో ఉండాలి. లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు పాఠశాల విద్యార్థుల్లో మృతులు ఉంటే వారి వివరాలు, విశ్లేషణతో సహా ఉండాలి. ఉపాధ్యాయ, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి. చదవడం, రాయడంలో విద్యార్థి అందివేసిన చేయి కావాలి. మైస్కూల్ మై ప్రైడ్ కార్య క్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి పటిష్ఠంగా అమలు చేస్తాం. జీరో పాపర్టీ పీ-4 సర్వేలో జిల్లా పౌరుల భాగస్వాములు కావాలి. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లావ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలు, సంస్థలు, సంఘాల సహకారం తీసుకోవాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టాలి.’ అని తెలిపారు.