Innovative inter education వి‘నూతన‘ంగా ఇంటర్ విద్య
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:50 PM
Innovative inter education ఇంటర్ విద్యను మరింత మెరుగ్గా ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఆ ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి 23 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్నాయి.

వి‘నూతన‘ంగా ఇంటర్ విద్య
నేటి నుంచి ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు
7 నుంచి ప్రథమ సంవత్సర ప్రవేశాలు
ఉత్తర్వులు జారీచేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి
రాజాం రూరల్, మార్చి31(ఆంరఽధజ్యోతి): ఇంటర్ విద్యను మరింత మెరుగ్గా ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఆ ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి 23 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్నాయి. అలాగే పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూడకుండా ఏప్రిల్ 7నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశించేందుకు వీలు కల్పించింది. హాల్‌టికెట్ ఆధారంగా తనకు నచ్చిన కళాశాలలో ప్రవేశం పొందేలా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ఈమేరకు ఇప్పటికే ఇంటర్ బోర్టు కార్యదర్శి కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏప్రిల్ 24 నుంచి మే చివరి వరకూ సెలవులు ఇస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
- జిల్లాలో 72 ప్రభుత్వ, 107 ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 20,907 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్పరం పరీక్షలు రాసి ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. వీరంతా ఏప్రిల్ 1 నుంచి సెకెండ్ ఇయర్ తరగతులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. సెలవులు అనంతరం జూన్ రెండో తేదీ నుంచి తిరిగి ఇంటర్ తరగతులు ప్రారంభిస్తారు.
మరిన్ని మార్పులు..
తరగతుల నిర్వహణతో పాటు ఇంటర్ విద్యలో మరిన్ని మార్పులు తీసుకువచ్చారు. దసరా, సంక్రాంతి సెలవుల్లో ఎలాంటి మార్పులూ తేలేదు. సైన్స్ విద్యార్థులకు రికార్డులతో పాటు ఒక్కో విద్యార్థికి 12 క్లాస్‌మేట్ బ్రాండ్ పుస్తకాలు (ఆరు రూల్స్), ఆరు వైట్ పుస్తకాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు జిల్లా కేంద్రాలలో వీటిని భద్రపరిచేందుకు ప్రత్యేకంగా గదులను సిద్ధం చేయాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నుంచి జిల్లా కేంద్రానికి ఆదేశాలందాయి. గతానికి భిన్నంగా ఇంటర్ పరీక్షల్ని మార్చికి బదులు ఫిబ్రవరిలోనే నిర్వహించేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గతంలో ఏటా 215 నుంచి 224 రోజులుండే ఇంటర్ పనిదినాలు ఇకపై 235కి పెరగనున్నాయి.
హాల్‌టికెట్‌తోనే..
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు హాల్‌టికెట్‌తోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశం పొందే వెసులుబాటు కల్పించారు. బ్రిడ్జికోర్సు పేరిట ఏప్రిల్ ఒకటి నుంచి ఆసక్తి ఉన్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని, ఏడు నుంచి ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేఽఽశారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల సిబ్బంది పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నారు.
ఒకటి నుంచి తరగతులు
ఆదినారాయణ, ఆర్‌ఐవో, విజయనగరం.
ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ ఒకటి నుంచి జిల్లాలో ఇంటర్ సెకెండ్ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జిల్లాలోని 72 ప్రభుత్వ, 107 ప్రయివేటు జూనియర్ కళాశాలల్లో ఏర్పాట్లు చేయాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు స్పష్టం చేశాం. ఏప్రిల్‌లో ఎండల్ని దృష్టిలో ఉంచుకుని ఒకపూట మాత్రమే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.